కోడిగుడ్ల కాంట్రాక్టు పెద్దోళ్లకే!

ABN , First Publish Date - 2022-06-24T08:30:23+05:30 IST

పాఠశాలల పిల్లలకు ఇచ్చే కోడిగుడ్డు కాంట్రాక్టులు పెద్దోళ్లకు ఇచ్చేలా నియమ, నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. చిన్న, మధ్యతరగతి పౌల్ర్టీ యజమానులకు అవకాశం

కోడిగుడ్ల కాంట్రాక్టు పెద్దోళ్లకే!

చిన్న, మధ్యతరహా పౌల్ర్టీ రైతులకు దెబ్బ

మొదట అనుకూలంగా నిబంధనలు 

తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మార్పు

లీజుదారులకూ అవకాశం దక్కేలా నిబంధనలు

మూడేళ్లుగా అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌ ఉండాలి

రైతులకు చాన్స్‌ లేకుండా చేసేందుకేనని ఆరోపణలు 

స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాకు టెండర్లు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాఠశాలల పిల్లలకు ఇచ్చే కోడిగుడ్డు కాంట్రాక్టులు పెద్దోళ్లకు ఇచ్చేలా నియమ, నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. చిన్న, మధ్యతరగతి పౌల్ర్టీ యజమానులకు అవకాశం రాకుండా పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి. 2022-23లో ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా కొత్త జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేక టెండర్‌ ఐడీ ఇస్తూ ఈ నెల 8న టెండర్లు పిలిచారు. ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ నోటీసుల్లోని నిబంధనల మేరకు పౌల్ర్టీ రైతులు మాత్రమే పాల్గొనాలని, వార్షిక టర్నోవర్‌ నిబంధనల మేరకు తక్కువగా ఉంటే నలుగురు పౌల్ర్టీ రైతులు కలిసి ఉమ్మడిగా దాఖలు చే యవచ్చని పేర్కొన్నారు. నిబంధన 2.2.3 ప్రకారం సరఫరాదారులు, డీలర్లు, వ్యాపారులు, బ్రోకర్లు, లీజ్‌ రైతులు టెండర్‌ దాఖలుకు అనర్హులు. అయితే ఈ క్లాజును తర్వాత మార్పు చేసేశారనే ఆరోపణలు వస్తున్నాయి. లీజ్‌ పౌల్ర్టీ రైతులు కూడా టెండర్‌లో పాల్గొనేందుకు అర్హులేనని నిబంధనలు సవరించారు. ఈ మేరకు ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ నోటీ్‌సను ఈ నెల 12న ఈ పోర్టల్‌లో పెట్టారు. అయితే 12వ తేదీన పోర్టల్‌లో పెట్టినా తేదీని మాత్రం ఈ నెల 8గా వేశారని అంటున్నారు.


లీజు పౌల్ర్టీదారులను టెండర్లకు అర్హులుగా చేయడమంటే ఆ ముసుగులో కార్పొరేట్‌ ఎగ్‌ ట్రేడర్లు వచ్చి టెండర్లు దక్కించుకునేందుకు అవకాశం ఇచ్చినట్టేనన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఈ నిబంధన మార్చినప్పుడు పత్రికా ప్రకటన ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌ను టెండర్‌దారులు కలిగి ఉండాలని, అది కూడా టెండరు దాఖలు సమయంలోనే వేయాలన్న నిబంధన పెట్టారు. అంతేగాక గత మూడేళ్లుగా అగ్‌మార్క్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధన పెట్టడంతో చిన్న, మధ్యతరగతి పౌల్ర్టీ రైతులు టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం లేకుండా చేశారనే  విమర్శలున్నాయి. దీంతో పౌల్ర్టీ ఉత్పత్తి చేస్తున్న రైతులకు అవకాశాలు లేకుండా పోతాయని అంటున్నారు. గత ఏడాది కోడిగుడ్ల టెండర్ల విషయంలో ఇదే తరహా నిబంధన పెట్టారు. అప్పుడు కూడా మొదట్లో పెట్టకుండా ఆ తర్వాత పెట్టారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. తాజా కోడిగుడ్ల టెండర్ల విషయంలో గత మూడేళ్ల నుంచి పౌల్ర్టీ నిర్వహిస్తున్నారనే సర్టిఫికెట్‌ ఇస్తేనే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులు. కోడి పిల్లలు కొనుగోలు చేసిన బిల్లులు కూడా ఉండాలన్న నిబంధన  పెట్టారంటున్నారు. ఒకవేళ లీజుదారులైతే మూడేళ్ల నుంచి రిజిస్టర్డ్‌ లీజు డీడ్‌ చేసుకుని ఉండాలన్న నిబంధన పెడితేనే చిన్న, మధ్యతరగతి పౌల్ర్టీ ఉత్పత్తి, లీజుదారులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. 


ఇతర రాష్ట్రాల వారికి చిక్కీ కాంట్రాక్టులు  

మరోవైపు చిక్కీల కాంట్రాక్టుకు సంబంధించి గత ఏడాది తెలంగాణ, గుజరాత్‌ ఇతర రాష్ట్రాల వారికి టెండర్లు దక్కేలా నియమ, నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అనేక చిన్న, మధ్య తరహా చిక్కీల తయారీ పరిశ్రమలున్నా.. ఇతర రాష్ట్రాల సంస్థల పేరుతో స్థానిక కార్పొరేట్‌ ట్రేడర్లు టెండర్లు దక్కించుకున్నారు. చేయాల్సినంత మేరకు సరఫరా చేయకుండా ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు జిల్లాలు ఒక యూనిట్‌గా పేర్కొంటూ  అత్యధిక వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండాలన్న నిబంధనలతో పాటు చిన్న, మధ్యతరహా చిక్కీల తయారీదారులకు అవకాశం లేనివిధంగా నిబంధనలను రూపొందించారనే విమర్శలు గతంలో వచ్చాయి. ఈసారైనా టెండర్ల విషయంలో ప్రభుత్వం స్పందించి సక్రమంగా  జరిగేలా చేయాలని అంటున్నారు. 

Updated Date - 2022-06-24T08:30:23+05:30 IST