ఆస్పత్రిలోనే కొవిడ్‌ బాధితుల మృతదేహాలు

ABN , First Publish Date - 2021-05-13T06:34:00+05:30 IST

కుటుంబీకుల భయాందోళన, పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతో శ్రీకాళహస్తి ఆస్పత్రి ఆవరణలోనే కరోనా బాధితుల మృతదేహాలు ఉండిపోతున్నాయి.

ఆస్పత్రిలోనే కొవిడ్‌ బాధితుల మృతదేహాలు
శ్రీకాళహస్తి ఆస్పత్రి ఆవరణలో కరోనా బాధితుల మృతదేహాలు

శ్రీకాళహస్తి, మే 12: కొవిడ్‌ విజృంభణ అమాయకుల ప్రాణాలు తీస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమై చివరి నిమిషంలో వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించే వారిలో రోజుకు సగటున ముగ్గురు బాధితులు మృతిచెందుతున్నారు. అయితే ఇక్కడి మార్చురీ మృతదేహాలతో నిండిపోవడంతో ఆరుబయటే శవాలను ఉంచుతున్నారు. వీటిని శ్మశానానికి తరలించడంలో పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 

    శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వంద పడకలుండగా, 50 బెడ్లను కొవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. మొదట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఆశ్రయించే వారి సంఖ్య తక్కువగా ఉండేది. సెకండ్‌ వేవ్‌ ఉధ్రుతితో కొంతకాలంగా అధికసంఖ్యలో కొవిడ్‌ బాధితులు ఇక్కడికి వస్తున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన బాఽధితులూ ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తున్నారు. ఆ మేరకు.. మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. సగటున రోజుకు ముగ్గురు నుంచి నలుగురి వరకు చనిపోతున్నారు. 


భయాందోళనే కారణం.. 

శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్‌తో మృతిచెందిన బాధితుల శవాలను కొంతమంది మాత్రమే స్వగ్రామాలకు తరలిస్తున్నారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంతో అధికశాతం మంది ఆప్తుల మృతదేహాలను తీసుకునేందుకు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ఇక్కడి మార్చురీలో రెండు మృతదేహాలను మాత్రమే ఉంచే అవకాశం ఉండడంతో, కొవిడ్‌ బాధితుల శవాలను ఆస్పత్రి ఆవరణలో ఉంచాల్సి వస్తోంది. అయితే వీటిని తీసుకు వెళ్లడంలో మృతుల బంధువుల నుంచి వైద్య సిబ్బంది సకాలంలో సమాచారం అందడం లేదు. కొందరు తమ వాళ్ల శవాలను తీసుకు వెళ్లమని తేల్చిచెబుతున్నారు. ఇలాంటి మృతదేహాలకు పురపాలక సిబ్బంది ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేయించాల్సి వస్తోంది. దీనికి సంబంధించి మున్సిపల్‌ అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సకాలంలో సమాచారం ఇస్తున్నా, కార్మికులు రావడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఈ కారణంగా కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడం సమస్యగా మారింది. ఇకనైనా వైద్యశాఖ, మున్సిపల్‌ అధికారులు స్పందించి కొవిడ్‌ మృతులకు సకాలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 


ఆ నలుగురు లేకనే..! 

కరోనా రక్కసి పంజాకు బలైన కొవిడ్‌ మృతుల చివరి మజిలీకి ఆ నలుగురు కూడా కరువవుతున్నారు. ఇలాంటి దృశ్యాలు నిత్యం శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖి నదీప్రాంతంలో కన్పిస్తున్నాయి. పట్టణ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిత్యం కరోనా బాధితుల మరణాలు సంభవిస్తున్నాయి. అధికశాతం మృతదేహాలను తీసుకు వెళ్లడం లేదు. దీంతో పురపాలక సంఘ అధికారులు పారిశుఽధ్య కార్మికుల సాయంతో స్వర్ణముఖి నదీప్రాంతంలో కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. 



Updated Date - 2021-05-13T06:34:00+05:30 IST