అమరావతి: వైసీపీ దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. లోకేష్ మాట్లాడుతూ ప్రతిపక్షనేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాలని పంపావంటేనే, నీ దిగజారుడుతనం అర్థమవుతోందని.. సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. జగన్ రోజురోజుకూ అధఃపాతాళంలోకి దిగజారుతున్నారన్నారు. తాడేపల్లిలోని నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరమనే విషయం తెలుసుకునే రోజు త్వరలో వస్తుందని తెలిపారు.
జగన్ రెడ్డి గాలి హామీలు తేలిపోయాయని.. ఒకప్పటి ఆయన ముద్దులే.. ప్రస్తుతం పిడిగుద్దుల్లా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్‌ది అంతా నాటకమనే విషయం.. జనానికి తెలిసిపోయిందన్నారు. తమ పరిస్థతిపై ఉలిక్కిపడి.. ప్రతిపక్షంపైకి రౌడీలను పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు.. జగన్ లాంటి క్రూర, నేరస్వభావం కలవారు కాదని గుర్తు చేశారు. త్వరలో ఒక్కొక్కరికి.. వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు.