నేరం సేద్యానిది..!

ABN , First Publish Date - 2022-05-27T06:18:49+05:30 IST

ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించేకునేవారు. వచ్చిన కూలి డబ్బులు తిండిగింజలకే సరిపోతున్నాయి.

నేరం సేద్యానిది..!
నిందితులతో ఎస్పీ

బతుకు మారుతుందని వ్యవసాయం

అప్పులపాలై.. దిక్కుతోచక దొంగతనం

పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు కూలీలు


ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించేకునేవారు. వచ్చిన కూలి డబ్బులు తిండిగింజలకే సరిపోతున్నాయి. ‘మన బతుకులు ఇంతేనా..? పూట పూటకీ మెతుకులు వెతుక్కోవాల్సిందేనా..?’ అని ఆవేదన చెందారు. ఎన్నాళ్లని కూలి పనులకు వెళతాం..? సేద్యం చేస్తే కలిసొస్తుందేమో చూద్దామని అనుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. అప్పు చేసి వేరుశనగ సాగు చేశారు. అధిక వర్షాలకు పంట నాశనమైంది. మళ్లీ కూలీలయ్యారు. అప్పులు మిగిలాయి. ఇచ్చినవారు ఊరకే ఉంటారా..? నిలదీశారు. దిక్కుతోచక.. ఆ ఇద్దరు దొంగలయ్యారు. పోలీసులకు పట్టుబడ్డారు. అనంతలో వ్యవసాయం అన్నదాతల పాణాల్నే కాదు.. మానాల్నీ బలిగొంటోంది. 


కణేకల్లు పోలీస్‌ స్టేషనలో ఎస్పీ ఫక్కీరప్ప గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కంబదూరు మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్న పాటిల్‌ తిమ్మారెడ్డి (42), అదే మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన దివాకర్‌ స్నేహితులు. ఇద్దరూ కూలి పనులు చేసేవారు. కలసి వ్యవసాయం చేయాలనే ఆలోచన రావడంతో, కంబదూరుకు చెందిన సాయిరామ్‌ తోటను గుత్తకు తీసుకుని, వేరుశనగ సాగు చేశారు. అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోయారు. మళ్లీ కూలీలుగా మారారు. కూలి డబ్బు కుటుంబ పోషణకే సరిపోయేది. సేద్యం కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. వాటిని తీర్చేందుకు దొంగతనం చేయడం తప్ప మార్గం లేదని అనుకున్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ యంత్రాల దొంగతనం చేయడం మొదలుపెట్టారు. జిల్లాలోని కణేకల్లు, ఉరవకొండ, యాడికి, సీకే పల్లి, కుందుర్పి, కంబదూరుతోపాటు కడప జిల్లా పులివెందుల, నంద్యాల జిల్లా డోన, బనగానపల్లి తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 14 చోట్ల యంత్ర పరికరాలను చోరీ చేశారు. వాటిని కర్ణాటకలోని పావగడ తాలుకా రాయనపల్లికి చెందిన నెల్లూరు రమే్‌షకు విక్రయించేవారు. కణేకల్లు మండలం పుల్లంపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అనే రైతుకు చెందిన ట్రాక్టర్‌ను ఇటీవల దొంగలించారు. రాయదుర్గం సీఐ యుగంధర్‌ ఈ కేసు దర్యాప్తు చేశారు. రైతులే దొంగలుగా మారినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32 లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను పోలీసులు రికవరీ చేశారు. ఇందులో ఎనిమిది ట్రాక్టర్లు, ఐదు ట్రాలీలు, మూడు రొటావేటర్లు, రెండు టిల్లర్లు, ఉన్నా యి. విలేకరుల సమావేశంలో సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

- కణేకల్లు 

Updated Date - 2022-05-27T06:18:49+05:30 IST