కాంగ్రెస్‌ పాలనలో దేశం అధోగతి

ABN , First Publish Date - 2021-11-29T06:39:03+05:30 IST

57 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పాలనలో దేశం అధోగతి పాలయ్యిందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌సింగ్‌ ఆర్య ఆరోపించారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఆదివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ పేరిట రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు

కాంగ్రెస్‌ పాలనలో దేశం అధోగతి
రాజ్యాంగ దినోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న లాల్‌సింగ్‌ ఆర్య, ఇతర నాయకులు

బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య

సిరిపురం(విశాఖపట్నం), నవంబరు 28 : 57 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పాలనలో దేశం అధోగతి పాలయ్యిందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,  మాజీ ఎంపీ లాల్‌సింగ్‌ ఆర్య ఆరోపించారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఆదివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్‌ గౌరవ్‌ అభియాన్‌’ పేరిట రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో పథకాలు చేపట్టారని అన్నారు. మోదీ ఏడేళ్ల పాలనలో అన్ని రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ కృషి చేస్తున్నదన్నారు. రాజ్యాంగ దినోత్సవాలను 12 రోజులపాటు నిర్వహిస్తున్నామని, ఇందులోభాగంగా వచ్చే నెల 6వ తేదీన సంవిధాన్‌ నిర్మాణ దివస్‌ నిర్వహిస్తున్నట్టు వివరించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ హయాంలో మధ్యప్రదేశ్‌లో బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ప్రారంభించినట్టు వివరించారు.

ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు. మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మోదీ చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంభూనాథ్‌, రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు,  బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జి.దేవానంద్‌, ప్రధాన కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం,  ఎస్సీ మోర్చా ఇన్‌చార్జ్‌ జె.ప్రకాష్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌, ఇతర నాయకులు ఎస్‌.ఉమామహేశ్వరరావు, కె.విజయబాబు, ఎన్‌.విజయానందరెడ్డి, బేబి రాణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-29T06:39:03+05:30 IST