స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి

ABN , First Publish Date - 2022-10-02T06:49:49+05:30 IST

కవిసిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు కొంత మంది ఇంటి పేరో, ఊరికొక్క వీధి పేరో కాదు– గాంధీ. మనం నిత్యం కరెన్సీ నోట్ల మీద చూసే బొమ్మ, నడి రోడ్డు మీద దాటే విగ్రహం అంతకన్నా కాదు...

స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి

కవిసిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు కొంత మంది ఇంటి పేరో, ఊరికొక్క వీధి పేరో కాదు– గాంధీ. మనం నిత్యం కరెన్సీ నోట్ల మీద చూసే బొమ్మ, నడి రోడ్డు మీద దాటే విగ్రహం అంతకన్నా కాదు. దాస్య శృంఖలాల నుంచి భారతమాతకు విముక్తి సాధించిన మహోన్నత స్వాతంత్ర్య యోధుడు గాంధీ. స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి గాంధీ. పదవులు కోరని పావని మూర్తి. జనకోటి హృదయాలు ఏలిన చక్రవర్తి, అహింసా తత్వ ప్రవక్త... ఇలా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుదలగా నిలబడి, ఆచరించి ప్రపంచ చరిత్ర ప్రగాఢ ముద్ర వేసిన మహాత్ముడు. ఆయన జన్మదినమైన అక్టోబర్ 2ని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ఆయన అగ్రగణ్యుడు. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని విడదీసి చూడలేం. అహింసాత్మకంగా పోరాడితేనే స్వాతంత్ర్యోద్యమం సామాన్య జనంలో విస్తరిస్తుందని ఆయన విశ్వసించారు. ఆనాటికి దేశంలో జమీందారీ వ్యతిరేక పోరాటాలతో సహా దేనిని చూసినా ప్రధానంగా హింసే కనిపిస్తుంది. కానీ, బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా ఆయన నిర్వహించిన పోరాటాలన్నీ అహింసాత్మక పద్ధతుల్లోనే జరిగాయి. అలా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన ఈ అహింసామూర్తి చివరకు ఒక మతోన్మాది ఘాతుకానికి బలికావడం ఒక విషాదం. బ్రిటన్‌లో న్యాయవాదిగా అడుగుపెట్టినప్పుడు జాతివివక్షను ప్రత్యక్షంగా అనుభవించి, దానిని ఎదిరించి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగివచ్చాక జీవితపర్యంతం అస్పృశ్యత, కుల వివక్ష, మత విద్వేషాలకు వ్యతిరేకంగా నిలిచిపోరాడాడు. 


ఆయన అనుసరించిన, సత్యాగ్రహం, అహింసాయుత మార్గాలమీద జలియన్ వాలాబాగ్ ఘటన తరువాత వ్యతిరేకత ఎదురైనప్పటికీ వాటినే నమ్ముకున్నాడు, స్వరాజ్యం సాధించాడు. ఆయన చూపిన సహాయనిరాకరణ మార్గం బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టింది, క్విట్ ఇండియా ఉద్యమం పాలకుల గుండెల్లో దడపుట్టించింది. ఉద్యమంలో ఉన్నా, జైల్లో ఉన్నా తన ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ వెనక్కుతగ్గని ధీరుడు ఆయన. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడాన్ని చివరివరకూ వ్యతిరేకించి, విధిలేక దానికి లొంగిన గాంధీని దేశం ముక్కలుకావడం తీవ్రంగా బాధించింది. దేశ విభజన ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు ఇవ్వాల్సిన రూ.55 కోట్లు ఆ దేశానికి ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించినప్పుడు నిరాహారదీక్షకు దిగి మరీ ఒప్పిండం గాంధీ పట్ల కొందరికి ద్వేషం పెంచింది. ముస్లింలకు ఆయన వత్తాసు పలుకుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశానికి తీరని నష్టం వాటిల్లుతుందనే ప్రచారం జరిగింది. అదే ఆయన హత్యకు కారణమయ్యింది. 1948 జనవరి 30 సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్ధనా మందిరానికి వెళుతుండగా, నాథూరామ్ గాడ్సే ఆయన్ని కాల్చి చంపాడు. జగత్తును ప్రభావితం చేసిన ఓ మహా ప్రాణం ‘హే రామ్’ అంటూ అనంత వాయువుల్లో కలిసిపోయింది. అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు తమకు స్ఫూర్తిదాయకమని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అనడం గాంధేయ పద్ధతులకు వర్తమాన ప్రపంచం ఎంత ప్రాధాన్యమిస్తుందో అర్థమవుతుంది. నేటి మన సమస్యలను గాంధీ మార్గంలో మాత్రమే పరిష్కరించుకోగలమనడంలో అతిశయోక్తి లేదు.

పీలి కృష్ణ 

(నేడు గాంధీ జయంతి, 

అంతర్జాతీయ అహింసా దినోత్సవం)

Updated Date - 2022-10-02T06:49:49+05:30 IST