పీవీ సేవలకు దేశం గర్విస్తోంది

ABN , First Publish Date - 2022-06-29T10:06:39+05:30 IST

దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందించిన సేవలకు భారత్‌ గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

పీవీ సేవలకు దేశం గర్విస్తోంది

  • మాజీ ప్రధాని జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ నివాళి
  • పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య


న్యూఢిల్లీ/రాంగోపాల్‌పేట్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందించిన సేవలకు భారత్‌ గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ట్విటర్‌ ద్వారా ఆయనకు మంగళవారం నివాళి అర్పించారు. పీవీ ఓ మేధావి, విద్యావేత్త అని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్‌ చేయగా, పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. ఇక, దేశాన్ని ఆర్థిక సంస్కరణల యుగంలోకి తీసుకెళ్లిన పీవీ సేవలు ఎప్పటికీ మరువలేమని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌, మాజీ మంత్రి ఎం.పల్లం రాజు, కాంగ్రెస్‌ నేత, ఎంపీ మాణిక్కమ్‌ ఠాగూర్‌ తదితరులు కూడా  పీవీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని పీవీ దేశంలో నిజమైన రాజకీయ చాణుక్యుడని టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పీవీ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.  


పీవీ గౌరవాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తాం : కిషన్‌రెడ్డి

దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి అత్యుత్తమ పాలన అందించిన మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గౌరవాన్ని పెంచే కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పీవీ జ్ఞాన్‌భూమిలో ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్ధనలు చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యావత్‌ దేశంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన వ్యక్తి పీవీ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొనియాడారు. అలాంటి వ్యక్తిని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు. ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలతో దేశానికి దశ, దిశ చూపిన మాజీ ప్రధాని పీవీ భారత జాతి రత్నమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పీవీని గౌరవించలేని వ్యక్తి కేసీఆర్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.  


గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులు దేశాన్ని పాలించడం కాంగ్రెస్‌కు ఇష్టంలేక పీవీని నానా ఇబ్బందులకు, అవమానాలకు గురిచేశారన్నారు. పీవీకి భారత రత్న కోసం ప్రధానికి సిఫారసు చేస్తారా? అన్న ప్రశ్నకు ఆలోచిస్తామని దాటవేశారు. రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, మహమ్మూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, హైకోర్డు జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌, బీసీ కమీషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, సురభి వాణీదేవి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నగేష్‌, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ లాబీల్లోని పీవీ చిత్రపటానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు. 

Updated Date - 2022-06-29T10:06:39+05:30 IST