Abn logo
Sep 25 2021 @ 00:24AM

పల్లెలు ప్రకృతివనాలతో కళకళలాడాలి

హుజూరాబాద్‌లో లబ్దిదారుల అకౌంట్ల వివరాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌

- ఉపాధిహామీ పనులు 100 శాతం చేయాలి

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పల్లెప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పల్లెలు ప్రకృతి వనాలతో కళకళలాడేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పల్లెప్రగతి పనులు, ఉపాధి హామీ పనులు, సెగ్రిగేషన్‌షెడ్‌, ప్లాంటేషన్‌, నర్సరీలపై కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం పనులను గ్రామ పంచాయతీలలో 100 శాతం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తి చేయని వైకుంఠధామాలను వచ్చేనెల అక్టోబర్‌ రెండవ తేదీలోగా పూర్తి చేయాలని, ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. ఎంపీడీవోలు ప్రతిరోజు గ్రామాలను సందర్శించి పల్లెప్రగతి పనులపై రోజువారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో మొక్కలు నాటించాలని తెలిపారు. ప్లాంటేషన్‌ కోసం ఐదెకరాల నుంచి పదెకరాల స్థలాన్ని గుర్తించాలని అన్నారు. స్థలాలు అందుబాటులో లేని చోట కుంటలు, గుట్ట ప్రాంతాల వద్ద ప్లాంటేషన్‌ చేయాలని తెలిపారు. నర్సరీలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాల్లో తడి, పొడి వేరు చేసి తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని మండలాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ మొదటి డోసు ఇవ్వాలని, మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలని తెలిపారు. మండలాలవారీగా 18 సంవత్సరాలు పైబడిన వారిని సర్వే చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలు సమన్వయంతో కలిసి పనిచేసి పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఎఫ్‌వో బాలామణి, డీఆర్‌డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, ఆర్డీవోలు ఆనంద్‌కుమార్‌, రవీందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


‘దళితబంధు’ నగదుకు ప్రతి నెలా వడ్డీ జమ


హుజూరాబాద్‌: దళితబంధు పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండే నగదుకు ప్రతి నెలా వడ్డీ జమ చేస్తామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో దళితబంధు సహాయ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకం అమలుపై లబ్ధిదారులకు కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు బ్యాంకుల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళితబంధు పథకం ద్వారా నగదు జమ అయిందా లేదా అని ఆయా బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు.  లబ్ధిదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. లబ్ధిదారుల పేర్లు, ఖాతా నంబర్‌ను సహాయ కేంద్రంలోని కంఫ్యూటర్‌లలో నమోదు చేసి వివరాలను పరిశీలించారు. నగదు జమ అయినట్లు కనిపించగా లబ్ధిదారులకు తెలిపారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసి కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన దళిత కుటుంబాలందరికీ ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ సూచించారు. దళితబంధు పథకం డబ్బుల జమపై సంక్షిప్త సందేశం రాని లబ్ధిదారులు వారికి కేటాయించిన బ్యాంకులోని సహాయ కేంద్రాలకు వచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ అయిన నగదుతో స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించుకునే వరకు ఖాతాల్లో ఉన్న నగదుకు ప్రతి నెలా రూ. 2475చొప్పున వడ్డీ జమ అవుతుందని తెలి పారు. దళితబంధు పథకంతో లాభసాటి యూనిట్లను స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ కిషోర్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.


దళితబంధు హెల్ప్‌లైన్‌ డెస్క్‌ను ప్రారంభించిన కలెక్టర్‌


వీణవంక : మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో దళితబంధు హెల్ప్‌ డెస్క్‌ను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ దళితబంధు నగదు జమ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు ఈ డెస్క్‌ను ప్రారంభించామన్నారు. ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం రాని వారు నేరుగా హెల్ప్‌ డెస్క్‌లో సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మేనేజర్‌ సీఈవో సత్యనారాయణ, బ్యాంకు మేనేజర్‌ తదితరులు పాలొన్నారు.