ధర్మయుద్ధం మొదలైంది

ABN , First Publish Date - 2022-08-09T10:01:59+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

ధర్మయుద్ధం మొదలైంది

నాలుగో ‘ఆర్‌’ రాబోతున్నారు

రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనున్న మునుగోడు

డబ్బులు తీసుకుని టీఆర్‌ఎ్‌సను ఓడించండి

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌


యాదాద్రి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ... ధర్మ యుద్ధం మొదలైందని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలోనూ తాను ట్రిపుల్‌ ఆర్‌ సినిమా చూపిస్తానన్నానని, త్వరలో మరో ‘ఆర్‌’ (రాజగోపాల్‌రెడ్డి)ని కూడా చూపెట్టబోతున్నానని తెలిపారు. మునుగోడులో ఇకపై రంగురంగుల జెండాలకు స్థానంలేదని, ఎన్నికలెప్పుడొచ్చినా కాషాయం జెండా ఎగురుతుందని సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఈసారి ఆ పాచిక పారదన్నారు. కేసీఆర్‌ మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మూసీ నీటితో స్నానం చేస్తేనే ఓటేద్దామన్నారు. ‘‘నక్కలగండి ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పనిచేస్తానని... చేశారా? చౌటుప్పల్‌కు డిగ్రీ కళాశాల ఉందా? సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉందా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చి కేసీఆర్‌ గెలవాలనుకుంటున్నారని, డబ్బు తీసుకుని టీఆర్‌ఎ్‌సను చిత్తుగా ఓడించాలన్నారు. అగ్రవర్ణాల పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు.


వడ్లు తామే కొనుగోలు చేస్తున్నామని గప్పాలు కొట్టారని... కానీ తాళ్లు, హమాలీలు, రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇచ్చిందని సంజయ్‌ తెలిపారు. అభివృద్ధి పనులు చేయని కేసీఆర్‌ ఈ ప్రాంతంలో 5బార్లు, 7వైన్స్‌, 57 బెల్టు షాపులిచ్చారని ఆరోపించారు. పాదయాత్రలో సంజయ్‌ వెంట శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, యాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహన్‌రెడ్డి తదితరులున్నారు. కాగా... యాత్ర ఆరో రోజు సోమవారం చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం నుంచి ప్రారంభమైంది. శేరిల్లా, పెద్దకొండూర్‌, చిన్నకొండూర్‌ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. పెద్దకొండూర్‌, మసీదుగూడెంలలో మహిళలు బతుకమ్మలతో సంజయ్‌కు ఘనస్వాగతం పలికారు. పెద్దకొండూర్‌లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మఽధ్యాహ్న భోజనాన్ని సంజయ్‌ పరిశీలించారు. చిన్నకొండూర్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో అందరికీ కరోనా టీకాలు వేసినందుకు నర్సు, ఏఎన్‌ఎంలను శాలువాలతో సన్మానించారు. యాత్రలో భాగంగా  మంగళవారం చౌటుప్పల్‌ మండలంలో సంజయ్‌ పాదయాత్ర కొనసాగనుంది. తాళ్లసింగారం, కొత్తపేట, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి టోల్‌ ప్లాజా, రెడ్డిబాయి, తుంబాయిస్టేజి, గుండ్లబాయి మీదుగా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి పాదయాత్ర చేరుకుంటుంది. 

Updated Date - 2022-08-09T10:01:59+05:30 IST