Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధిక్కార స్వరం ఈశ్వరీ బాయి

కులసంకెళ్లు తెంచడానికి రాజ్యాంగమనే ఆయుధాన్ని అందించిన ఆధునిక భారత పితామహుడు బాబాసాహెబ్ అంబేడ్కర్. అనునిత్యం ఆ మహనీయుని అడుగు జాడల్లో నడుస్తూ, తుదిశ్వాస విడిచే వరకు అణగారిన ప్రజల అభ్యున్నతే ఊపిరిగా సాగిపోయిన సాహసమూర్తి, ఉక్కు మహిళ జెట్టి ఈశ్వరీబాయి.


సికింద్రాబాద్ చిలకలగూడలో 1918 డిసెంబర్ 1న మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయి జన్మించారు. చిన్నతనం నుంచే స్వాభిమానం, దైర్యసాహసాలు కలిగిన వ్యక్తి ఈశ్వరీబాయి. ఆమెకు పదమూడవ ఏట పూనే వాసి జెట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఒక కుమార్తె (మాజీ మంత్రి శ్రీమతి గీతారెడ్డి) జన్మించిన కొన్నాళ్లకే తర్వాత భర్తను కోల్పోయింది. అయినా ఈశ్వరీబాయి ఆమె ధైర్యం కోల్పోలేదు. అక్కడితో తన జీవితం ముగిసిందని ఒక సాధారణ స్త్రీ లాగా ఆలోచించలేదు. తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడే స్వతంత్ర మహిళగా ఎదగాలని సంకల్పించుకున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠీ వంటి బాషల్లో ప్రావీణ్యం ఉండడం వల్ల ట్యూషన్లు కూడా చెప్పేవారు. అదే సమయంలో తెలుగు నేలపై దళితోద్యమానికి పునాదులు వేసి, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో హైదరాబాద్‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించిన దళితోద్యమ ధ్రువతార మాదరి భాగ్యరెడ్డి వర్మ, హైదరాబాద్ అంబేడ్కర్‌గా కీర్తించబడిన బి.ఎస్.వెంకట్రావు, అరిగే రామస్వామి, జే.హెచ్.సుబ్బయ్య, బత్తుల శ్యాం సుందర్ లాంటి వారు ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ ద్వారా చేస్తున్న దళితోద్ధారక కృషిలో ఆమె భాగస్వామి అయ్యారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ అంబేడ్కర్ నిర్వహిస్తున్న ఉద్యమాలను గమనిస్తూ, ఆయన సిద్ధాంతాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని ఆచరణలోకి తీసుకెళ్లారు. ‘నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అన్న అంబేడ్కర్ మాటల స్ఫూర్తితో జీవితాంతం జనంతో మమేకమై, జనం కోసం పరితపించి, జనాన్ని జాగృతం చేసి జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నిఖార్సైన అంబేడ్కర్‌వాది ఈశ్వరీ బాయి. మహిళాభివృద్ధే దేశాభివృద్ధికి కొలమానం అన్న అంబేడ్కర్ మాటల సాక్షిగా మహిళా సాధికారత -స్వయం ప్రతిపత్తి కోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘాల ద్వారా వారి అభ్యున్నతి కోసం బస్తీల్లో వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించి వారికి కుట్టు పని, ఎంబ్రాయిడరీ పని నేర్పించారు. బస్తీల్లో ఆడవారిని కూడగట్టి అనారోగ్యానికి, పేదరికానికి కారణమైన మద్యపానంపై, తరతరాలుగా ఈ సమాజంలో పేరుకుపోయిన వివక్ష, సాంఘిక దురాచారాలు, అసమానతలపై అలుపెరుగని పోరాటం చేశారు.


చాలామంది దళిత ఉద్యమకారుల వలె కేవలం సామాజిక ఉద్యమాలకే పరిమితం కాకుండా అంబేడ్కర్ చెప్పిన ‘Political Power is the Master Key by which you can open all the doors of progress of social, economic and cultural aspects’ నినాదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దళితులు స్వీయగౌరవంతో జీవించాలంటే, వేల ఏళ్లుగా నిరాకరించబడిన హక్కుల్ని సాధించాలంటే, సామాజిక–ఆర్థిక–సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం ద్వారానే సాధ్యమని భావించిన ఈశ్వరీ బాయి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1952లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అగ్రవర్ణ దురహంకార సమాజం, ఒక దళిత మహిళ కార్పొరేటర్ అయితే తట్టుకోగలదా? ముమ్మాటికీ తట్టుకోదు. అందుకే కార్పొరేటర్ అయ్యాక ఈశ్వరీబాయిపై హత్యాప్రయత్నాలు అనేకం జరిగాయి. అయినా అంబేడ్కర్ సిద్ధాంతం కోసం అసువులు బాసినా పర్వాలేదు కానీ అడుగు వెనక్కి వేసేది లేదు అని ధైర్యంగా ముందుకు సాగిన వీరవనిత ఈశ్వరీ బాయి. ఆమె తన రక్షణ కోసం కారులో ఒక కర్ర, కారంపొడి, రాళ్ళు పెట్టుకుని రాత్రిళ్ళు కూడా బస్తీల్లో తిరుగుతూ రౌడీ ముఠాల అరాచకాలను అడ్డుకునేవారు. క్రమక్రమంగా ఆమె తన రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ 1962లో అంబేడ్కర్ ఆశయాల ప్రతిరూపమైన ఆర్‌పిఐ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)లో చేరారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.ఎన్.సదాలక్ష్మిపై, రెండోసారి 1972లో నంది ఎల్లయ్యపై గెలుపొందారు. తను ఎమ్మెల్యేగా ఉన్నపుడు 1969లో నీళ్ళు–నిధులు–నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆమె అలుపెరగకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి వైస్–ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలయినపుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన నిజమైన తెలంగాణ తల్లి ఈశ్వరీ బాయి.ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీస్ లాఠీ దెబ్బలతో, తుపాకీ తూటాలతో అతి క్రూరంగా అణిచివేయడం అప్రజాస్వామికమని ఆంధ్ర పాలకులపై అసెంబ్లీ వేదికగా ఆమె నిప్పులు చెరిగారు.


కృష్ణా జిల్లా కంచికచర్లలో దళిత పాలేరు కోటేసును కొంతమంది పెత్తందార్లు సజీవదహనం చేసిన సమయంలో ఆమె అసెంబ్లీలో స్పందించిన తీరు అనిర్వచనీయం. ఈ సంఘటనపై అసెంబ్లీలో ఆమె పట్టుబట్టి మరీ చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి చర్చ మధ్యలో కలుగజేసుకుని ‘దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారా?’ అని అనగానే ‘ఎవడురా ఆ కూత కూసినవాడు, దళితులు మీకు దొంగల్లా కనిపిస్తున్నార్రా! సాటి మనిషిని సజీవ దహనం చేస్తారా? దళితులను దొంగలు అంటే చెప్పుతో కొడతా’ అని ఆయన మీదకి చెప్పు విసిరి తగిన సమాధానం చెప్పిన తీరు చరిత్రాత్మకమైనది. ఒక నిజమైన అంబేడ్కర్ వారసుడు, వారసురాలు చట్టసభల్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క ఘటనతో అర్థం చేసుకోవచ్చు. నేడు దేశం, రాష్ట్రం నలుమూలల ప్రతి క్షణం దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, అంబేడ్కర్ కల్పించిన అవకాశాల ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ ఒక్క రోజు కూడా చర్చించే సాహసం చేయడం లేదు. కానీ ఆమె ఒక్కరే అసెంబ్లీ మొత్తాన్ని గడగడలాడించిన తీరు నేటి దళిత ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కావాలి. ఎమ్మెల్యేగా ఈశ్వరీబాయి అనునిత్యం అణగారిన ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు. ప్రాంతీయ బేధం లేకుండా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏ మూలన అన్యాయం జరిగినా అక్కడ బాధితుల పక్షాన ఆమె నిలువెత్తు ధైర్యమై నిలబడ్డారు. మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ కామారెడ్డి పెద్ద చెరువును వారికి దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకునే వరకు పోరాడి మత్స్యకారులకు చెరువు ఇప్పించారు. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై, వ్యవసాయ రైతుల సమస్యలపై, బంజరు భూముల పంపిణీపై, చేనేత కార్మికుల సమస్యలపై, విద్య–వైద్యం–ఆరోగ్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పన, జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీల సమస్యలపై, టీచర్స్, ఉద్యోగుల సమస్యలపై, వృద్ధాప్య పింఛన్ల పెంపు కోసం చర్చించడానికి అసెంబ్లీని ఆమె చక్కగా ఉపయోగించుకున్నారు.


నిర్విరామంగా, అలుపెరగకుండా అనేక సమస్యలపై పోరాటం చేసిన ఈశ్వరీబాయి ఆరోగ్యం క్షీణించి 1991 ఫిబ్రవరి 24న అంతిమశ్వాస విడిచారు. ఆమె మహాపరినిర్వాణంతో తెలుగు నేలపై అణగారిన ప్రజల హక్కుల కోసం అనునిత్యం నినదించిన ధిక్కారస్వరం మూగబోయింది. నేటి యువతలో, సామాజిక ఉద్యమకారుల్లో, రాజకీయ నాయకుల్లో, ప్రజా ప్రతినిధుల్లో, ఉద్యోగుల్లో నిరంతరం స్ఫూర్తిని నింపే నిప్పుకణం ఈశ్వరీబాయి. డాక్టర్ అంబేడ్కర్ సంకల్పించిన స్వేచ్ఛ–సమానత్వం–సౌభ్రాతృత్వం పరిఢవిల్లే సమసమాజ స్థాపనే ఆమెకు నిజమైన నివాళి.

మంచాల లింగస్వామి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్

(నేడు ఈశ్వరీబాయి జయంతి)

Advertisement
Advertisement