Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేరం వారిది కాదు, ‘ఆకలి’ది!

వాళ్లిద్దరిని అట్లా చంపుతున్న విడియోను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. చనిపోయాడని ఖాయం అయ్యేదాకా వేటు మీద వేటు వేస్తుంటే, ఆ వెనక ఉన్న కారులో, ఆ వెనుక బస్సులో, ఎదురుగా మరో బస్సులో, రోడ్డు మీద ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు ఎట్లా చూశారో, ఎట్లా ఫోన్ కెమెరాలకు పనిచెప్పారో ఆశ్చర్యమే. ఆ రోడ్డు మీద అని మాత్రమే కాదు, ఆ వూర్లో, ఆ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మాత్రం అట్లాంటివి జరగడం పెద్దగా అలవాటు లేదు, ఏదో హైదరాబాద్‌లో గూండాలూ రౌడీలు పాతకక్షలతో రోడ్ల మీద వెంటాడి నరుక్కోవడం ఉన్నది కానీ తెలంగాణ పల్లెల్లో ఇటువంటివి లేవు, కొత్త కొత్త పద్ధతులు ఇక్కడ కూడా వస్తున్నాయా, పల్లె తెలంగాణ, జిల్లాల తెలంగాణ ఏమి కానున్నది? 


తెలంగాణకు కొన్ని ముద్రలున్నాయి. వెనుకపడిన, పడేసిన ప్రాంతం అని, వివక్షకు గురైన ప్రాంతం అని ప్రత్యేక ఉద్యమం వాదించి, ప్రజలను సమీకరించగలిగింది. తమది ప్రత్యేక జీవనవిధానం అని, సామూహికతకు, ప్రాకృతిక జీవనానికి తెలంగాణ నెలవు అని, వ్యాపార విలువల కంటె మానవ విలువలకే ప్రాధాన్యం అని, పోరాటం, ప్రతిఘటన ఇక్కడి నెత్తుటిలో ఇంకిన గుణాలని.. ఇట్లా అనేక అభిప్రాయాలను తెలంగాణవారు తమ గురించి తాము విశ్వసిస్తారు, ఇతరులలో కూడా కొందరు తెలంగాణ గురించి అటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. న్యాయవాదుల జంట హత్య ఆ ముద్రలను ఒక్కసారిగా కుదిపివేసింది. లోపలివారు, బయటివారు కూడా భయవిస్మయంలో మునిగిపోయారు. ‘‘తెలంగాణాలో కూడానా!?!’’


ఆ హత్యల నేపథ్యం ఏదైనా అయి ఉండవచ్చు. హత్యల తరువాత వెలికి వస్తున్న కథనాల ప్రకారం హంతకులుగా భావిస్తున్నవారే కాదు, హతులు కూడా నేరచరిత్ర కలిగినవారే కావచ్చు. నిజానికి ఆశ్చర్యపడవలసింది కేవలం హత్యలకు కాదు. అవి జరిగిన పద్ధతికి. చేసినవారికి ఎంతో ధైర్యం ఉంది, తమకేమీ కాదు, బారా ఖూన్ మాఫ్ అన్న ధీమా ఉన్నది. అంతే కాదు, ఆ ధీమాను, ధైర్యాన్ని బాహాటంగా ప్రదర్శించి అందరికీ హెచ్చరిక చేయాలనే ఆసక్తీ ఉన్నది. అది ప్రమాదకరం. అంతే కాదు, హత్య జరుగుతూ ఉన్నప్పుడు, జనం ప్రేక్షకులుగా, జరిగిన తరువాత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంలో హెచ్చు ప్రమాదం ఉన్నది. చైతన్యం, పోరాటం, విప్లవం అని మాట్లాడిన సమాజం మౌనంగా ఉండడానికి, అణగారిపోవడానికి క్రమంగా అలవాటుపడుతున్నది, తెలంగాణ వీరపుత్రులు ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్న దౌర్జన్యాల విషయంలోనూ గాంధీగారి కోతుల వలె మిగిలిపోతున్నారు.


తెలంగాణ సమాజంలో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నది? ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముందు దశాబ్దంలోను, తరువాత ఈ ఏడేళ్లకాలంలోనూ ఏఏ పరిణామాలు జరిగాయి? కొత్తగా ఏర్పడిన అధికార సామాజిక సమీకరణలు ఎవరెవరిని బలశాలురను చేస్తున్నాయి, ఎవరిని కుంగదీస్తున్నాయి? ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిణామంలో ఒక భాగస్వామిగా ఉన్నదా, లేదా, కాలగతికే వదిలేసిందా? సకల జనుల భాగస్వామ్యంతో సమష్టి పురోగతికి పథకరచన చేయాలన్న స్పృహ ఉద్యమం నుంచి అధికారానికి వచ్చిన నాయకత్వానికి ఉన్నదా? ఉద్యమ విలువల నుంచి పరిపాలనను సమీక్షించేవారు, ప్రభుత్వాన్ని నిలదీసేవారు ఒక్కరైనా చట్టసభల్లో ఉన్నారా?


కేంద్రంలో తొలి యుపిఎ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, తెలంగాణలో కూడా రాజకీయ ఆదాయాలు బాగా పెరిగాయి. అభివృద్ధి పేరిట మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను చేపట్టడం, దాని ద్వారా అనుబంధ ఉత్పత్తిగా రాజకీయ ఆదాయాలను సమకూర్చుకోవడం జలయజ్ఞం నుంచి ముమ్మరమయింది. తెలంగాణ ఉద్యమం వేడెక్కుతుండడంతో, ఉమ్మడి రాష్ట్రంలో మునుపున్న దాని కంటె తెలంగాణ రాజకీయవాదులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రత్యేక రాష్ట్రం గురించి మరీ నిబద్ధతతో ఉన్నవారిని మినహాయించి, తెలంగాణ రాజకీయవాదులలో అత్యధికులు ప్రలోభాలకు అందుబాటులోనే ఉండేవారు. తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యులను సైతం కొనుగోలు చేయడం అధికారపక్షానికి సులువుగా ఉండింది. ఇక, మేమూ ఉద్యమం చేశాము అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఖరి నిమిషం దాకా అధికారపదవులను వదలకపోవడానికి కారణం కూడా అధికారంలో, దాని ప్రయోజనాలలో వారికి మంచి భాగస్వామ్యం ఉండడమే. 


ఆశ్చర్యకరంగా, ప్రత్యేక రాష్ట్ర అవతరణ తరువాత, తెలంగాణకు ప్రతిపత్తి, అధినాయకుడికి అధికారం వచ్చాయి కానీ, అనేక అంచెల నాయకశ్రేణికి నిర్ణయాధికారాలు దక్కలేదు. అధికారాన్ని, విధాన నిర్ణయాలను పూర్తిగా కేంద్రీకరించుకుని, ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు ఎటువంటి అధికారాలూ చొరవా లేకుండా చేసి, అభివృద్ధి మార్గంలో రాష్ట్ర నాయకత్వం స్తబ్ధతను ఏర్పరచింది. వైఎస్‌ఆర్ తరహాలో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా రాజకీయ ఆదాయ సమీకరణను కేంద్రీకృతం చేసింది. బడ్జెట్‌ను మొత్తం ఒకటి రెండు లక్ష్యాలకు పరిమితం చేయడంతో, మరే ఆర్థిక కార్యకలాపాలకూ ఆస్కారం లేక స్థానిక ప్రజాప్రతినిధులకు కాళ్లూచేతులూ కట్టేసినట్టయింది. దానితో అవకాశమున్నచోటల్లా స్థానిక వనరుల మీద రాబడిని పిండుకోవడానికి స్థానిక నాయకత్వం ఎగబడుతోంది. మన వనరులు మనకే.. అన్న నినాదాన్ని మరొక అర్థంలో చిల్లరదేవుళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇసుక, గ్రానైట్, గుట్టలు ధ్వంసం చేసే క్రషింగ్-.. ఇవి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో స్థానిక అధికార నేతల ఆదాయమార్గాలు. ఇసుక, దాని ద్వారా వచ్చే అక్రమ ఆదాయం స్థాయి, అందులో ఇమిడి ఉన్న నేరం ఊహించడానికి కూడా కష్టమే. సిరిసిల్ల జిల్లాలో ఇసుకలారీల జోరు, రోడ్డు ప్రమాద మరణాలు, బాధితుల మీదనే కేసులు తెలిసినవే. ఒకవైపు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా లేక, అలంకారప్రాయంగా ఉండవలసి వచ్చిన నిస్పృహ, మరొకవైపు వచ్చే ఎన్నికలకు ఆర్థికంగా కూడా సిద్ధపడవలసి ఉన్న అగత్యం సిటింగ్ ఎమ్మెల్యేలలో అధికులను సులభ ఆర్జనల వైపు మళ్లిస్తున్నది. విధాన నిర్ణయాలలో ప్రమేయం ఇవ్వకున్నా, నియోజకవర్గంలో శాసనసభ్యుడిదే పైచేయి అన్న శాసనం కారణంగా, పోలీసు యంత్రాంగంపై మాత్రం అదుపు లభిస్తున్నది. దాని వల్ల భూకబ్జాలకు లభించే సహకారాన్ని ఊహించుకోవలసిందే. అదనంగా, పోలీసుల నుంచే కప్పాల వసూళ్లు, డిఎస్పీ స్థాయి దాకా బదిలీలకు ప్రతిఫలాలు. నేరం చేయవలసిన అవసరం, అవకాశం, పర్యవసానాల నుంచి రక్షణ అన్నీ సమకూరుతున్నప్పుడు, క్షేత్రస్థాయి నాయకుల మీద అవినీతి ఆరోపణలు, నేరకథనాలు ఎందుకు వినిపించవు? తమ ఆదాయమార్గాలకు ఎవరైనా అడ్డుగా నిలిచినప్పుడు, అధికారాన్ని ఉపయోగించి పరిష్కరించుకోవాలని ఎందుకు ప్రయత్నించరు? ఇక ఇసుకలు, గనులు, లాభసాటి పోలీసు ఆదాయాలు లేనిచోట్ల పాపం, ప్రజాప్రతినిధులు తమ చేతిలో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల వాటాలతో కాలక్షేపం చేస్తున్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర–రాయలసీమ సామాజిక నాయకత్వంలో ఉండిన అధికార సమీకరణలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అనివార్యంగా మారవలసి వచ్చింది. అంతర్గత సమస్యల విషయంలో ఆధారపడడానికి స్థానికేతర నాయకులెవరూ అందుబాటులో ఉండని స్థితిలో, తెలంగాణలోని ప్రాబల్య వర్గాలు, వర్థమాన ప్రాబల్యవర్గాలు ఒక ఆచరణాత్మక సమీకరణంలోకి రావడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి. కానీ, ఒక సుస్థిర సమీకరణం ఏర్పడడం లేదు. తీవ్రమైన ఆశాభంగం, నిస్పృహతో ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఉపశమింపజేయడానికి అధికారపార్టీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. అదే వర్గానికి ఇతర పార్టీలు కూడా గురిపెట్టి ఉన్నాయి. కొత్తగా ఒక టుమ్రీ పార్టీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పట్లో జరగదనుకున్న బిసి కులాల సమీకరణ లేదా కొన్ని పెద్ద బిసి కులాల పటిష్టీకరణ ఇప్పుడు జరుగుతున్నది. ఆ పరిణామానికి ప్రోత్సాహం అనేక మార్గాల నుంచి వస్తున్నది. ఈ అనిశ్చిత, ద్రవాత్మక స్థితికి సంబంధించిన ఒడిదుడికులను తెలంగాణ సమాజం ఇంకా తీవ్రంగానే అనుభవిస్తున్నది. వర్థమాన ప్రాబల్యవర్గాలు అటు పాలక కులాలతో ఘర్షణ పడుతున్నాయి. మరొకవైపు, అడుగున ఉన్న దళితులతో వ్యవహరించే తీరులో సమస్యలు వస్తున్నాయి. పది పదిహేనేళ్ల కిందటి దాకా, అందరూ బాధితులే, కలసి పోరితే కలదు లాభం అనుకున్న గ్రామీణ సమాజంలో, కొందరు అధికారానికి ఆదాయాలకు దగ్గరై, అది అహంకారాలకు దారితీసి, నిన్నటి సహచరుల మధ్య చిచ్చు రగులుతున్నది. ఇటీవల తెలంగాణలో జరిగిన అనేక పరువు హత్యల సంఘటనలను, అనేక చోట్ల గ్రామీణ ఉద్రిక్తతలను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవలసి ఉన్నది.


తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేక పరిపాలనా యూనిట్‌ను సాధించడం మాత్రమే కాదు. తెలంగాణ నిర్దిష్టతలను అర్థం చేసుకుని, తనదైన సొంత అభివృద్ధి మార్గాన్ని రూపొందించుకోవడం అని ఆచార్య జయశంకర్ విశ్వాసం. అనేక చారిత్రక కారణాల వల్ల, వికాసపథంలోకి రాలేకపోయిన వివిధ సామాజిక వర్గాలను అర్థవంతమైన భాగస్వామ్యంలోకి రప్పించడం జరగాలి. అందుకోసం ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఉన్నతీకరణకు అవకాశాలు కల్పించాలి. సామాజిక, సాంస్కృతిక ఉన్నతీకరణ లేకుండా కేవలం ఆర్థికవనరులు పెరిగినంత మాత్రాన, అది కూడా ఇసుక సొమ్ము, సబ్‌ కాంట్రాక్టులు, పర్సంటేజిల వంటి సులభార్జన అయినప్పుడు నిజమైన సాధికారత సిద్ధించదు. డబ్బుకు ఉండే వాసనే, అధికారానికీ వస్తుంది. జులాయి డబ్బు కిరాయి నేరాలను పెంచుతుంది. తెలంగాణ వెనుకబడిన కులాలలో ఆర్థిక పరిపుష్టి కలిగిన ఒకటి రెండు కులాలు, అందుకు తగిన నిష్పత్తిలో సామాజిక, విద్యావిషయిక పరిపుష్టిని ఇంకా సమకూర్చుకోలేదు. అటువంటి కొరతలను భర్తీ చేసే విజన్ ఉద్యమానంతర అధికార నాయకత్వానికి ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత సమీకృత సామాజిక అభివృద్ధి ప్రణాళికను చేపట్టవలసి ఉండిన ప్రభుత్వం, శుష్కమైన విధానాలతో కాలం గడుపుతున్నది. ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నించగలిగినవారిని బలహీనపరిచారు. ఆ బస్సుల్లో ప్రయాణికుల మాదిరే అందరూ భయపడిపోయి ఉన్నారు లేదా అలవాటైపోయి ఉన్నారు.

కె. శ్రీనివాస్

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...