పల్లెలు భద్రమే!

ABN , First Publish Date - 2020-04-04T10:53:14+05:30 IST

జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల పరిధిలో కరోనా కట్టడి పకడ్బందీగా కొనసాగుతోంది.

పల్లెలు భద్రమే!

వీడీసీ, సర్పంచ్‌ల సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు

చైతన్యవంతులవుతున్న గ్రామీణ ప్రాంత నేతలు

గ్రామ కట్టుబాట్లతో స్వీయ నియంత్రణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహకారం

పట్టణాల్లోనేఆందోళనకర పరిస్థితులు


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 467 గ్రామ పంచాయతీల పరిధిలో కరోనా కట్టడి పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో విదేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండ డంతో పెద్దగా ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిం చడం లేదు. మహారాష్ట్రతో కొంత ప్రమాదమే ఉన్నా.. ముందే అప్రమత్తమైన అధికారులు సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. అలాగే సరిహద్దు మండలా లైన బోథ్‌, భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో 124 మందిని హోంక్వా రంటైన్‌కు తరలించగా 107 మంది 14 రోజుల క్వారంటైన్‌ సమయాన్ని పూర్తి చేసుకున్నారు.  దాదాపుగా వీరంతా పట్టణ, మండల కేంద్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. జిల్లాలో ఎక్కు వగా మారుమూల గిరిజన గ్రామాలే ఉన్నా కరోనా వైరస్‌ పట్ల ప్రజలు చైతన్యవంతులై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. 


పట్టణాల్లోనే ఆందోళనకరం..

నిత్యం వందలాది మంది పోలీసులు, ఆయా శాఖల అధికారులు కట్టడి చర్యలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నా విద్యావంతులైన పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదంటు న్నారు. దీంతో పట్టణ ప్రాంతం, మండల కేంద్రాల్లో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కువ అనుమానిత కేసులు కూడా పట్టణంలోనే నమోదవుతున్నాయి.


వీడీసీ, సర్పంచ్‌ల సమన్వయం..

కరోనా వైరస్‌ నేపథ్యంలో వీడీసీ, సర్పంచ్‌ల మధ్య సమన్వయం కనిపిస్తోంది. కరోనా కట్టడికి తీసుకునే జాగ్రత్తలు, చర్యలపై సంప్రదింపులు చేసుకుంటూ సమష్టి నిర్ణయాలను తీసుకుంటున్నారు. గ్రామంలోని వ్యాపార సముదాయాలను మూసి వేయడం, ఊరి పొలిమేరల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, నిత్యావసర సరుకుల పంపిణీ లాంటి వివిధ నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకుంటున్నారు. మొత్తా నికి అందరు ఏకం కావడంతో ఒకరు కూడా ఊరును విడిచి బయటకు రావడం లేదు.


పల్లె నేతల చైతన్యం..

గ్రామీణ ప్రజలతో పాటు నేతల్లోను చైతన్యం కనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  తీసుకుం టున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు కరోనా కట్టడిలో ముందుంటున్నారు. ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు లేకున్న సొంత నిర్ణయాలు, ఆలోచనను అమలు చేస్తున్నారు. దాదాపుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నా కొందరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో కట్టడి చర్యలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


బోథ్‌ మండల ఎంపీపీ తుల శ్రీనివాస్‌ మండలంలో విసృ తంగా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నారు. అలాగే ఇచ్చోడ మండలం ముక్రా(కె) గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి , ఎంపీటీసీ సుభాష్‌లు గ్రామ ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. బోథ్‌ మండలం పాట్నాపూర్‌ గ్రామ సర్పంచ్‌ గ్రామస్థుల నుంచి విరాళాలను సేకరిస్తూ కరోనా కట్టడికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా పని చేయడంతో జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సులువవుతోంది.

Updated Date - 2020-04-04T10:53:14+05:30 IST