Abn logo
May 6 2021 @ 00:09AM

కర్ఫ్యూ ప్రశాంతం

మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలు బంద్‌

నిలిచిపోయిన దూర ప్రాంత రాకపోకలు

ప్రొద్దుటూరులో కర్ఫ్యూను పర్యవేక్షించిన ఎస్పీ అన్బురాజన

24 గంటల్లో 903 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 18 గంటల కర్ఫ్యూ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు కర్ఫ్యూ ప్రశాంతంగా ముగిసింది. 12 గంటలకే వాహనాల ప్రజా రవాణా వ్యవస్థతో పాటు ఆటోలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయు. వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌మాల్స్‌, హోటల్స్‌, మార్కెట్లు 12 గంటలకే మూత వేశారు. నిత్యం వాహనాలు, జనంతో రద్దీగా ఉండే రహదారులు కర్ఫ్యూ కారణంగా నిర్మానుష్యంగా మారాయి. కడప నగరంలో వాణిజ్య ప్రాంతాలైన వైవీ స్ర్టీట్‌, బీకేఎం స్ర్టీట్‌, పాతబస్టాండు, ఆర్టీసీ బస్టాండు, అప్సర, ఎర్రముక్కపల్లె సర్కిల్‌, ఐటీఐ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు మూతబడడంతో జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. రోజూ 800 ఆర్టీసీ బస్సులు జిల్లాలోని 8 డిపోల నుంచి రాకపోకలు సాగించేవి. అయితే ఉదయం 6 నుంచి 12 గంటల్లోపు ప్రజా రవాణా వ్యవస్థ కూడా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆరుగంటల వ్యవధిలోపు పోయి వచ్చే రహదారులను ఆర్టీసీ అధికారులు గుర్తించి బస్సులు తిప్పారు. రాజంపేట, రాయచోటి, మైదుకూరు, బద్వేలు, పులివెందుల, పోరుమామిళ్లతో పాటు మరికొన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పారు. కరోనాకు ముందు రోజూ కోటి దాకా ఆర్టీసీకి రాబడి వచ్చేది. అయితే వైరస్‌ విస్తరించడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గి 50 లక్షలకు చేరుకుంది. ఆరుగంటల పాటు బస్సులు తిప్పుతుండడంతో బుధవారం తొలిరోజు 19.73 లక్షలు రాబడి వచ్చింది. 12 గంటలలోపే బస్సులు రాకపోకలు ఉంటాయని తెలియక దూర ప్రాంత ప్రయాణికులు 11 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. అయితే అప్పటికే బస్సులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాలను బాడుగకు తీసుకుని వెళ్లారు. ఆర్టీసీ సర్వీసులను దూర ప్రాంతాలకు నిలిపివేశారు. జిల్లాలో బస్సుల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మాత్రమే కొనసాగిస్తున్నారు.


రాకపోకలు నిషేధం

పోలీసు యంత్రాంగం కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేసింది. ఎస్పీ అన్బురాజన ప్రొద్దుటూరుకు వెళ్లి కర్ఫ్యూను పరిశీలించారు. శివాలయం సెంటరు, గాంధీ విగ్రహం తదితర చోట్ల పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కడపలో వాహనాలను నిలువరించేందుకు రహదారులపై బారికేడ్లను వేసి దిగ్బంధనం చేశారు. అనవసరంగా తిరుగుతున్నారంటూ ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వారిని పోలీసులు ప్రశ్నించారు. రాజంపేటలో డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి నేతృత్వంలో రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్న వారిపై జరిమానా విధించారు. రాయచోటి, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వాహనాలు తిరగకుండా కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేశారు. 


మరో 903 కేసులు

జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 903 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67,894కు చేరుకుంది. ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య 565కు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కోలుకున్న 371 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 61,393 మంది రికవరీ అయ్యారు. 4184 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతుండగా 1754 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కేసుల విషయానికొస్తే 49 మండలాల్లో నమోదయ్యాయి.


కేసుల వివరాలు

కడపలో 159, రాజంపేట, ప్రొద్దుటూరు 59, పులివెందుల 58, రాయచోటి 57, బద్వేలు, నందలూరు 34, రైల్వేకోడూరు మండలంలో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లె 30, పెనగలూరు 29, జమ్మలమడుగు 27, సంబేపల్లె 25, వేంపల్లె 24, చిట్వేలి, ఎర్రగుంట్ల మండలాల్లో 23, మైదుకూరు 22, టి.సుండుపల్లె 20,  తొండూరు 17,  వేముల 16, రాజుపాలెం 15, లింగాల 14,  సిద్దవటం 13, వేముల 12, కలసపాడు 11, చిన్నమండెం 10, పెద్దముడియం 9, సింహాద్రిపురం 9, రామాపురం 8, మైలవరం  మండలంలో 7 కేసులు నమోదయ్యాయి. అలాగే చాపాడు, ఎల్‌ఆర్‌పల్లె, సీకేదిన్నె, ఒంటిమిట్టలో, పోరుమామిళ్ల, చెన్నూరు మండలాల్లో 6, పెండ్లిమర్రి 5,  పుల్లంపేట, దువ్వూరు, కొండాపురం, అట్లూరు 4, బిమఠం 3, గాలివీడు, కమలాపురం, గోపవరం, చక్రాయపేట,  వీఎనపల్లె, వల్లూరులో 2, ముద్దనూరు, ఖాజీపేట 1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


మూతబడ్డ హోటళ్లు

తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న రోగుల బంధువులు

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో అనేక మంది బాధితులుగా మారారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్‌ సెంటర్లు కరోనా బాధితులతో పూర్తిగా నిండిపోయాయి. కనీసం బెడ్డు కూడా దొరకని పరిస్థితి. తీవ్రత దృష్ట్యా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కొవిడ్‌ వైద్యం అందించే వెసులుబాటు కల్పించారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు భోజనం దొరుకుతుంది. కానీ వారి వెంట ఉండే బంధువుల పరిస్థితి ఏంటి? వారికి భోజనం ఎలా? ఇతర జబ్బులతో వచ్చేవారు చిన్నపిల్లలు, వృద్ధులను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ వారి వెంట ఎవరో ఒకరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కడప నగరంలోని ఆసుపత్రులకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు వస్తుంటారు. ముఖ్యంగా పులివెందుల, రాయచోటి, బద్వేలు, రాజంపేట, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బాధితులతో పాటు అత్యవసర వైద్యంకోసం బాధితులు వస్తున్నారు. వీరి వెంట బంధువులూ ఉంటారు. ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా హోటల్స్‌ అన్నీ మూతపడ్డంతో వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. కనీసం పార్శిల్‌ పద్ధతిలో అయినా కాస్త వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.


18 వరకు కర్ఫ్యూ పాటించాల్సిందే

వివాహాలకు 20 మంది మించకూడదు

తహసీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు

కడప(కలెక్టరేట్‌), మే 5: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18వ తేదీ వరకు జిల్లాలో కర్ఫ్యూ తప్పక పాటించాల్సిందేనని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి వివాహాలకు 20 మందికి మించి అనుమతించకూడదని తహాసీల్దార్లను ఆదేశించారు. జిల్లా అంతటా 144 సెక్షన అమలుపరచాల్సిన బాధ్యత తహసీల్దార్లదే అని పేర్కొన్నారు. కర్ఫ్యూ మిన హాయింపు ఉన్న సమయంలో కూడా ఐదుగురికి మించి ఎక్కడా జనం గుంపులు ఉండరాదని, వివాహాలకు 20 మందికి మాత్రమే అనుమతి మంజూరు చేయడంతో పాటు దానిని అమలు పరిచే బాధ్యత రెవెన్యూ ఇనస్పెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్‌ పంపులు, బ్రాడ్‌కాస్టింగ్‌ రంగాలు, డ్యూటీలో ఉన్న  కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా తదితరులకు కర్ఫ్యూ నుంచి మినహాయించామని, బ్యాంకులు కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపారు.

కర్ఫ్యూ కారణంగా కడపలో మూతపడ్డ హోటల్‌


వాహనదారులను హెచ్చరిస్తున్న పోలీసులుAdvertisement