ఆశల సాగు

ABN , First Publish Date - 2020-06-06T09:56:05+05:30 IST

అన్నదాత ఆశల సాగుకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి జల్లులు పలకరించడంతో నాగలి పట్టుకొని పొలంబాట పట్టాడు.

ఆశల సాగు

చినుకుపడిన వెంటనే విత్తనాలు వేసేందుకు రెడీ

జిల్లాలో 10లక్షల 67వేల ఎకరాలకు పైగా వివిధ పంటల సాగు


నల్లగొండ, జూన్‌ 5: అన్నదాత ఆశల సాగుకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి జల్లులు పలకరించడంతో నాగలి పట్టుకొని పొలంబాట పట్టాడు. చేను చదును చేసి విత్తనాలు జల్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాడు. ఈసారి వర్షాలు సమృద్ధిగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతన్న ఆనందంగా ముందుకు ‘సాగు’తున్నాడు. 


వానాకాలం పంటల సాగుకు రైతాంగం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర దుక్కులు దున్నగా పత్తి సాగు చేసేందుకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలను చదును చేస్తున్నారు. గత యాసంగి పంటలు కోసిన వెంటనే వానాకాలం పంటలకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో 10లక్షల 67వేల 318 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో 3లక్షల22వేల 562ఎకరాల్లో వరి, 7,10,475 ఎకరాల్లో పత్తి, 30వేల ఎకరాల్లో కంది, 2వేల ఎకరాల్లో వేరుశనగ సాగునుచేయాలని నిర్ధేశించారు. 72శాతానికి పైగా సన్నరకాలను వేయాలని చూస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని సాగుచేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 28శాతం దొడ్డు రకాలను సాగు చేయాల్సి ఉండగా, మండలాల వారీగా విత్తనాలను పంపించారు. 


మృగశిర కార్తె నాటికి

ఈసారి ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. మృగశిర కార్తె నాటికి బాగా వానలు కురుస్తాయని అంతా భావిస్తున్నారు. దీంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు కొన్ని ప్రాంతాల్లో వరి విత్తనాలను తీసుకొచ్చి నార్లు పోశారు. అదే విధంగా పత్తి విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి ఇప్పటీ వరకూ 7లక్షల ప్యాకెట్లకు పైగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.650నుంచి రూ.850 వరకు ఉంది. ఇప్పటికే నకిలీ విత్తనాల బెడద లేకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ మండలస్థాయిలో ఏఓలు, ఎస్‌ఐ, డివిజన్‌ స్థాయిలో సీఐ, ఏడీఏ, డీఎస్పీల సహకారం, జిల్లాస్థాయి టెక్నికల్‌ అధికారులు, అదనపు ఎస్పీల ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటుచేశారు. 

 

రైతన్నకు పెరిగిన మద్దతు

17 రకాల పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

ఉమ్మడి జిల్లాలో 9లక్షల మంది రైతులకు లాభం

వరికి రూ.53, పత్తికి రూ.275, కందికి రూ.200 పెంపు


రైతన్నకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ ఏడాదికి పంటల మద్దతు ధర పెంచడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. విత్తనం కొనుగోలు నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏడాదికేడాదికి సాగు ఖర్చు పెరిగి ఏ పంట పండించినా గిట్టుబాటుగాని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈదశలో కేంద్రం 2020-21 వ్యవసాయ సీజన్‌కు పంటల మద్దతు ధర పెంచడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలో సన్న వరి రకాలు లేవు. నియంత్రిత సాగు విధానంలో వరిలో 60 శాతం సన్న రకాలు సాగు చేయాలని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. 


ఉమ్మడి జిల్లాలో 9.02 లక్షల మంది రైతులకు ప్రయోజనం

కేంద్రప్రభుత్వం పంటల మద్దతు ధరల పెంపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9లక్షల 2వేల 933 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,09,756 మంది రైతులు 6,00,700 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 2,43,177 మంది రైతులు 6,13,813 ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు 11,00,197 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పంటల ధరలు పెంచడంతో రైతు ఏ పంట సాగు చేసినా ప్రయోజనం చేకూరుతుంది. 


అమలుకు నోచని సిఫారసులు

కేంద్ర ప్రభుత్వం పంటల ధరలు పెంచినప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న పంటల సాగు ఖర్చులు చూస్తే తమకు లాభసాటిగా ఉండటం లేదని పలువురు రైతులంటున్నారు. పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చుకు 50శాతం అదనంగా కలిపి పంటలకు మద్దతు ధర ప్రకటించాలని గతంలో స్వామినాథన్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు పట్టించుకోవడం లేదని, కంటి తుడుపు చర్యలా ఏడాదికోసారి కొద్దిగా మద్దతు ధర పెంచుతున్నారంటున్నారు.


పంటల మద్దతు ధర పెంపు ఇలా

పంటరకం 2019 2020 పెంపు

వరి (సాధారణం) 1,815 1,868 53

వరి (ఏ-గ్రేడ్‌) 1,835 1,888 53

పత్తి (మధ్యస్థపింజ) 5,255 5,515 260

పత్తి (పొడువుపింజ 5,550 5,825 275

కంది 5,800 6,000 200

పెసర 7,050 7,196 146

మినుము 5,700 6,000 300

నువ్వులు 6,485 6,855 370

వేరుశనగ 5,090 5,275 185

నల్లనవ్వులు 5,940 6,695 755

Updated Date - 2020-06-06T09:56:05+05:30 IST