కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-05T06:17:00+05:30 IST

అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
కలెక్టరేట్‌ భవన నిర్మాణ సముదాయాన్ని పరిశీలిస్తున్న మంత్రి అల్లోల

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్‌ చైన్‌గేట్‌, అక్టోబరు 4 : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణ సముదాయాన్ని ఆర్‌ అండ్‌ బి శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్‌సీ గణపతిరెడ్డితో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలిం చారు. ప్రాంగణమంతా కలియ తిరుగుతూ.. సుందరీకరణ, గార్డెనింగ్‌, అప్రోచ్‌ రోడ్డు, హెలీప్యాడ్‌ తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదే శించారు. నవంబరు 30లోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. డిసెంబరు నెలలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారం భించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంచిర్యాల రోడ్డు నుంచి వయా రెడ్డి గార్డెన్స్‌, కలెక్టరేట్‌, బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయం, బంగల్‌పేట్‌ చెరువు మీదుగా విశ్వనాథ్‌పేట్‌ వరకు 100 ఫీట్ల రహదారి నిర్మాణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పాత ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు, తెలుగు మాట్లాడే వారందరికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి విజయ దశమి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగను అందరూ అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు. విజయ దశమి అంటే విజయానికి ప్రతీక ఈ పండగ. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతీ ఒక్కరూ అత్యంత ఆనందంతో పండగ జరుపుకోవాలని మంత్రి అభిలాషించారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మల్‌ జిల్లా
నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 4 : జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాలక్ష్మి ఆలయ ప్రాముఖ్యత దశ దిశ ల్లో చాటేందుకు రూ.5 కోట్లు మంజూరు చేసి కృష్ణశిలలతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అడెల్లి ఆలయ పునర్నిర్మాణం చేసేందుకు 10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విజయ దశమి రోజున శంకుస్థాపన ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. పోచమ్మతల్లి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు గౌతమ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఏఎంసీ చైర్మన్‌ చిలుకరమణ, పార్టీ నాయకులు మారుగొండ రాము, ఆలయ చైర్మన్‌ కొడుకుల గంగాధర్‌, కౌన్సిలర్లు నవీన్‌, రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-05T06:17:00+05:30 IST