నిర్మాణ రంగం కుదేలు

ABN , First Publish Date - 2022-05-03T05:06:26+05:30 IST

నూతన మైనింగ్‌ విధానంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కంకర, ఇసుక, గ్రానైట్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. మెదక్‌ జిల్లావ్యాప్తంగా నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. నిర్మాణ ఖర్చులు 50శాతం పెరగడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.

నిర్మాణ రంగం కుదేలు
క్రషింగ్‌ మిషన్‌

నూతన మైనింగ్‌ విధానంతో నింగినంటిన కంకర ధరలు

20 ఎంఎం కంకర టన్ను రూ.900  

భారీగా ఫీజులు పెంచిన గనుల శాఖ 

ఇప్పటికే పెరిగిన ఇసుక, ఐరన్‌, సిమెంట్‌ ధరలు  

మెదక్‌ జిల్లాలో నిలిచిన నిర్మాణ పనులు 

పెరిగిన ధరలతో గృహ నిర్మాణంపై తీవ్ర ప్రభావం 


మెదక్‌, మే 2: నూతన మైనింగ్‌ విధానంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కంకర, ఇసుక, గ్రానైట్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. మెదక్‌ జిల్లావ్యాప్తంగా నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. నిర్మాణ ఖర్చులు 50శాతం పెరగడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.

 స్లాబులకు వాడే 20 ఎంఎం కంకరను గతంలో టన్ను  రూ.360 చొప్పున విక్రయించేవారు. అయితే ప్రస్తుతం రూ.600 పెరిగింది. ఇక ట్రాన్స్‌పోర్టు కలిపి టన్ను రూ.900 చొప్పున విక్రయిస్తున్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయంగా వాడే స్టోన్‌ డస్ట్‌ ధరలు కూడా పైపైకి ఎగబాకాయి. టన్ను డస్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో కలిపి రూ.800కు విక్రయిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. కాళేశ్వరం, బోధన్‌, బాన్సువాడ క్వారీల నుంచి ఇసుక రవాణా నిలిచిపోవడంతో లోకల్‌లో టన్ను ఇసుక రూ.1500 కు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకకు రూ.6 వేలు చెబుతున్నారు.  కంకర, గ్రానైట్‌ క్వారీలకు గుదిబండలా మారింది. రాష్ట్ర గనుల శాఖ ఫీజులను విపరీతంగా పెంచడంతో జిల్లావ్యాప్తంగా కంకర క్వారీలు మూతపడ్డాయి. గనుల శాఖ ఫీజులు పెంచడంతో కంకర ధరలు పెంచివేసే పరిస్థితి అనివార్యమైందని క్రషర్ల యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం 100 శాతం పైబడి ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ బంద్‌ కొనసాగిస్తున్నారు. ఈ నెల 1 నుంచి కంకర, మట్టి, గ్రానైట్‌ క్వారీలకు అనుమతుల మంజూరుకు ఫీజు లు పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. సీనరేజస్‌ యేటా గనుల శాఖకు క్వారీ యజమానులు చెల్లించే రుసుము (డెడ్‌రెంటల్‌), లీజు పునరుద్ధరణ, నాన్‌ రిఫండబుల్‌ ఫీజులు, బదిలీ ఫీజు ఏడేళ్ల తర్వాత పెంచారు. మెదక్‌ జిల్లాలో 26 కంకర క్వారీల  ద్వారా రోజుకు సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల కంకర విక్రయాలు జరుగుతుంటాయి. ఈ పరిశ్రమపై దాదాపు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరితో పాటు లారీలు, టిప్పర్ల డ్రైవర్లు, క్వారీ ఆపరేటర్లు, జేసీబీల ఆపరేటర్లు, లోడర్లపై సుమారు 3-5 వేల మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 


సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ ధరల మంట..

 ఐదు నెలల క్రితం 12ఎంఎం, 16ఎంఎం స్టీల్‌ టన్నుకు రూ.58,500 ఉండగా ప్రస్తుతం రూ.79వేలు పలుకుతోంది. 10ఎంఎం,  8 ఎంఎం స్టీల్‌ ధర టన్నుకు అప్పుడు రూ.59,300 ఉండగా.. ప్రస్తుతం రూ.80,300 ఉంది. ఐదు నెలల వ్యవధిలోనే స్టీల్‌కు అదనంగా రూ.20వేలు పెరగడం గమనార్హం. ఇక సిమెంటు బస్తా ఒక్కంటికి 5నెలల క్రితం రూ.330 ఉండగా ఇప్పుడు రూ.405కు పెరిగింది. 


 రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెరిగిన నాన్‌రిఫండ బుల్‌ ఫీజు 

కంకర క్వారీలు తొలిచేందుకు ఒక హెక్టార్‌కు రూ.50వేల ఫీజును క్వారీ యజమానులు గనుల శాఖకు డెడ్‌రెంటల్‌ ఫీజు కింద చెల్లించేవారు. ప్రస్తుతం ఇది           రూ.2 లక్షలకు పెంచారు. ఇక వెలికితీసిన ఖనిజానికి మెట్రిక్‌ టన్నుకు రూ.50 రాయల్టీని రూ. 60 పెంచారు. లీజ్‌ దరఖాస్తు గతంలో రూ.1500 ఉండగా దాన్ని రూ.లక్షకు పెంచారు. గ్రానైట్‌ క్వారీ డెడ్‌రెంటల్‌ సంవత్సరానికి రూ.80వేల నుంచి రూ.1.60 లక్షలకు పెంచారు. సీనరేజస్‌ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. ఇంతకు ముందు క్యూబిక్‌ మీటర్‌కు లెక్కన సీనరేజస్‌ చార్జీలను గనుల శాఖకు చెల్లించేవారు. ప్రస్తుతం వాటిని మెట్రిక్‌ టన్ను కింద లెక్క కడుతున్నారు. పెంచిన ధరలతో  గిట్టుబాటు కావడం లేదని వినియోగదారులపై భారం వేయక తప్పడం లేదని స్టోన్‌ క్రషర్స్‌ యజమానులు చెబుతున్నారు. 


ఉపాధి కోల్పోతున్న కూలీలు

నిర్మాణాలకు ఉపయోగించే కంకర, ఇసుక ధరలు విపరీతంగా పెరగడంతో నిర్మాణం రంగం కుదేలైంది. జిల్లాలో నిర్మాణ పనులను గృహ యజమానులు వాయిదా వేస్తున్నారు. బతుకు దెరువు కోసం పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఛత్తీ్‌సఘడ్‌, యూపీ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే మెదక్‌ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిర్మాణ పనులు తగ్గిపోవడంతో ఉపాధి లేక వారు ఖాళీగా ఉంటున్నారు. సొంత ఊర్లకు వెళ్లలేక ఇక్కడ ఖాళీగా ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. 

Read more