పల్లె ప్రకృతివనాలు భేష్‌

ABN , First Publish Date - 2021-06-22T05:36:53+05:30 IST

పల్లె ప్రకృతివనాలు భేష్‌

పల్లె ప్రకృతివనాలు భేష్‌
శివసాగర్‌ చెరువు వద్ద మిని ట్యాంక్‌ బండ్‌, పార్కు ఏర్పాటు కోసం స్థలం పరిశీలిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • పల్లె, పట్టణ ప్రగతి పనులు వేగంగా పూర్తిచేయాలి
  • త్వరలో వికారాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్‌ ఫ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాలో పల్లె ప్రకృతివనాలు బాగున్నాయంటూ సీఎం కేసీఆర్‌ ప్రశంసించారని, ఆదిశగా కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం హరితహారంపై ఆమె కలెక్టరేట్‌ నుంచి  వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, మునిసిపల్‌చైర్మన్లు, కమిషనర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రికైన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా జిల్లా ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు 3కోట్లకు పైగా మొక్కలు నాటితే, ఈ సారి 40.25 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం ఉందన్నారు. ప్రతినెలా పల్లెప్రగతికి రూ.308 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.150 కోట్ల నిధులు నేరుగా గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఛాలెంజ్‌గా తీసుకుని పనులు చేస్తున్నారని, జిల్లాలో ఒక్కో మండలంలో 5 నుంచి 10ఎకరాల్లో ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించాలని, ఈ విషయంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు అధికారులతో కలిసి తగిన చొరవ తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి నర్సరీ ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల వద్ద అవసరం మేరకు బోర్లు వేయాలన్నారు. సీఎం ఆకస్మికంగా గ్రామాల పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిపనులు పూర్తి చేయాలని, ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆమె సూచించారు. 

33 శాతానికి పెరిగిన పచ్చదనం

హరిత తెలంగాణ సాధన కోసం సీఎం ప్రత్యేకంగా పది శాతం గ్రీన్‌బడ్జెట్‌ ఏర్పాటు చేశారని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో 24 శాతం ఉన్న పచ్చదనం 33 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి భవిష్యత్తుతరాలకు స్వచ్ఛమైన గాలిని అందిద్దామని  చెప్పారు. ఇదిలాఉంటే, పాఠశాలలు జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకనుగుణంగా పాఠశాలలను సిద్ధం చేయాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసు,  ఎమ్మెల్సీ సురభివాణీదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, కొప్పుల మహే్‌షరెడ్డి, పైలెట్‌రోహిత్‌రెడ్డి, టీఎ్‌సఈడబ్ల్యుఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మెన్‌ విజయకుమార్‌, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ మురళీకృష్ణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌ తదితరులు 

పాల్గొన్నారు. 

త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్‌ రాక..

వికారాబాద్‌: త్వరలో వికారాబాద్‌కు ముఖ్యమంత్రి  కేసీఆర్‌ రానున్నారని నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ముందుగా శివసాగర్‌ చెరువు వద్ద రూ. 5కోట్లతో నిర్మించబోయే పార్కు, మినీ ట్యాంక్‌బండ్‌   కోసం స్థలాన్ని, నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లో గదులు, మీటింగ్‌హాల్‌ తదితర వాటిని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇలా ఏదైనా తానే ఒక ఇంజనీర్‌గా మారి ఈ రాష్ట్రాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. త్వరలో వికారాబాద్‌ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:36:53+05:30 IST