కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-06-01T09:14:44+05:30 IST

జిల్లాలో ఆదివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా విజృంభణ

తాజాగా మరో 4 కేసులు

నగర పరిధిలో ముగ్గురు, గ్రామీణంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ

జిల్లాలో 113కి పెరిగిన కేసుల సంఖ్య

1,796 మంది రిపోర్టుల కోసం నిరీక్షణ


విశాఖపట్నం/ కూర్మన్నపాలెం, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 113కి పెరిగింది. తాజాగా నమోదైన నాలుగు కేసుల్లో ముగ్గురు విశాఖ నగరంలో, ఒకరు గ్రామీణ ప్రాంతంలో వున్నారు. విశాఖలో మర్రిపాలేనికి చెందిన వ్యక్తి ఒకరు ఉపాధి నిమిత్తం చెన్నై వెళ్లి ఇటీవల తిరిగి విశాఖకు వచ్చాడు. అతనిని షీలానగర్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది.


అయితే ఇతను చెన్నై నుంచి వచ్చిన తరువాత కుటుంబ సభ్యుల్ని కలిశారా? లేక కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారా? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మహారాణిపేటలో ప్రైవేటు ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన ఒక రోగి కాంటాక్టుతో అదే ఆసుపత్రిలో మేనేజరుగా పనిచేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతను చినవాల్తేర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని కుటుంబ సభ్యులు, ఇతర కాంటాక్టులపై అధికారులు అప్రమత్తమయ్యారు. 


దుగ్గపువానిపాలెంలో.....

గాజువాక ప్రాంతం వడ్లపూడి సమీపంలో వున్న దుగ్గపువానిపాలెంలో ఓ యువకుడికి(21) కరోనా బారిన పడ్డాడు. ఇతను స్థానికంగా ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. పదో రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో 29వ తేదీ నగరంలోని ఛాతి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇతను మరో ముగ్గురితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలే విజయవాడ నుంచి వచ్చినట్టు సమాచారం. దీంతో రూమ్‌మేట్స్‌ని అధికారులు వైద్య పరీక్షలకు తరలించారు. 


గ్రామీణంలో...

కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన యువకుడికి(30) కరోనా సోకింది. ఉపాధి నిమిత్తం  జనవరిలో హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ నుంచి రామగుండం వెళ్లాడు. తాజాగా బస్సులో విశాఖ చేరుకున్న యువకుడికి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించారు. తరువాత క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. 


కాగా జిల్లాలో ఆదివారం 548కి పరీక్షలు నిర్వహించారు. దీంతో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 32,537కి చేరింది. వీరిలో 30,628 మందికి నెగెటివ్‌ రిపోర్టులు రాగా 113 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 1,796 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారంనాటికి 59 మంది ఐసోలేషన్‌లో, 793 మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ నుంచి కోలుకున్న ఇద్దరిని డిశ్చార్జి చేశారు.

Updated Date - 2020-06-01T09:14:44+05:30 IST