రైతుపై ‘కూలీ’ భారం

ABN , First Publish Date - 2020-12-05T08:49:45+05:30 IST

పత్తి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. గతంలో వర్షాభావంతో నష్టాలు చూసిన రైతులు ఈసారి అల్పపీడనం, అధిక వర్షాలతో నిండా మునిగారు.

రైతుపై ‘కూలీ’ భారం

పత్తి ఏరేందుకు పనివాళ్ల కొరత..

సిరిసిల్లకు ఆంధ్రా కూలీల వలస..

కిలో పత్తి ఏరితే రూ.12 చెల్లింపు

 వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన అన్నదాత

సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. గతంలో వర్షాభావంతో నష్టాలు చూసిన రైతులు ఈసారి అల్పపీడనం, అధిక వర్షాలతో నిండా మునిగారు. దీనికి తోడు పత్తి ఏరడానికి కూలీల కొరత ఏర్పడడం వారిపై మరింత భారాన్ని పెంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియంత్రిత సాగులో భాగంగా రైతులు పత్తి వైపు మొగ్గు చూపారు.


జిల్లాలో 98,695 ఎకరాల్లో తెల్ల బంగారం సాగు చేశారు. అధిక వర్షాలతో 819 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వర్షాలతో పంట చేతికి వచ్చే దశలో తెగుళ్లు, దూది రంగు మారి నాణ్యత కోల్పోయింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాత ఆందోళన చెందుతుండగా, పత్తి ఏరేందుకు కూలీల కొరత మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించడంతో భారం పెరుగుతోంది. 


ఆంఽధ్రా నుంచి వస్తున్న కూలీలు 

జిల్లాలో పత్తి ఏరడానికి కూలీలు దొరక్కపోవడంతో ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా వ్యవసాయ కూలీలు వలస వచ్చారు. కర్నూలు జిల్లా కందనాల, జగ్గాపూర్‌, మాటగుండం, కోటికల్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 400 మంది జిల్లాలోని వివిధ గ్రామాల్లో పత్తిని సేకరిస్తున్నారు. కర్నూలు నుంచి గ్రామాలకు రావడానికి ప్రయాణ చార్జీలను రైతులు భరించారు. వెళ్లేటప్పుడు కూలీలు ఖర్చులు పెట్టుకోవాలి. వీరికి రైతులు గ్రామ శివారులోని పశువుల కొట్టాల్లో బస ఏర్పాటు చేశారు.


ప్రతి రోజు ఉదయం 6 గంట ల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేనులో పత్తి ఏరుతారు. కిలో పత్తికి రూ.12 ఇస్తారని, రోజూ 40 కిలోల పత్తి ఏరుతామని కూలీలు పేర్కొంటున్నారు. సంక్రాంతి వరకు ఇక్కడే ఉండి పనులు చేస్తామని, ఖర్చులు పోను రూ.20వేల వరకు మిగులుతాయని తెలిపారు. బసకు వసతులు లేకపోయినా ఉపాధి కోసం ఉంటున్నామని చెప్పారు.




ఊరిలో ఉపాధిలేక వచ్చాం

ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో బతుకుదెరువు కోసం ఇంత దూరం పనికి వచ్చాం. మూడు నెలలు పత్తి ఏరిన తర్వాత ఇంటికి పోతాం. కరోనాతో కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు పత్తి చేనులోనే ఉంటాం.

- పవన్‌, వలసకూలీ, కర్నూలు జిల్లా




కొట్టాల్లో సర్దుకుపోతున్నాం

వ్యవసాయ బావుల వద్ద ఉండే పశువుల కొట్టాల్లో ఉంటున్నాం. ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతున్నాం. నాలుగు సంవత్సరాలుగా పత్తి ఏరడానికి వస్తున్నాం. ప్రభుత్వం ఉన్న ఊరిలో పనులు కల్పిస్తే ఇంతదూరం వచ్చేవాళ్లం కాదు.

          - నరసమ్మ, వలస కూలీ కర్నూలు జిల్లా


Updated Date - 2020-12-05T08:49:45+05:30 IST