Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 08 Nov 2021 00:46:40 IST

ప్రగతిశీలతకు పునాది వేసిన దఖనీ కవితోద్యమం

twitter-iconwatsapp-iconfb-icon
ప్రగతిశీలతకు పునాది వేసిన దఖనీ కవితోద్యమం

తొలుత గోలకొండ సామ్రాజ్యమూ, తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రమూ నిరంతరం యూరోప్‌తో సంబంధాలు కలిగి ఉండేవి. అందువల్ల అక్కడ జరిగిన ఆధునిక కళా సాహిత్య శాస్త్ర రంగ పరిణామాలతో ఇక్కడ బుద్ధిజీవులకు సాధికారమైన పరిచయం ఉండేది. ఆంగ్లపాలిత ప్రాంతాలలో  కంటే హైదరాబాద్‌ రాష్ట్రంలోనే ఉర్దూ, తెలుగు భాషాసంస్కృతుల వికాసం ఉన్నత స్థాయిలో జరిగింది. హైదరాబాద్‌ రాష్ట్రాన 1800ల నాటికే ఆధునిక ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు కావటంతో స్థానిక భాషా, సాహిత్యాల వికాసానికి బీజాలు పడ్డాయి. యూరోపియన్‌ వికాస ఉద్యమంలో భాగంగా వెలువడిన శాస్త్ర గ్రంథాలను ఉర్దూలో తర్జుమా చేయటం కోసం 1870లో హైద రాబాద్‌ నగరాన ‘దైరాతుల్‌ మారీఫ్‌’ పేరుతో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఆనాటి హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది. యూరోప్‌ కేంద్రంగా 18వందల నాటికే వెలువడిన శాస్త్ర గ్రంథా లను జన సామాన్యానికి అందించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ పుస్తకాల్లో అత్యధికం ఆంగ్ల తర్జుమాలే అయినప్పటికీ వాటిలో స్వల్పంగా మారాఠీ, తెలుగు గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆంగ్ల గ్రంథాల తర్జుమా కోసం దేశవ్యాప్తంగా ఉండే ఉర్దూ భాషా పండితులను, విద్వాంసులను హైదరా బాద్‌కు రప్పించి ఉద్యోగ వసతి కల్పించారు. ఈ ఘటనాక్రమం మొత్తంగా ఆనాటి భారత ఉపఖం డాన్ని ప్రభావితం చేసింది. ఇదే కాలంలో 1857 తిరుగుబాటు వల్ల శతాబ్దాల తరబడి ఉత్తరాదికి రాజధానిగా ఉన్న ఢిల్లీ ఆంగ్లేయుల హస్తగతమైంది. ఫలితంగా మొఘల్‌ రాజవంశాన్ని ఆశ్రయించుకుని బతికే కవులు, సంగీతకారులు ఉపాధి కోల్పోయారు. వీరికి ఆశ్రయం కల్పించాలని హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. అలా అనేకమంది ఉర్దూ విద్వాంసులు, కవులు, రచయితలు, సంగీతకారులు ఇక్కడకు వలస వచ్చారు. వీరిలో కొందరు దర్బారులో ఉద్యోగాలు పొందారు. మరికొందరు 1850లలో హైద రాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయం దారుల్‌ ఉలూంలోను, దాని అనుబంధ పాఠశాలలూ ఇతర సంస్థల్లోను ఉద్యోగం పొందారు. ఇంతేకాకుండా ఉర్దూ సాహిత్యరంగంలో ఆధునిక ఆంగ్ల కవితాధోర ణులను పరిచయం చేసిన అల్తాఫ్‌ హాలి హుస్సేన్‌ సహా ప్రేమ్‌చంద్‌ వంటి వారికి ఆర్థిక సహాయాలు అందాయి. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడేంతవరకు ఇది కొనసాగింది. క్రమంగా ఉత్తరాది నుంచి వచ్చిన కవి పండితులకూ, స్థానిక కవి పండితులకూ మధ్య స్పర్థ వాతావరణం పెరిగింది. ఇదే క్రమంగా ముల్కీవాదానికి, దఖనీ భాషా సంస్కృతుల వికాస ఉద్యమానికి, తరువాత ప్రగతిశీల సాహిత్యోద్యమానికి దారి తీసింది. 


ఉత్తరాది కవి పండితులకూ, స్థానిక కవి పండితులకూ మధ్య స్పర్థకు కారణం లేకపోలేదు. బతుకుదెరువుకోసం దాగ్‌ దహేల్వీ, అమీర్‌ మినాయి వంటి ఢిల్లీ మహాకవులతో సహా హైదరాబాద్‌లో స్థిరపడిన అనేకమంది ఉత్తరాదికవులు ఇక్కడి దఖనీ బాషను, సంస్కృతినీ చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. నిజాముల దర్బారులో ఉద్యోగం సంపాదించిన వీరంతా ఢిల్లీ, లక్నోల భాషా సంస్కృతులే ఉన్నతమైనవన్న వాదనను ప్రచారంలో పెట్టారు. స్థానిక కవి పండితులలో ఈ ధోరణిపట్ల వ్యతిరేకత మొదలైంది. అంజద్‌ హైదరాబాదీ వంటి మహాకవి ఈ ధోరణిపై తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ రాష్ట్రం లోనేగాక తెలంగాణ కేంద్రంగా స్థానికులైన కవి, పండితులు ఏకమయ్యారు. ఉత్తరాదివారి ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ దఖనీ కవితోద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ కవితోద్యమాన్ని దర్బారీ రచనారీతిపై దఖనీ కవిత్వం చేసిన ఉద్యమంగా చెప్పవచ్చు. పర్షియన్‌ ప్రభావంతో లక్నో, ఢిల్లీ రాజాశ్రయాలలో ఆనాటి ఉర్దూ విద్వాంసుల మన్ననపొందిన ఫ్యూడల్‌, దర్బారీ రచనా రీతిని, కవితాభివ్యక్తిని దఖనీ కవితోద్యమం తిరస్కరించింది. స్థానికత కేంద్రంగా దఖనీ సొగసుతో ఉర్దూ కవితాభివ్యక్తి తిరిగి ప్రజాకవితా సంప్రదాయంగా బలపడింది. 1920ల నాటికే ఇది సంభవించింది. ఇదే కాలాన ‘పయాం’, ‘రయ్యత్‌’, ‘నిగార్‌’ వంటి పత్రికలు వెలువడి స్థానిక కవితాభివ్యక్తికి పట్టంకట్టాయి. అనేక మంది యువకవులు దకనీ ఉర్దూ సాహిత్యంలోకి అడుగు పెట్టారు. అబ్దుల్‌ హక్‌ వంటి భాషావేత్తల వల్ల దకనీ ఉర్దూ సరికొత్త వెలుగులను సంతరించుకున్నది. 


ఉదారవాద ప్రజాస్వామికవాది ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ సంపా దకుడైన ‘పయాం’, కొండా వెంకటరంగారెడ్డి స్థాపించగా మందు ముల నర్సింగ్‌ రావు ఎడిటర్‌గా ఉన్న ‘రయ్యత్‌’ పత్రికలు ఆనాటి ప్రగతిశీల సంచలనాలకు వేదిక మారాయి. దఖనీ కవులకు ఈ పత్రికలు ఊతమివ్వడంతో దఖనీ కవితోద్యమం ఉధృతమై జాతీయ ఉర్దూ సాహిత్య ప్రపంచాన్ని, అప్పుడప్పుడే దేశంలోకి విస్తరిస్తున్న ప్రగతిశీల భావ ప్రేరేపితులైన అనేకమందిని ఆకర్షించింది. ఈ పోకడే మఖ్దూం మొహియుద్దీన్‌ వంటి మహాకవి ఆవిర్భావానికి దారులు వేసింది. రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకో వడంతో లండన్‌, పారిస్‌, బెర్లిన్‌ వంటి యూరోప్‌ నగరాలకు చదువుకోవడానికి వెళ్లిన (అక్కడ ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా భారతజాతీయోద్యమానికి మద్దతుగా నిలిచిన) హైదరాబాద్‌, తెలంగాణ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇట్లా వచ్చిన వారిలో సరోజినీనాయుడు కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు, పింగళి మధుసూదన్‌రెడ్డి, బాకర్‌ అలీ మిర్జా, మెహదీ అలీ మిర్జా, జాకిర్‌ హుస్సేన్‌, మెహదీ అలీ మిర్జా, నిజాం కళా శాల ప్రిన్సిపాల్‌ అఘోరనాథ్‌ చటోపాధ్యాయ మరో కుమార్తె సుహాసినీ చటోపాధ్యాయ, వనపర్తి రాజా రాందేవ్‌రావు, జస్టిస్‌ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి. హరిన్‌ చట్టో, పింగలి మధుసూదన్‌ రెడ్డి, ఫజలుర్‌ రహ్మన్‌, దామోదర్‌రెడ్డి, సిరిగూరి జయరావు వంటి వారు ఉన్నారు.


మరో యువ మేధావి పింగళి జనార్దన్‌రెడ్డిని ప్రముఖంగా పేర్కోవాలి. ఈయన యూరోప్‌లో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చదువుకోవడానికి వెళ్లి అక్కడ సరోజినీ నాయుడికి సోదరుడైన వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ స్థాపించిన ‘లీగ్‌ ఎగెనిస్ట్‌ ఇంపీరి యలిజం’ వంటి సంస్థ నిర్మాణంలో, దాని ఉద్యమంలో పాల్గొంటూ అనుమానాస్పదంగా మరణించారు. అక్కడ ఉండగానే హైదరా బాద్‌ రాష్ట్రాన అప్పటికి కొనసాగుతున్న వెట్టిచాకిరి దురాచారంపై నానాజాతి సమితికి (ఇప్పటి ఐక్య రాజ్యసమితికి పూర్వరూపం) ఒక నివేదిక సమర్పించారు. అప్పటికి ఆయన వయస్సు 26ఏళ్లు. 


స్వస్థలాలకు వచ్చిన తర్వాత ఈ యువతరమంతా స్థానికంగా తమకు నచ్చిన సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాలను ఎంచుకుని క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌, నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్‌ వంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఈ వేదికలే స్థానికంగా ఉత్తరాది ఉద్యోగుల పెత్తనానికి వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమాన్ని మొదలుపెట్టాయి. ఇందులో ఆంగ్లకవి నిజామత్‌ జంగ్‌ కొత్వాల్‌ వెంకట్రామారెడ్డి, పద్మజానాయుడు, ఫజల్‌ ఉర్‌ రహ్మాన్‌, బూర్గుల రామకిషన్‌రావు వంటివారు ముల్కీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ప్రేరణతోనే  గోలకొండ పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికను వెలువరించారు. ఈ సంపుటి తెలంగాణ తెలుగు వారిని ఎంతో ప్రభావితం చేసింది. దఖనీ సాహిత్యోద్యమం, ముల్కీ రాజకీయ ఉద్యమాలతో స్థానికులైన ఉర్దూ విద్యావంతులలో కొత్త చైతన్యం వెల్లివిరి సింది. బెర్లిన్‌ నుంచి వచ్చిన ముత్యాల జయసూర్య నాయుడు హైదరాబాద్‌ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పాల్గొని కార్మికోద్యమాన్ని నిర్మించగా, బాకర్‌ అలీ మిర్జా కామ్రేడ్స్‌ అసోసి యేషన్‌ నిర్మాణంలో భాగమై జాతీయోద్యమంలో పాల్గొన్నారు. సుహాసిని మహారాష్ట్ర కార్మికోద్యమంలో పాల్గొన్నారు. ఆనాటి జాతీయ, అంతర్జాతీయ ప్రగతిశీల భావ వీచికల ప్రభావం హైదరాబాద్‌ రాష్ట్రం, తెలంగాణపై పడింది. దీనితో మఖ్దూం, సికిందర్‌ వజ్ద్‌, అక్మర్‌వఫకాని, మహ్మద్‌ అలీనయ్యర్‌, తహసిన్‌ సర్వరీ, అబుసమ్మద్‌ వంటి కవులు దఖనీ ఉర్దూ సాహిత్య రంగానికి పట్టుగొమ్మలై వెలుగొందారు. దీనితో ఉర్దూ సాహిత్యం పూర్తిగా ఫ్యూడల్‌ స్వభావాన్ని విదుల్చుకొని కొత్త సొబగును సంతరించుకున్నది. మధ్య తరగతినేకాక కష్జజీవులను సమానంగా ఆకర్షించింది. ఆరోజులనాటికి దాదాపు ఏడు వందలేండ్ల రాజకీయ, సామాజిక సంస్కృతులవల్ల, పీర్ల పండుగ వంటి ధార్మిక సంబంధాలవల్ల, ఉర్దూ రెండో భాషగా చెలామణిలో ఉండడంవల్ల హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూ అర్థం చేసుకోవడం, మాట్లాడగలగడం సర్వ సాధారణంగా ఉండేది. ఇదే కాలాన జఫ్రుల్‌ హసన్‌, మీర్‌ హసన్‌, మఖ్దూంలు ఆధునిక ఉర్దూ నాటక వికానికి పాటు పడ్డారు. ఢిల్లీ, లక్నోల ఉర్దూ - హైదరాబాద్‌ ఉర్దూల మధ్య చెల రేగిన సంఘర్షణ మరింత బలపడి, స్థానికత ఒక సారవంత మైన లక్షణంగా ఆనాటి సాహిత్య ప్రపంచం ప్రజాభిమానాన్ని చూరగొన్నది. ఇదే క్రమంలో దఖనీ జాతీయతకు, హైదరాబాది యేత్‌ అన్న భావనకు సాహిత్య సాంస్కృతిక రంగాలు భూ మికగా నిలిచాయి. ఈ భావనల ఫలితంగా గులామలీ దహ కానీ, ఐజాజ్‌ హస్సేన్‌, ఖట్టా వంటి కవులు దఖనీ కవితోద్య మాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ కవితోద్యమం చాలా జనరంజకంగా మారినప్పటికీ చమత్కారాలకు, వ్యంగ్యానికి పెద్దపీట వేసింది. రాజకీయాలు పదునెక్కి త్వరలోనే దాని ప్రభావం క్షీణించడంతో ప్రగతిశీల సాహిత్యోద్యమానికి దారులు పడ్డాయి. 


ప్రేమ్‌చంద్‌ నాయకత్వాన 1936లో ఏర్పడిన ప్రగతిశీల్‌ లేఖక్‌ సంఘ్‌ ప్రభావం ఆనాటి ఉర్దూ యువకవులపై పడడం వల్ల అనేకమంది ప్రగతిశీల రచయితలు ఉర్దూ ప్రపంచంలోకి ప్రవేశించారు. ప్రేమ్‌చంద్‌ ఉర్దూ, హిందీ భాషలలో వెలువ రించిన కథలూ, నవలలూ దఖనీ ఉర్దూ భాషీయు లను విశేషంగా ప్రభావితం చేసింది. వీరిలో ముఖ్యులు మక్దూం మొహియుుద్దీన్‌, సికిందర్‌ వజ్ద్‌, కాళోజి రామేశ్వర్‌రావుశాద్‌, పింగళి వెంకట్రా మారెడ్డి, అక్బర్‌వఫకాని, కాళోజీ నారాయణరావు, సినారె సులేమాన్‌ ఆరిబ్‌, యూసుఫ్‌ నాజమ్‌, లతీఫ్‌ సాజీద్‌, నాజర్‌ హైదరాబాదీ, రషీద్‌ అజర్‌, కన్వాల్‌ పర్‌షాద్‌, బాఖీ, మహ్మద్‌అలీ నయ్యర్‌, తహసీన్‌ నయ్యర్‌, అబుసమద్‌, మహ్మద్‌ అలీ ఖాన్‌ మైఖాష్‌, ఇబ్రహీం జలీస్‌, పద్మజానాయుడు, సుగ్రాహుమాయున్‌ మిర్జా, ఇక్మాల్‌ మతిన్‌, జాఫ రుల్‌ హసన్‌, హుేస్సయినీ షాహెద్‌, ఖరత్‌నదీమ్‌, ఇషారత్‌, ఇక్బాల్‌మతీన్‌, మఘాని తబుస్సం వంటి కవులు దఖనీ కవిత్వ, సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించి ప్రగతి శీల సంస్కృతికి పట్టుగొమ్మలై నిలిచారు. అప్పటికే రష్యాలో 1917లో అక్టోబరు విప్లవం ప్రభావం వల్ల ఇంగ్లీషు భాషలో వచ్చిన రచనలన్నీ హైదరాబాద్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నిటికీ తర్జుమాలు కూడా వెలువడ్డాయి. క్రమంగా ఉర్దూ పత్రికలు ‘పయాం’, ‘నిఘార్‌’, ‘రయ్యత్‌’ వంటి పత్రికలు ఆనాటి భావ సంచలనాలకు ముఖ్య వేదికలుగా మారాయి. 1939లోనే తెలం గాణ నుంచి తెలుగు అనువాదంగా ప్రేమ్‌ చంద్‌ కథల సంపుటి వెలువడడం ఇందుకు దాఖలా. 1939లోనే హైదరాబాద్‌ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం సభ్యులుగా ఏర్పడింది. దీనికి బహిరంగ వేదికగా కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ఏర్పడి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆనాటి రాజకీయ, సామాజిక పరిణామాలపై చర్చలు నిర్వహించింది. ఆ ఏడాది అక్టోబరు 8 నుంచి 15వ తేదీ వరకు కామ్రేడ్స్‌ వారోత్సవం జరిగింది. మలక్‌పేటలో కామ్రేడ్స్‌ లైబ్రరీ ప్రారంభోత్సవ సందర్బంగా రావినారాయణ రెడ్డి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. ఈ సభలో సురవరం ప్రతాపరెడ్డి రష్యా విద్యారంగంలో లెనిన్‌ తెచ్చిన సంస్కరణ లపై ప్రసంగించారు. 


రష్యా ప్రేరణ వల్ల కావచ్చు, భారత కమ్యూనిస్టుపార్టీ, హైదరాబాద్‌ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీలపై అప్పటికే ఉన్న నిషేధాన్ని ఇక్కడి ప్రభుత్వాలు 1942లో ఎత్తివేశాయి. దీనితో కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాల నిర్మాణానికి పూనుకున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ రాష్ట్రాన తెలుగు, ఉర్దూ భాషలలో రాసే రెండు రచయితల సంఘాలు ఏర్పడ్డాయి. 1943లో ఉర్దూ మాతృభాషగా కలిగి అందులో ప్రావీణ్యం ఉన్న తెలుగు హిందీ భాషీయుల కోసం ‘అంజుమనే ఉర్దూ తరఖ్కీ పసంద్‌ ముసన్నఫీన్‌’ అనే సంస్థ ఏర్పడింది. 1944లో తెలుగు కోసం హైదరాబాద్‌ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కాగా ఉర్దూ రచయితలకు సంబంధించిన ‘అంజు మనే ఉర్దూ తరక్కీ పసంద్‌ ముసన్నఫీన్‌’ సంస్థ ఏర్పాట్ల బాధ్యతను సిబ్తే హసన్‌, మఖ్దూంలకు ఆనాటి పార్టీ అప్పచె ప్పింది. మొత్తానికి సయ్యద్‌బిన్‌ అహ్మద్‌ తొలి కన్వీనర్‌గా ఆ సంస్థ ఏర్పడింది. దీనిలో కార్యవర్గ సభ్యులుగా సిబ్తేహసన్‌, బూర్గుల నరసింగ్‌రావు, మఖ్దూం మొహినుద్దీన్‌, అక్తర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ జయసూర్య తదితరులు ఎన్నికయ్యారు. ఈ సంస్థ మొదటి సదస్సుకు అప్పటికే ఉర్దూలో ప్రగతిశీల భావాల ప్రచారవేదికగా ఉంటూ, ఆనాటి తెలంగాణ ఆంధ్ర మహాసభకు ఎంతగానో మద్దతు తెలిపి, ఆ సంస్థ కార్యాచరణపై వార్తలు ప్రచురించిన ‘పయాం’ ప్రతిక సంపాదకుడు ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ అధ్యక్షత వహించారు. 1947లో అఖిల భారత ప్రగతి శీల రచయితల సంఘం సమావేశం హైదరాబాద్‌ లోని సిటీ కళాశాలలో జరిగింది. ఇందులో వారి ప్రముఖ రచయితలు మౌలానా హస్రత్‌ మెహానీ, పిరాఖ్‌ గోరక్‌పురి సయ్యద్‌ ఇస్తేశామ్‌ పాల్గొన్నారు. ఇదేవరసలో అక్తర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ జయసూర్య, నర్సింగ్‌ రావు తదితరులు కలిసి ‘అంజుమనే ఉర్దూ తరఖ్కీపసంద్‌ ముసన్నఫీన్‌’కు గొప్ప పునాది వేశారు. దాంతో అనేకమంది రచయితలు, ముఖ్యంగా ఉర్దూ రచయితలు వెలుగులోకి వచ్చారు. జంటనగరాలలో 1940 నుంచి 1960 వరకు గొప్ప ప్రగతిశీల సాహిత్యవిలువలు, సంస్కృతి పాదు కోవడానికి, ప్రజా ఉద్యమాలు, కార్మికోద్యమాలు చెలరేగడానికి ఇదే ముఖ్యమైన కారణం. అణగారిన ఈ నేల ప్రజలకు మద్దతుగా రాచరిక, భూస్వామ్య వ్యవస్థపై పోరాడి చరితార్థు లైన ఉర్దూ మహాకవులను తెలంగాణ యాది చేసుకోవల్సే ఉంది.

సామిడి జగన్‌ రెడ్డి

85006 32551


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.