కొడుకుల కిరాతకం

ABN , First Publish Date - 2022-05-13T09:16:49+05:30 IST

పొలం విక్రయంపై పంచాయితీ.. ఆ తండ్రి ప్రాణాలు తీసింది. కుమారుల చేతిలో ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అప్పుల నుంచి బయటపడేందుకు భూమిని అమ్మితే.. దానికి అడ్డుపడుతున్న నాన్నను కుమారులు దారుణంగా హత్య చేశారు....

కొడుకుల కిరాతకం

పొలం అమ్మనివ్వడం లేదని తండ్రి  హత్య

పంటలు పండక అన్నదమ్ములు అప్పులపాలు

గతేడాది భూమి విక్రయం.. అడ్డుపడిన నాన్న!

సోదరికి మాత్రం ఎకరం ఇచ్చి.. అమ్మడంతో కక్ష

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌)లో ఘటన

ఆత్మకూర్‌(ఎస్‌), మే 12: పొలం విక్రయంపై పంచాయితీ.. ఆ తండ్రి ప్రాణాలు తీసింది. కుమారుల చేతిలో ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అప్పుల నుంచి బయటపడేందుకు భూమిని అమ్మితే.. దానికి అడ్డుపడుతున్న నాన్నను కుమారులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సూర్యాపేట రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన యరగాని శ్రీనయ్య (50)కు తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు రాజశేఖర్‌ డీసీఎం డ్రైవర్‌గా, చిన్నవాడు సంతోష్‌ వ్యవసాయం చేస్తూ, ట్రాక్టర్‌ నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.  వీరు గ్రామంలో వేర్వేరుగా ఉంటున్నారు. శ్రీనయ్య కుమార్తె రాజ్యలక్ష్మికి 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. 7 ఎకరాలను కుమారులకు పంచిన ఆయన.. రెండు ఎకరాలను ఉంచుకున్నాడు. పంటలు సరిగా పండక, పరిస్థితులు అనుకూలించక రాజశేఖర్‌, సంతోష్‌ అప్పులపాలయ్యారు. ఏడాది కిందట చెరో ఎకరం విక్రయానికి బయానా తీసుకున్నారు.   దీనిని శ్రీనయ్య వ్యతిరేకించాడు. కొనుగోలుదారుల ఇంటికెళ్లి అడ్డుకున్నాడు. ఈ విషయంలో తండ్రీకొడుకులకు గొడవలు జరిగాయి. పెద్దమనుషులు చెప్పినా శ్రీనయ్య వినలేదు. ఇదిలాఉండగా శ్రీనయ్య రెండు ఎకరాల్లో ఎకరంన్నర భూమిని కుమారులకు తెలియకుండా కుమార్తెకు పేరిట రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. ఈ భూమిని చివ్వెంల మండలం కుడకుడ వాసికి విక్రయించాడు. దీంతో రాజశేఖర్‌, సంతోష్‌ మరింత ఆగ్రహానికి గురయ్యారు.  


తండ్రిని చంపితేనే పరిష్కారమన్న పెద్దలు!

తండ్రిని చంపితేనే భూసమస్య పరిష్కారమవుతుందని గ్రామంలోని పెద్ద మనుషులు.. రాజశేఖర్‌, సంతోష్‌లకు చెప్పినట్లు సమాచారం. వారు గురువారం ఉదయమే తండ్రి ఇంటికి వెళ్లారు. కత్తి, గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. శ్రీనయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో శ్రీనయ్య భార్య అంజమ్మ మిరప తోటకు వెళ్లింది. అడ్డుపడిన మనుమరాలు (రాజ్యలక్ష్మి కూతురు) చేతికి గాయాలయ్యాయి.  తల్లి  అంజమ్మ ఫిర్యాదుతో రాజశేఖర్‌, సంతో్‌షను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనయ్యకు.. కుమార్తె రాజ్యలక్ష్మి తలకొరివి పెట్టింది.

Read more