ఆదిజాంబవుని ధిక్కార దుఃఖం

ABN , First Publish Date - 2020-07-20T06:19:54+05:30 IST

ఇప్పుడు ప్రపంచమంతా మరుభూమి అదృశ్యమైపోయిన.. mass grave yards మధ్యన, వొంటికాలితో నిలబడి, మృత్యువుతో దీర్ఘ సంభాషణలో మునిగిపోయి వుంది!...

ఆదిజాంబవుని ధిక్కార దుఃఖం

దుఃఖంలో పాడటం కాదు. దుఃఖమే పాడుతుందీ చరణాల్లో. వలస జీవి తనను తానే దుఃఖ పటానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఇందులో ఏ రకమైన performance వుండదు. దుఃఖంలోని సత్యాగ్రహం వుంటుంది. దుఃఖంలోని జగల్లీల వుంటుంది. దాని ముందూ అందరం నేరస్థులమై సాగిలపడి, కాష్ఠమెక్కి బూడిద రాసులపై వొరిగి పోవాల్సిందే... 


ఆదేశ్‌ రవి కవిత్వ గానం

ఇప్పుడిక ఈ కవిగాయకుడికి శోకమే, మానవ దుఃఖమే జెండా. మానవుడ్ని ఈ మరణ బీభత్స తొక్కిసలాటలో మళ్ళీ కనుక్కోవడమే తన లక్ష్యమూ లక్షణమూ కూడ. భాషను పట్టు జారనీయకుండా, తనలోని social fabric జ్చఛటజీఛిని ఆవిష్కరించడానికి, దాని నిగూఢపు, నిమ్న వర్గాల, మూలాల అంచుల్ని తెరముందు తేవడానికి నడుం బిగించాడు ఆదేశ్‌, తన కవిగుణగానంతో.


ఇప్పుడు ప్రపంచమంతా మరుభూమి అదృశ్యమైపోయిన.. mass grave yards మధ్యన, వొంటికాలితో నిలబడి, మృత్యువుతో దీర్ఘ సంభాషణలో మునిగిపోయి వుంది! ఇది ఎప్పుడు తెగుతుందో ఏమో? తెర ఎపుడు జారుతుందో ఏమో? అమానవీయ అస్తిత్వ విధ్వంస ప్రవాహం నిర్మాను ష్యంగా రోడ్లమీద. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యానంతర.. పాలనా కుట్రలకు బలిగా వెలిగా.. బయల్పడిన.. మహాదుఃఖ ప్రయాణం. మానవ పాద పదాల ప్రవాహం... ప్రవాహం.. వలస మహాజన ప్రవాహం. దీనిని తెరతీసి ఆవిష్కరిం చిన వొక వాచక గానం. వొక Author song, పాట, మనిషి దుఃఖ కేంద్రంగా, వొక cyclone eyeగా ప్రవేశించిన కాలం ఇది... 


‘‘పిల్ల జెల్లా ఇంటి కాడ ఎట్ల వుండ్రో

నా ముసలి తల్లీ ఏమి వెట్టి సాదుతుందో

పూట పూట జేసుకోని బతికేటోళ్ళం

పూట గడువా ఇంత దూరం వచ్చినోళ్ళం’’... అంటూ, గళమే వొక ఎత్తుగడగా..., పౌర సమాజాన్నీ, రాజకీయ పాలక ప్రతిపక్ష సమాజాన్నీ, మన చుట్టూ మన లోపల వేళ్ళూనుకొనిపోయిన గ్రామీణ నగర సమూహాల సమాజాలనీ..., ఆలోచించుకొని, విమర్శ చేసుకునే లోపలే..., వొక ‘‘బర్మా’’ పెట్టి... మహాదుఃఖార్ణవంతో పేల్చి పారేసింది. ఇప్పటి చర్చంతా.. మన ముచ్చట అంతా..aftermath తాలూకు నివేదన.. అంతే. ఈ పాటలో దుఃఖం- భారత దేశమంతా వలసపోతూ.., భూమి పొరల్లోపల అంతర్వాణినిగా అలుముకుపోతున్న దుఃఖం- నేల నాలుగు చెరలా కమ్ముకొని చిమ్ముకునే భూగర్భజలం లాగ దేశపు పొరల్లోకి, భాషలకూ, ప్రాంతాలకూ అతీతంగా... horizontalగా, కనబడకుండా విస్తరించివున్న దుఃఖం- వొక కవి పాటగా వలసజీవుల existential angst గా anthemగా తెరమీదికి దూసుకు వచ్చింది, ఆదేశ్‌ రవి తను రాసి గొంతునిచ్చాడు. తన స్మార్‌ఫోన్‌నే రికార్డింగ్‌ థియేటర్‌గా మలుచుకొని, నిశ్శబ్దాన్ని interludesతో మిక్స్‌ చేసి, ఆదేశ్‌ రవి పాటకు చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే పాట చుట్టూతా వుండే స్వరలయని నిశ్శబ్దానికి కుదించడం. లయని ‘అతివిలంబిత్‌’ గతి వరకు తీసుకుపోయి.. సుశబ్ద పరచడం (John Cage's silent music works వీలయితే వింటూ వీక్షించగలరు). నిశ్శబ్దం- మహా మహా మానవ విహ్వల దుఃఖాన్ని, అమానవీయ విధ్వంసాలను, దౌర్జన్యాలను, తదుపరి అనివార్వ విప్లవాల్ని సంకేతపరిచే చిట్టచివరి ఆయుధం. ఇది బలమైన కళాకారుడి ఆఖరి పనిముట్టు... దీనితో అతనుacceleration of abstractionని వ్యూహాత్మకంగా తనart formలోకి ప్రవేశపెడ్తాడు. పాలకులను నివ్వెర పరచి గాయపరిచి దుఃఖానికి గురిచేసి స్థానభ్రంశం చేస్తాడు. పాటలో... ప్రస్తారమయ్యే భాష విషయం సరే. దానికంటే ముందు దుఃఖాన్ని పాటకు ముందే పాఠకుడి/ ప్రేక్షకుడి సానుకూలతకోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది, ఇలా: ‘‘దేశమేమో గొప్పదాయే/ మా బతుకులేమో సిన్నవాయే/ మాయదారి రోగమొచ్చి/ మా బతుకు మీద మన్నువోసే/ ఏమి బతుకూ ఏమి బతుకూ/ చెడ్డ బతుకూ.. చెడ్డ బతుకూ/ చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ/ చెడ్డ బతుకూ చెడ్డ బతుకూ...’’ అని seven scale variationsతో...  intonationsతో ఆరోహ అవరోహణగా జారిపోతుంది.. గొంతు. అదే ఈ పాట విశిష్టతంతా... లయను tonedown చెయ్యడమే కాకుండా ఆ నిర్లయను దుఃఖంలో ముంచడం వల్ల బాధితుడే first person అయ్యాడు. అందుకే గుండె గొంతుకలో తెగిపడే వైనం గురించి చెప్పాలనిపి స్తుంది. ఈ వ్యూహం సాధించినదేమిటి? మన పాలకుల మీదికి..., వారి రక్త పిపాస మీదికి, అసంఘటితంగా వున్న controlled aggression అన్ని వైపుల నుండి దాడి చేసింది. అందుకే ఇప్పుడు పార్టీలు తమ మేనిఫెస్టోలను సరిదిద్దుకుంటున్నాయి. తప్పని సరిగా... అనివార్యంగా. ఇదెందుకు జరిగింది. ఆదేశ్‌ రవి సమస్త అణచబడిన జాతుల   synthesisని ఈ పాటలో పొందుపరిచాడు. మునుపటి పాటల్లోని creative blocks విచ్ఛేదం చేస్తూ. పాలకుల కుల వర్గాల కార్పొరేట్‌ అభివృద్ధి తంత్రాల వ్యూహాలను పేల్చి బూడిద చేయాలంటే.., స్థానిక, అస్థానిక, దురభిప్రాయాలనూ, అర్థాలనూ కూల్చాలంటే.. మన art formsని ఇలా పదును పరచడం తప్పనిసరి. భారతీయ సమాజంలో నెగడులాగ కుములుతూన్న అణచబడిన కుల వర్గాల సాంస్కృతిక దుఃఖమే ఈ పాట. ఇది counterculture తాలూకు curtain-raiser... back-ground score. ఇటువంటి కళారూపాలలో వొక neutron starలోని core energyలాగ..., సారమంతా.. స్థానిక, స్వస్థానిక, వలస స్థానిక, సంచార స్థానిక.. అనుభవ విధ్వంసమే వుంటుంది. ఇటువంటి కవిత్వ పాటల్లో, ఎనర్జీ అంతా implode అయ్యి వొదిగి మాటువేసి కూర్చుంటుంది. వొకానొక అకాల సందర్భాన explode అయినపుడుగాని మనకు అవగతంలోకి రాదు. మనం ఊహించని మహోపద్రవాలు కమ్ముకున్నప్పుడు.. అనుకోకుండా మరొక వైపు నుంచి మన జీవితాన్ని పట్టి ఊపే, నిలువునా కోసే.., నిలదీసే రచన లేదా ఏదో వొక art form హఠాత్తుగా మనల్ని ఢీకొంటుంది. మనం accidentకు గురవుతాం. ఇక దాని నుంచి మనం కోలుకుంటే.. కోలుకోగలుగుతాం లేదా చనిపోతాం. End results రెండూ కూడా మన మంచికే జరుగుతాయి. ఎందుకంటే ఆ స్థితి లోంచి.. అసలయిన అచ్చమయిన ‘మనిషి’, మానవీయ మైన మనిషి పుడతాడు. అన్ని దిక్కుల్నీ ఆక్రమిస్తాడు.


చిన చిన్నటి తక్కువ పదాలతో.. వొక జాతి దుఃఖాన్ని పాటలోకి వంపడం అంత తేలిక కాదు. పదాల నియతి తగ్గుతూ పోతున్నప్పుడే గాఢత పెరుగుతుందనుకోవాలి. కృష్ణశాస్త్రి వంటి మహాకవులకే అది సాధ్యపడింది. అటువంటి రూపసారాల confluenceని ఆదేశ్‌ తన పాటల్లో పట్టుకు వచ్చాడు. ఇంతకు మునుపటి గద్దరన్న గోరటెంకన్న దారిలోంచి అతివేగంగా పెనుదుఃఖమోలె దూసుకువచ్చాడు. అసలు ఎప్పటికైనా భాష కవికి ప్రథమ శత్రువు అనుకోవల్సి వస్తుంది. భాషా లౌల్యత చాలామంది కవి గాయకుల్ని నిర్వీర్యులను చేసిన సందర్భాలున్నాయి మనకు. కవిత్వంలోని లేదా పాటలోని సంజ్ఞలూ, సంకేతాలూ, కదలికలూ, ఇమేజెస్‌ బరువు పెరిగే కొద్దీ కంటెంట్‌ పలచబడిపోతుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆ ఆల్కెమీ కవికి పనికి వస్తుంటుంది. దానికి భిన్నంగా చాలా సాధారణమయిన జీవభాషను గనుక కవిగాయకుడు ఎన్నుకుంటే.., అందులోకి poetic texture, poetic matrix తాలూకు సాంద్ర విన్యాసం వచ్చి కూర్చుంటుంది. అది సూటిగా తగిలి గుండెలో పేలుతుంది. అందుకే జీవ భాష ఇప్పటి కవిత్వానికి అనివార్యమయిన అనుకూల సాధనం అనుకోక తప్పదు. కేవల పదాలుగా మిగిలిపోయే మాటలు కాగితాల మీదికీ, permance canvas మీదికీ చేరినప్పుడు.. పదాల నడుమ కవి గాయకుడు లక్షల దుఃఖపు నిట్టూర్పుల్ని ఇమిడ్చి కంపోజ్‌ చేసుకుంటే కవి ప్రస్ఫుటమవుతాడు. అందుకే ఆదేశ్‌ రవిది author song అనవల్సి వస్తూంది. ఇటువంటి పాటలకు చాలా తీవ్రమైన యాతన, శోధన తెర వెనుక అవసరం అవుతుంది. ఆదేశ్‌ కూడా అంతే హోమ్‌ వర్క్‌ చేస్తాడు, తను తీసుకువస్తున్న పాటల్లో.


వొకసారి ఆ పాటలోని చివరి చరణంలోకి వెళ్తే: ‘‘పేదరోగం కంటే పెద్ద రోగముందా?/ అయినవాళ్ళకంటే పెద్ద అండ వుందా?/ కష్టకాలం ఇంటికాడ వుంటే సారూ/ కలిసి మెలిసి కలో గంజో తాగేటోళ్ళం/ పిల్లగాండ్లూ కన్నులల్లా మెదలవట్టే/ ఇంటిదాని దుఃఖ మేమో ఆగకుండా తరుమవట్టే/ ఏమి జేతూ.. ఏమి జేతూ.. ఏమి జేతూ/ ఏమి జేతూ.. ఏమి జేతూ ఏమి జేతూ ఏమి జేతూ.../ బస్సు వద్దూ బండ్లు వద్దూ అయ్యసారూ/ ఇడిసి పెడితే నడిసి నేను పోత సారూ’’... దుఃఖంలో పాడటం కాదు. దుఃఖమే పాడుతుందీ చరణాల్లో. వలస జీవి తనను తానే దుఃఖ పటానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఇందులో ఏరకమైన performance వుండదు. దుఃఖంలోని సత్యాగ్రహం వుంటుంది. దుఃఖంలోని జగల్లీల వుంటుంది. దాని ముందూ అందరం నేరస్థులమై సాగిల పడి, కాష్ఠమెక్కి బూడిద రాసులపై వొరిగి పోవాల్సిందే... మొత్తం పాటలోని మొదటి పంక్తినుంచీ ఆలాపనలోని నిగూఢ లయలాగ.. అది బయల్పడదు. అంతర్గతిగా మన గుండె లయలోకి ఇంకిపో తుంది.  Formలో వొక స్త్రీ ప్రధానమైన, అందులోనూ మన గ్రామీణ నిమ్న వర్గంలో వుండేటటువంటి స్త్రీ రోదన... నగ్నంగా రోడ్ల మీద రంగమెక్కి శోకిస్తూ వుంటుంది. దుఃఖం బరువై ఓపలేక శిగమై అల్లల్లాడి పోతూ.. మనల్ని కన్నీటి మంటై అంటుకుంటుంది. ఇక్కడ కవీ, పాటగాడూ, ప్రేక్షకుడూ సార రూపాలతో.. ఒక్కటైపోయి బయలెల్లి వస్తారు. దీని డిక్షన్‌ అంతా బస్తీల, మొహల్లాల, బాడల, వాడల కనికట్టు విభ్రమ బతుకు భాష. 


ఆదేశ్‌ రవి రాసిన మరో పాట... ‘‘సంపుడు పందెం’’. ఇంకొక దృగ్వేదనతో, ఆరోపణతో, అదే దుఃఖపు నెనరుతో... తనలోని హైదరాబాదీయతను నీరూ నిప్పును ద్రవీభూతం చేసుకొని సికింద్రాబాద్‌ ఎల్లమ్మ తల్లి వొడిలోని దుఃఖంగా జారిపోతూ వచ్చిన పాట. ఈ పాట తన వలస పాటకు పూర్తిగా juxtaposing spaceలో నిలబడి.. హైదరాబాద్‌ abandonmentకి లోలోపల గుండెలు బాదుకుంటూ, సెటిలర్స్‌ తాలూకు అవకాశవాదాన్ని, పండుటాకులాంటి తల్లికి కరోనా వస్తే నడిరోడ్డు మీద అనాథగా వదిలేసే కొడుకుల వంటి సెటిలర్స్‌ తాలూకు అమానవీయతను నిలువుగా దుఃఖారోపణలతో చీల్చే పాట. ఎప్పుడూ వేలమంది హైదరాబాద్‌ జనబంధువుల మధ్య సేద తీరే బోనాలు ఎండుగా బోసిపోయి వొంటరిగా రంగమెక్కడం ఎంత శోకాన్ని కలిగిస్తుందో ఈ పాట మంద్ర లయలో చెబ్తుంది. వొక్కసారి పాటలోకి మెట్లు దిగుతూ వెళ్తే- ‘‘బతుకూ.. బతుకు.. బతుకైదరబాదు/ ఎవళున్నా లేకున్నా బతుకైదర బాదు/ నిన్నిడిసీ పోను నేను/ నీతోనే వుంట నేను/ నాకున్న ధైర్యం నువ్వే/ రోగమే గెలిసి/ నీనోడి పోయినా/ నన్ను నీ మట్టిల బొందవెట్టుకుంటా/ నన్ను నీ మట్టిల బొందవెట్టుకుంటా’’. - ఈ పదాలలో అదే జీవద్భాషలో మునిగి శుభ్రపడిన native idiom దుఃఖమై మన ముందుకు వొరిగి పడుతుంది. కలకీ నిష్ఠుర వాస్తవానికీ మధ్య నెలకొని వున్న intoxicationన్ని.. దుఃఖంతో, పాశిన రక్త సంబంధాల నెనరుతో పలికించే ప్రయత్నం కనబడుతుంది. హైదరాబాద్‌ దఖ్కనీయత, మన స్థానికత.. అందర్నీ అమ్మలాగా వొడిలోకి ఒడిశి పట్టుకుని కాపాడిన స్థానికత. మమకారం- తన గుణం. ఓపుకోలేని అనంతమైన తల్లితనంలోని విశ్వాసం హైదరాబాద్‌ భాష. అదే భాషలోని ecstasy ఈ పాటలో మంద్రంగా సందడి చేస్తూ కనబడుతుంది. ఇప్పుడు రవి హైద్రాబాద్‌ నగరంలో గర్భస్థమై వున్న గ్రామీణత లోంచి తల్లడిల్లుతున్నాడు. 


పదాలలో సంక్షిప్తత, గాఢత.. తన ప్రత్యేకత. మళ్ళీ ఈ పాటకొక ఏ pre-agenda లేదు. శూన్యమైపోతున్న నగర వీధుల విలాపముంటుంది. రాత్రంతా పగటీల సందడితో తానమాడే.. ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూన్న నివేదన వుంది. శోక తీవ్రత వుంది. ఇప్పుడిక ఈ కవిగాయకుడికి శోకమే, మానవ దుఃఖమే జెండా. మానవుడ్ని ఈ మరణ బీభత్స తొక్కిసలాటలో మళ్ళీ కనుక్కోవడమే తన లక్ష్యమూ లక్షణమూ కూడ. భాషను పట్టుజారనీయకుండా, తనలోని social fabricని ఆవిష్కరించడానికి, దాని నిగూఢపు, నిమ్న వర్గాల, మూలాల అంచుల్ని తెరముందు తేవడానికి నడుం బిగించాడు ఆదేశ్‌, తన కవిగుణగానంతో. ఈ మార్గం కష్టతరమైన ప్పటికీ.. సరైన స్థితిని పొందడం కోసం.. ఆత్మత్యాగం.. దుఃఖంతో సత్సంగం.. ఎంతో ముఖ్యమైనప్పటికీ.. తన మూలవాసుల డిఎన్‌ఎ తనలో కాగుతున్నందు వల్ల.., తన పాట అనివార్యంగా తన కమ్యూనిటీస్‌ తాలూకు దిగువ వేదన లోంచే పుడుతుంది. దుఃఖ, జీవ రక్తసిక్తాల జడి సడులే సుడులే తన పద పాద ధార. అందరూ తల్లి గర్భంలోంచి.. తలతో ప్రపంచంలోకి దిగివస్తే.. ఇటువంటి కవి గాయకుడు.. మాత్రం కాళ్ళతో (వలస కాళ్ళతో) అమ్మ గర్భం నుంచి నేలమ్మ మీద పాదం మోపాడు.. పద రహస్యాలను మోసుకుంటూ...

To give life meaning means to make something of it deliverately and threby go against it - Rober Gal (Slovak poet). 

కవి సిద్ధార్థ

73306 21563


Updated Date - 2020-07-20T06:19:54+05:30 IST