కోతలు ఖరారు

ABN , First Publish Date - 2020-03-31T08:19:20+05:30 IST

కరోనా వైరస్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు,

కోతలు ఖరారు

  • సీఎం నుంచి ఎంపీటీసీ వరకు ప్రజాప్రతినిధులకు 75 శాతం
  •  ఉద్యోగుల వేతనాల్లో 50ు కట్‌
  •  4వ తరగతి ఉద్యోగులకు 10%
  •  ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు 60% కోత
  •  కరోనా నేపథ్యంలో సీఎం నిర్ణయం
  • 15 రోజులకే అంత సంక్షోభమా?
  • 50% కోత పెడితే అస్తవ్యస్తమే
  • ఉద్యోగ సంఘాల ఆందోళన 
  • వైద్యులకు కోతపై నిరసనలు


విద్యుత్తుకు కోత లేకుండా..

లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం ముసురుకున్నా.. విద్యుత్తు ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని విద్యుత్తు సంస్థలు నిర్ణయించాయి. వాస్తవానికి ఫిబ్రవరి (మార్చి నెలలో వసూలు చేసే) బిల్లులు సగం కూడా వసూలు కాకపోవడంతో విద్యుత్తు సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయాయి. 


ఎవరెవరికి... ఎంతెంత?

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత.

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ లాంటి అఖిల

భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60%.

మిగతా అన్ని విభాగాల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత.

నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం

అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత.

4వ తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 10%.

ప్రభుత్వరంగ, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు 50 శాతం.


కరోనా యోధులకూ కోతా?

కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన వైద్య శాఖ సిబ్బందికి కూడా సగం జీతం కోత పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తమ  ప్రాణాలను పణంగా పెట్టి, ఎక్కువ గంటలు విధుల్లో ఉంటూ కొవిడ్‌ రోగుల మధ్య పని చేస్తున్నారు. వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వడం పోయి ఏకంగా జీతాల్లో కోత పెట్టడం ఎలాంటి సంకేతాలు ఇస్తాయనే చర్చ జరుగుతోంది. మరోపక్క తమిళనాడు ప్రభుత్వం కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి ఒక నెల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు.


హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో భారీగా కోత పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా స్థానిక సంస్థల వరకు ప్రజాప్రతినిధులందరి వేతనాల్లో 75 శాతం కోత వేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎ్‌సల వంటి అఖిల భారత సర్వీసు అధికారుల జీతాల్లోనూ 60 శాతం తగ్గించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష జరిపారు. కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడుతుందని ఈ సమావేశంలో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుచూపుతో పలు నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.


అత్యంత జాగరూకతతో వ్యవహారించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలోనే కోతల నిర్ణయం తీసుకున్నారు. కోత నిర్ణయం వివరాలను సీఎం కార్యాలయం మీడియాకు వెల్లడించింది. అయితే, ఈ కోత ఒక్క నెలకేనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు ఉంటుందా? అనేది స్పష్టం చేయలేదు. కోత పెట్టిన సొమ్మును భవిష్యత్తులో ఇస్తారా? ఎప్పటికీ రావా? అన్నది కూడా చెప్పలేదు. ఏ చట్టం కింద వేతనాల్లో కోత పెడుతున్నారో కూడా స్పష్టం చేయలేదు. సాధారణంగా రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించినపుడు ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అధికారం ఉంటుంది. విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టొచ్చని అంటున్నారు. కానీ, స్పష్టమైన సమాచారం లేదు. 


పునరాలోచించాలి: ఐక్య వేదిక

కోత నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రభుత్వరంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, ఏ రాష్ట్రం గానీ తీసుకోలేదని సంఘం నేతలు చావ రవి, సదానంద గౌడ అన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వం నుంచి వేల కోట్ల రాయితీలు పొందుతున్న వ్యాపార వర్గాల రాయితీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టడం, విరాళాల కోసం పిలుపునివ్వడం చేయొచ్చని, అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించి సమంజసమైన నిర్ణయం తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.


వేతనంపై ఆధారపడి బతికే ఉద్యోగుల జీతాల్లో ఏకంగా 50 శాతం కోత వేస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్తం అవుతుందని హెచ్చరించారు. 15 రోజుల లాక్‌డౌన్‌కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, రెండు డీఏలు విడుదల కాక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న విషయం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జీతాల తగ్గింపు తిరోగమన చర్య అని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


పోలీసు శాఖకు రూ.53 కోట్లు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వినియోగించుకొనేందుకు వీలుగా రూ.53.53 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం జీవో విడుదల చేసింది. ఇందులో డీజీపీ కార్యాలయానికి రూ.50.81 కోట్లు, హైదరాబాద్‌ కమిషరేట్‌కు రూ.1.44 కోట్లు, సైబరాబాద్‌కు రూ.61 లక్షలు, రాచకొండ కమిషనరేట్‌కు రూ.67 లక్షలు మంజూరు చేసింది.

Updated Date - 2020-03-31T08:19:20+05:30 IST