మాదిరెడ్డిపాలెంలో దాహం కేకలు

ABN , First Publish Date - 2022-08-09T06:25:42+05:30 IST

తమ గ్రామంలో కనీస అవసరాలకు నీరు లేక పోవడంతో నగర పంచా యతీ పరిఽధిలోని మాదిరెడ్డి పాలెం వాసులు సోమ వారం ఉదయం రోడ్డేక్కా రు.

మాదిరెడ్డిపాలెంలో దాహం కేకలు
రహదారికి అడ్డంగా వేసిన చిల్లకంప

- రోడ్డెక్కిన గ్రామస్థులు   - ఎమ్మెల్యే రావాలంటూ పట్టు

- అధికారుల విజ్ఞప్తిని బేఖాతరు చేసిన గ్రామస్థులు

- గంటకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం 

పొదిలి రూరల్‌ ఆగస్టు 8 : తమ గ్రామంలో కనీస అవసరాలకు నీరు లేక పోవడంతో నగర పంచా యతీ పరిఽధిలోని మాదిరెడ్డి పాలెం వాసులు సోమ వారం ఉదయం రోడ్డేక్కా రు. ఏకంగా మార్కాపురం రహదారిని దిగ్బంధించి రాకపోకలు నిలిపేశారు. గంటసేపు నిరసన కొనసాగగా, వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలిచిపోయాయి. ఒక దశలో ప్రయాణికులకు, గ్రామస్థులకు తోపులాట జరగడం గమనార్హం. పొదిలిలోని మాదిరెడ్డిపాలెం గ్రామంలో వాడుక నీటి కోసం కూడా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల సరఫరా నిలిచిపోవడంతోపాటు వాడకానికి, తాగేందుకు సాగర్‌ నీరు కూడా రావడం లేదు.  దీంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టు తెంచుకొంది. పార్టీలకు అతీతంగా గ్రామస్థులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఏకంగా మార్కాపురం రహదారిపై  ముళ్లకంచె వేశారు. వాహనాల రాకపోకలను కిలోమీటరు మేర స్తంభింపజేశారు. గ్రామస్థులు నిరసనలో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. రెండు నెలలుగా గ్రామంలో నీటిఎద్దడి  నెలకొన్నప్పటికీ, నగర పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్థులు పేర్కొన్నారు. కనీసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం స్పందించడం లేదని ద్వజమెత్తారు. నీటి సరఫరాను పునరుద్దరించే వరకు లేచేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. గంటకుపైగా ఆందోళన జరగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీహరి హుటాహుటినా ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకొని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులు సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని ఎస్సైకి కరాఖండిగా చెప్పారు.

ప్రయాణికుల తోపులాట

గంటపాటు రాకపోకలు నిలిచిపోవడంతో ఒక దశలో ప్రయాణికులు కలగజేసుకొని కార్యాలయాలకు వెళ్లే సమయంలో గంటలకొద్ది ప్రయాణాన్ని ఆపితే ఎలా అంటూ గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామస్థులకు ప్రయాణికులకు మధ్య మాటమాటా పెరిగి తోపులాట వరకు వెళ్లింది. అయితే మూగజీవాలకు సైతం గుక్కెడు నీరు దొరకడం లేదని ఏమి పాలుపోని స్థితిలోనే సమస్య తీవ్రతను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చేందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు నాగార్జునరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు నగరపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళతానని ఎస్‌ఐ శ్రీహరి గ్రామస్థులను ఒప్పించారు. దీంతో ఆందోళన విరమించారు. 


Updated Date - 2022-08-09T06:25:42+05:30 IST