కూపీ లాగారు.. డొంక కదిలింది

ABN , First Publish Date - 2021-10-15T05:17:40+05:30 IST

నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టిం చిన రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది.

కూపీ లాగారు.. డొంక కదిలింది
రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ నర్మద

నల్లగొండ జిల్లాలో రైతుబంధు చెక్కుల దుర్వినియోగం

547 చెక్కులతో రూ.61,50,460 డ్రా చేసిన వైనం 

23మంది రెవెన్యూ, బ్యాంకు సిబ్బంది, దళారులు అరెస్టు

నల్లగొండ క్రైం, అక్టోబరు 14: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టిం చిన రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న 23మంది రెవెన్యూ, బ్యాంకు సిబ్బంది, దళారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నర్మద వెల్లడించారు. వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం 2018 మే నెలలో ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుబంధు పథకంలో రైతులకు చెక్కులు పంపిణీ చేసింది. తర్వాత చనిపోయిన వారి పేరిట,  భూమి వివరాలు తప్పుగా పడిన వారి పేరిట, ఇతర ప్రాంతాల్లో ఉంటూ చెక్కులు తీసుకోని రైతుల పేరిట వచ్చిన చెక్కుల దుర్వినియోగం జరిగింది. గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూరు మండలాల పరిధిలో రైతుబంధు చెక్కుల దుర్వినియోగం జరిగిందని ఆయా శాఖల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. ఆయా మండలాల పరిధిలోని కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రైతుల పేరిట వచ్చిన చెక్కులను డ్రా చేసినట్లు విచారణలో తేలింది. 547చెక్కులను ఉపయోగించి రూ.61,50,460 నగదు డ్రా చేశారు. రైతుబంధు చెక్కుల దుర్వినియోగంతో సంబంధం ఉన్న 23 మ ందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐలు రవీందర్‌, సత్యం, మధు, ఎస్‌ఐలు, శీనయ్య, వీరబాబు, రఫీ, వెంకటేశ్వర్లు ఉన్నారు. 


అంతా కుమ్మక్కై...

రైతుబంధు చెక్కుల దుర్వినియోగంతో సంబంధమున్న 23మందిని పోలీసులు అరెస్టు అరెస్టు చేశారు. గుర్రంపోడు మండలంలో గుర్రంపోడు డిప్యూటీ తహసీల్దార్‌ జావెద్‌, నాంపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్‌ క్యాషియర్‌ రవినా యక్‌, జూనూతల వీఆర్వో సయ్యద్‌ అహ్మద్‌, మధ్యవర్తి రేషన్‌ డీలర్‌ బొమ్ము వెంకటేశ్వర్లు, మధ్యవర్తి మూడావత్‌ దస్రు, జూనూతల వీఆర్‌ఏ వాటిక మ ల్లయ్య, మధ్యవర్తులు భద్రి భిక్షం, కట్టబోయిన విజయ్‌, పసుల వెంకటయ్య, పీఏపల్లి మండల పరిధిలోని పొల్కంపల్లి వీఆర్‌ఏ కిరణ్‌కుమార్‌, ఎస్‌బీఐ క్యాషియర్‌ రవినాయక్‌, బీమనపల్లి వీఆర్‌ఏ నాగయ్య, మధ్యవర్తులు గుండ్ల భిక్షం, భద్రి భిక్షం, డి. దోసంతం, నాంపల్లి మండల పరిధిలో టీపీగౌరారం వీఆర్వో ఉలూపుల శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంక్‌ క్యాషియర్‌ రవినాయక్‌, పసునూరు వీఆర్వో ఎడ్ల గిరి, నాంపల్లి వీఆర్వో అటికం సత్యనారాయణ, తుమ్మలపల్లి వీఆర్వో చింత దశరథ, రేవల్లి వీఆర్‌ఏ కోరె యాదగిరి, మధ్య వర్తులు భరత్‌, పల్స వెంకటేశ్‌, గంజి సంజీవ, వర్కాల శ్రీకాంత్‌, నాంపల్లి మీసేవా సెంటర్‌ నిర్వాహకుడు పెరికేటి రమేష్‌, కోరె వెంకన్న, చింతపల్లి మండలానికి సంబం ధించి వర్కాల వీఆర్వో ఎడ్ల గిరి, నాంపల్లి ఎస్‌బీఐ క్యాషియర్‌ రవినాయక్‌, మధ్యవర్తులు గొల్లూరి మధు, గంజి సంజీవలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకొండ డీఎస్పీ అనం ద్‌రెడ్డి తమ పరిధిలోని అధికారులను అప్రమత్తం చేసి కేసును చేధించినట్లు ఏఎస్పీ తెలిపారు. గెజిటెడ్‌ అధికారులను, ఈ కేసులో ఉన్న మరికొంత మందిని పోలీస్‌ అధికారులు వెనుకేసుకొస్తున్నారనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, ప్రమేయమున్న అందరినీ విచారించినట్లు ఏఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-10-15T05:17:40+05:30 IST