కోర్‌ మాకొద్దు!

ABN , First Publish Date - 2021-06-20T09:13:01+05:30 IST

‘‘విద్యార్థుల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు.. వారి నుంచి వచ్చే ఫీజు మాత్రమే మాకు ముఖ్యం’’ అనేలా వ్యవహరిస్తున్నాయి ఇంజనీరింగ్‌ కాలేజీలు.

కోర్‌ మాకొద్దు!

  • ఆ ఇంజనీరింగ్‌ కోర్సులు వల్ల మాకు లాభాలు రావట్లే
  • కాలేజీల యాజమాన్యాల తీరు ఇది
  • కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే కావాలంటూ దరఖాస్తులు
  • వాటితో అధిక ఫీజు వసూలు చేయొచ్చని యోచన
  • సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ కోర్సుల రద్దుకు విజ్ఞప్తులు
  • డిమాండ్‌ ఉన్నా రెండేళ్లలో 40 వేల సీట్లు రద్దు
  • ఆ కోర్సుల్లో యాజమాన్య కోటాలో చేరేందుకు..
  • విద్యార్థులు ఇష్టపడకపోవడమే కారణం
  • కాలేజీల యాజమాన్యాల వ్యాపారాత్మక ధోరణి


హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యార్థుల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు.. వారి నుంచి వచ్చే ఫీజు మాత్రమే మాకు ముఖ్యం’’ అనేలా వ్యవహరిస్తున్నాయి ఇంజనీరింగ్‌ కాలేజీలు. విద్యార్థులు, పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్న కోర్సులను తమ కాలేజీల్లో రద్దు చేయాలని కోరుతున్నాయి. ‘‘మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 180 సీట్లు ఉన్నాయి.. వీటిని రద్దుచేయండి..’’ నగర శివారులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ ఇటీవలే జేఎన్టీయూకు దరఖాస్తులో చేసిన విజ్ఞప్తి ఇది. అదే విధంగా మరో ప్రముఖ కాలేజ్‌ మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో 180 చొప్పున ఉన్న 360 సీట్లనూ రద్దుచేయాలని దరఖాస్తు చేసుకుంది. ఇవే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 176 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 32 కాలేజీలు ఇదేతరహా దరఖాస్తులు సమర్పించాయి. ఎందుకంటే ఈ కోర్సుల్లో యాజమాన్య కోటాలో చేరేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. 


కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ)తో పోల్చితే ఇతర కోర్సులతో తమకు పెద్దగా లాభాలు ఉండటం లేదని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజనీరింగ్‌  కాలేజీల్లో అన్ని బ్రాంచుల్లో 97,741 సీట్లుండగా.. ఇందులో 69,365 (71శాతం) సీట్లు కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ అవుతాయి. మిగతా 28,376 (29శాతం) సీట్లను కాలేజీల యాజమాన్యాలు యాజమాన్య కోటాలో భర్తీ చేసుకోవచ్చు. ఈ కోటాలో ఇష్టారాజ్యంగా కాలేజీలు ఫీజులు వసూలు చేసుకుంటాయి. అయితే, గత ఏడాది నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ)లో భాగంగా ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ లాంటి కోర్సులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే అమల్లో ఉన్న సీట్లను రద్దు చేసుకుని ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులను పొందవచ్చని ఏఐసీటీఈ గత ఏడాది ప్రకటించడంతో.. రాష్ట్రంలో దాదాపు వందకు పైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో కోర్‌ బ్రాంచ్‌లుగా పేరుగాంచిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లను చాలా కాలేజీలు గత ఏడాది రద్దు చేసుకున్నాయి. ఈ బ్రాంచ్‌లకు యాజమాన్య కోటాలో పెద్దగా ప్రవేశాలు ఉండవు. సీఎ్‌సఈ, ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. కన్వీనర్‌ కోటాలో సీటు పొందనివారు యాజమాన్య కోటాలో ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించవచ్చన్న లక్ష్యంతో కాలేజీలు సంప్రదాయ కోర్సులను వదిలి ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నాయి. 

 

ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నా రద్దు

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులూ ప్రధానమైనవే. భవనాలు, రహదారులు, నౌకాశ్రయాలు, మౌలిక వసతుల కల్పన, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతి సమస్యకు సివిల్‌ ఇంజనీరింగ్‌ పరిష్కారం చూపిస్తుంది. అలాగే పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల్లో మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీర్ల పాత్ర కీలకం. దేశ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల పాత్ర కీలకం కాబట్టే.. వీటిని ‘‘మదర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌’’ కోర్సులుగా పేర్కొంటారు.  ఇంజనీరింగ్‌ కాలేజీ అనుమతి పొందాలంటే కనీసం 300 సీట్లకు సరిపడా వసతులు ఉండాలి. కనీసం 5 వేర్వేరు బ్రాంచులుండాలి. దీని ఆధారంగానే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తుంది. ఒక కాలేజీలో 300 సీట్లుంటే అందులో సీఎ్‌సఈలో 100 సీట్లుంటే.. మిగతా 200 సీట్లలో సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ కోర్సులుండేవి. 


అయితే, పాత సీట్లు రద్దుచేసుకుంటే ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులకు ఏఐసీటీఈ అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో గత ఏడాది దాదాపు 25 వేల కోర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల సీట్లు రద్దయ్యాయి. అంతకుముందు ఏడాది విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని 15 వేల సీట్లను ఎత్తివేశారు. గత రెండేళ్లలో 40 వేల సీట్లను రద్దుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని 176 కాలేజీల్లో 97,741 సీట్లుండగా.. ఇందులో ఎలక్ర్టికల్‌ 6,928, మెకానికల్‌ 6,135, సివిల్‌ 6,420 సీట్లు మాత్రమే మిగిలాయి. అనేక ప్రముఖ కాలేజీల్లో ఇప్పుడు మొత్తం సీట్లలో 50-70శాతం వరకు సీఎ్‌సఈ, ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులే ఉన్నాయి. కాలేజీల్లో పాత కోర్సుల రద్దుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. ఇందులో 32 కాలేజీలు కోర్‌ సబ్జెక్టులు రద్దు చేసి వాటిస్థానంలో సీఎ్‌సఈ, ఎమర్జింగ్‌ కోర్సులు కావాలని దరఖాస్తు చేశాయి. వీటికి జేఎన్టీయూ అంగీకరిస్తే రానున్న విద్యా సంవత్సరంలో కోర్‌ కోర్సుల్లో సీట్లు మరింత తగ్గనున్నాయి. 


కోర్‌ కోర్సులూ ఉండాల్సిందే                    

ఇంజనీరింగ్‌ అంటే కేవలం కంప్యూటర్‌ సైన్సే కాదు. ఇతర సబ్జెక్టులకూ కాలేజీల యాజమాన్యాలు సమప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం కంప్యూటర్‌ ఇంజనీర్లతోనే దేశ పారిశ్రామిక ప్రగతి సాగదు. అన్ని కోర్సులకు సమప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఏఐసీటీఈ సైతం ప్రత్యేక నిబంధనలు జారీచేసింది. అయితే, నిబంధనల ప్రకారమే కోర్సులను రద్దుచేసేందుకు అనుమతి ఇస్తాం. 

-ప్రొఫెసర్‌ మన్జూర్‌ హుసేన్‌, రిజిస్ర్టార్‌, జేఎన్టీయూ


విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు            

లాభార్జనే ధ్యేయంగా ఇంజనీరింగ్‌ కాలేజీలుకోర్సులను రద్దు చేస్తున్నాయి. ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వారి చదువు పూర్తయ్యేంతవరకు ఆ కోర్సు కొనసాగించి.. అధ్యాపకులను కూడా కొనసాగించాలి. అనేక కాలేజీలు కోర్సు రద్దుచేసిన వెంటనే ఫ్యాకల్టీని తొలగిస్తున్నాయి. ల్యాబ్‌లను మూసేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

- వి.బాలకృష్ణా రెడ్డి, రాష్ట్ర సాంకేతిక, 

వృత్తివిద్య కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

Updated Date - 2021-06-20T09:13:01+05:30 IST