విష నగరంగా విశ్వనగరం

ABN , First Publish Date - 2022-06-09T09:28:31+05:30 IST

‘‘మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనలో వినియోగించిన కార్లు ఎవరివి? ఆ కార్లను మైనర్లు ఎలా నడిపారు?

విష నగరంగా విశ్వనగరం

పబ్‌లు, డ్రగ్స్‌ కేంద్రంగా హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌ ఘటనలో ఆ కార్లు ఎవరివి?

వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?

కీలక ఆధారాలు చెరిపేసే యత్నం జరిగింది

సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు

ఆ పబ్‌లపై దాడులు చేస్తాం:  రేవంత్‌


న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనలో వినియోగించిన కార్లు ఎవరివి? ఆ కార్లను మైనర్లు ఎలా నడిపారు? వాటి యజమానులపై తీసుకున్న చర్యలేంటి? ఆ వివరాలను సీపీ ఆనంద్‌ ఎందుకు చెప్పడం లేదు?’’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశ్వనగరంగా ఉండాల్సిన హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విషనగరంగా మార్చుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ను పబ్‌లు, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోబోదన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, సమయం ముగిసినా తెరిచి ఉండే పబ్‌లపై దాడులు చేయాలని ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల కు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా కథనాల ప్రకారం ఇన్నోవా కారు వక్ఫ్‌ బోర్డుకు చెందినదని, బెంజ్‌ కారు ఎంఐఎం నాయకుడిది అని తెలుస్తోందని, వారి వివరాలను పోలీసులు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ‘మే 31న ఫిర్యాదు అందితే ఈ నెల 4వ తేదీ వరకు ఆ వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అన్ని రోజులు ఆ వాహ నం ఎక్కడుంది? ఇన్నోవాకు కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపేసి నేరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఇదంతా ఎవరు చేశారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ను ఎందుకు తొలగించలేదు. ఘటనపై స్పందించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు లేదా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. మైనర్లను అనుమతించిన పబ్‌ యాజమాన్యంపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలకు మూలాలు పబ్‌లలోనే ఉన్నాయన్నారు. వీటిలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక 150 పబ్‌లకు అనుమతి ఇచ్చారని, సీఎం బంధువులు ప్రజల బలహీతలతో వ్యాపారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పబ్‌ల జోలికే వెళ్లడం లేదని, ఈ విషయాన్ని సీపీ సీవీ ఆనందే స్వయంగా చెప్పారని తెలిపారు.

Updated Date - 2022-06-09T09:28:31+05:30 IST