అప్పటి చీకటి పరిస్థితులే ఇప్పుడూ...

ABN , First Publish Date - 2022-07-10T06:10:13+05:30 IST

కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి మోదీ ఇటీవల జర్మనీ పర్యటనలో తీవ్ర విమర్శలు చేశారు. 1975లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై...

అప్పటి చీకటి పరిస్థితులే ఇప్పుడూ...

కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి మోదీ ఇటీవల జర్మనీ పర్యటనలో తీవ్ర విమర్శలు చేశారు. 1975లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై మండిపడ్డారు. ఇది నిజంగా దారుణమే కాకుండా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చే. ఇలాంటి సంఘటనలు ఎంత మాత్రం క్షమార్హం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీచేసింది‌. ఆ సమయంలో ప్రజా హక్కులు దారుణంగా అణిచివేయబడ్డాయని మోదీ దుయ్యబట్టారు. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురి అయింది. ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సైతం ఆ సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తపరుస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పింది.


ఎమర్జెన్సీ సమయంలో ప్రజలకు రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని హక్కులూ హరించారు. అయితే ఎమర్జెన్సీ విధించిన అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎమర్జెన్సీ పేరుతో ప్రజల హక్కులు హరించారు. నేడు అప్రకటిత ఎమర్జెన్సీని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ప్రజలను ముఖ్యంగా ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని వేదనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై లేదా ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబిఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నాయి. విమర్శించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై దాడులు సహజంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ‘బుల్డోజర్’ని దాదాపు అన్ని రాష్ట్రాలు తమ ప్రత్యర్థులపై వాడుతున్నాయి. ఇక ప్రతిపక్షాలు, పాత్రికేయులు, విమర్శకులు, ఉద్యమకారుల నోళ్ళు మూయించే ఆయుధంగా రాజద్రోహం చట్టం అక్కరకొస్తోంది. అస్సాం, హర్యానా, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేసులు అధికంగా వెలుగుచూస్తున్నాయి. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల ఎవరికైనా విశ్వాసం ఉంటే, హింసను ప్రోత్సహించనంతవరకు తమ భావనలను వారు స్వేచ్ఛగా వెల్లడించవచ్చని మహాత్మాగాంధీ స్పష్టం చేశారు. ఆయనతో పాటు తిలక్, భగత్‌సింగ్ తదితరులపై ఆంగ్లేయులు ప్రయోగించిన క్రూర శాసనానికి స్వతంత్ర భారతంలో స్థానం ఉండకూడదని నాటి నాయకులు అభిలషించారు. కానీ వారి ఆశలను కాలరాస్తూ ఐపీసీ సెక్షన్లలో అలాగే మిగిలిపోయింది. రాజద్రోహచట్ట నిబంధన వినియోగానికి లక్ష్మణరేఖ అవసరం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వంటి ప్రతి చిన్న విషయానికి పోలీసులు కేసులు పెట్టి వేధించడం మనం చూస్తూనే ఉన్నాం. నాటి ఎమర్జెన్సీ పరిస్థితికి, నేటికీ పెద్ద తేడా ఏమీ లేదు. అప్రకటిత ఎమర్జెన్సీతో అదే పద్ధతినే ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి.

అవధానం శ్రీనివాస్

Updated Date - 2022-07-10T06:10:13+05:30 IST