కోసిన సొమ్మూ మెక్కేశారు

ABN , First Publish Date - 2022-07-02T07:46:44+05:30 IST

కోసిన సొమ్మూ మెక్కేశారు

కోసిన సొమ్మూ మెక్కేశారు

నిర్వహణ పేరుతో అమ్మఒడి నగదుకు భారీ కోత

పాఠశాలలకు సరిగా అందని ఆ డబ్బులు

గతేడాది మార్చి వరకే నిర్వహణ నిధులు

అందులోనూ కొన్నింటికి ఇవ్వనే లేదు

రూ.170కోట్లకుపైగానే దారి మళ్లింపు

ఈఏడాది మొత్తం రూ.879 కోట్ల కోత

ప్రైవేటుకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు

అయినా..ఆ తల్లుల నగదులోనూ కోతే!


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

అమ్మఒడి పథకంలో ప్రభుత్వం మరో మాయ చేస్తోంది. నిర్వహణ ఖర్చులంటూ కోతపెడుతున్న పథకం నగదులో కొంతే పాఠశాలలకు ఇస్తూ.. మరికొంత సొంత అవసరాలకు వాడుకుంటోంది. పైగా ఆ నగదు అంతా విద్యార్థుల సంక్షేమం కోసమేనని, తల్లులు సంతోషంగా ఇస్తున్నారంటూ గొప్పలు చెప్పుకొంటోంది. అసలు మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలల భవనాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిది. దానిని విద్యార్థులు, తల్లిదండ్రులపై వేయడమేకాకుండా.. అందులోంచీ నొక్కేస్తుండటం గమనార్హం. మరుగుదొడ్ల నిర్వహణ కోసం అంటూ గతేడాది ఒక్కో తల్లికి ఇవ్వాల్సిన నగదులో రూ.వెయ్యి కోత పెడితే, ఈ ఏడాది పాఠశాల నిర్వహణనూ కలిపేసి మరో వెయ్యి తీసేసుకుంది. ఇలా గతేడాది 44.48లక్షల తల్లుల ఖాతాలకు వెళ్లాల్సిన నగదులో రూ.444కోట్లు, ఈ ఏడాది 43.96లక్షల తల్లుల ఖాతాల నుంచి రూ.879కోట్లను తన వద్దే ఉంచుకుంది. ఇన్ని వందల కోట్లు కోతలు పెడుతున్న ప్రభుత్వం వాటిని పాఠశాలలకు సక్రమంగా, సకాలంలో ఇస్తే ఫరవాలేదు. కానీ పేరుకి నిర్వహణ అని చెబుతూ వాటిని ఇతరత్రా అవసరాలకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది.


ఆ డబ్బులు ఏమయ్యాయి?

రాష్ట్రంలో మొత్తం 42వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ కోసం నియమించిన ఆయాలకు ప్రభుత్వం నెలకు రూ.ఆరు వేలు చొప్పున ఇస్తోంది. పాఠశాలలు పనిచేసే పది నెలలకు రూ.ఆరువేలు, సెలవుల్లో రెండు నెలలకు రూ.మూడు వేలు చొప్పున వారికి వేతనాలు ఇవ్వాలి. కానీ గత విద్యాసంవత్సరంలో పాఠశాలలు పనిచేసినంతకాలం మాత్రమే వారికి వేతనాలు ఇచ్చారు. అంటే ఏడాదిలో ఆయాలకు రూ.60వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన మొత్తం 42వేల పాఠశాలలకు రూ.252కోట్లు అవుతాయి. అవి కాకుండా మరుగుదొడ్లను పరిశుభ్రం చేసేందుకు అవసరమైన బ్రష్‌లు, రసాయనాలు ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా కలిపినా మొత్తంగా గతేడాది రూ.273కోట్లే అయ్యాయి. మొత్తం వసూలు చేసిన రూ.444కోట్లలో రూ.273కోట్లు పోతే రూ.171 కోట్లకు పైగా నిధులు ఏమయ్యాయనేది ప్రభుత్వం చెప్పాలి. నిర్వహణ అని నగదు కట్‌ చేసిన ప్రభుత్వం, గత విద్యా సంవత్సరంలో సక్రమంగా పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదు. నాలుగైదు నెలలకోసారి ఆయాలకు వేతనాలు వేసింది. అన్ని నెలలపాటు వేతనాలు లేకపోవడంతో చాలా చోట్ల ఆయాలు మానేశారు. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు వారి సొంత నిధులతో వారికి వేతనాలు ఇచ్చారు. మిగిలిన చోట్ల ఎప్పటిలాగే నిర్వహణ లేక మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా మిగిలిపోయాయి. ఇక చాలాచోట్ల మార్చి వరకు కూడా ఆ నిర్వహణ నగదు పాఠశాలలకు రాలేదని హెచ్‌ఎంలు తెలిపారు. 


ప్రైవేటు మాటేంటి?

ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అమ్మఒడి నగదు ఇస్తున్నారు. కానీ విచిత్రంగా వారికి ఇచ్చే రూ.15వేలల్లో కూడా మరుగుదొడ్ల నిర్వహణ, భవనాల నిర్వహణ అంటూ కోతలు పెడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులివ్వదు. కానీ అమ్మఒడి నగదుమాత్రం కట్‌చేసింది. ఆ నగదు ఏం చేస్తున్నారనేది ప్రభుత్వం ఎక్కడా వివరించడం లేదు. సాధారణంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 60:40 నిష్పత్తిలో విద్యార్థులుంటారు. ఆ లెక్కన ప్రైవేటులో చదివే 25లక్షల మంది విద్యార్థుల తల్లులకు అమ్మఒడి వర్తిస్తే...వారి నుంచి ఈ సంవత్సరం రూ.500 కోట్లు కట్‌ చేశారు. ఆ నగదు ఇప్పుడు ప్రభుత్వానికే మిగిలాయి. ఆ నగదును ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేస్తే కనీసం ప్రభుత్వంలో చదివే వారికైనా కోత పెట్టకుండా మొత్తం అమ్మఒడి నగదు ఇవ్వొచ్చు. అయినా ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

Updated Date - 2022-07-02T07:46:44+05:30 IST