Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజల్ని ప్రభువులు చేసిన రాజ్యాంగం

మన ప్రజాస్వామ్యం భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించింది కాదు. వలస పాలనపై పోరులో అంకురించినది. కనుక అది నిశ్చిత పరిమితులతో మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్య భావనకు బలమైన పునాదులు పడేందుకు రాజ్యాంగం తోడ్పడింది. భారత్‌ను ఒక జాతిగా రూపొందించే కర్తవ్యాన్నీ, పూర్తిస్థాయి ప్రజాస్వామ్యాన్ని సాధించే బాధ్యతను ప్రజలంతా స్వీకరించినప్పుడు మాత్రమే రాజ్యాంగ ఆదర్శం నెరవేరగలదు.


మనుషుల్ని మనుషులుగా గుర్తించని నాటి భారత సమాజంలో వ్యక్తి విలువ నిలబెట్టేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కృషి చేశారు. వ్యక్తి తాను అనుకున్న ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందడానికి బాటలు వేశారు. మన ప్రజాస్వామ్యం భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించింది కాదు. వలస పాలనపై పోరులో అంకురించినది. కనుక మన ప్రజాస్వామ్య పథం నిశ్చిత పరిమితులతో ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్య భావనకు బలమైన పునాదులు పడేందుకు రాజ్యాంగం తోడ్పడింది. భారతదేశం అనేక అంతరాలు, అసమానతలపై ఆధారపడ్డ సమాజం అని రాజ్యాంగ సభ భావించింది. సమానావకాశాలు కల్పించవలసిన అవసరాన్ని గుర్తించింది. సమాజంలో అట్టడుగున ఉన్నవారి సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందని నిర్దేశించింది.


రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు భారత ప్రజాస్వామ్యానికి నిజమైన పునాదులు వేశాయి. అనాది నుంచి మన సమాజంలో ఉన్నతవర్గాల వారు శ్రామిక శ్రేణులను అన్ని విధాలా దూరంగా ఉంచారు. అంటరానివారిని చేశారు. భారత రాజ్యాంగం అటువంటి వర్గాలను సామాజిక ప్రధాన స్రవంతిలో భాగస్వాములుగా చేసింది. చట్టసభలలోను ప్రభుత్వోద్యోగాలలోనూ ఆ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణలను పొందుపరిచారు. 


భారత రాజ్యాంగ నిర్మాణసభలో సభ్యులను నామినేట్‌ చేసేవారు. నామినేషన్‌కు సభ్యులను ఎంపిక చేసేందుకు ఓటు వేసే హక్కు 1946 ఎన్నికలలో ఎన్నికైన ప్రావిన్స్‌ల లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులకు ఉండేది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు జరుగుతున్న విధంగానే అప్పుడు రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుల ఎన్నిక జరిగేది. రాజ్యాంగ పరిషత్తులో షెడ్యూల్డ్‌ కులాలకు సీట్ల రిజర్వేషన్‌ లేదు. అందువల్ల షెడ్యూల్డ్‌ కులాలకు ప్రాతినిధ్యం ఉంటుందనే పూచీ లేదు. ముస్లింలకూ, సిక్కులకూ మాత్రమే రిజర్వేషన్‌ ఉండేది. అయితే, 1946లో ఎన్నికలు జరిగిన ప్రావిన్సెస్‌లో దళితులకూ, మహిళలకూ, ముస్లింలకూ, సిక్కులకూ, భారతీయ క్రైస్తవులకూ, ఇతరులకూ రిజర్వేషన్‌ ఉంది. ఈ ప్రావిన్స్‌ల శాసనసభలకు ఎన్నికైన సభ్యులే రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులను ఎన్నుకునే క్రమంలో ఓట్లు వేశారు. ఇప్పటి రాజ్యసభలానే ఎవరినైనా రాజ్యాంగ నిర్మాణసభకు నామినేట్‌ చేయాలంటే ఆ వ్యక్తి ఏ శాసన సభలోనూ సభ్యుడు కావలసిన అవసరం లేదు. అలా ఆ స్థానంలో డా.అంబేద్కర్‌ ఎన్నుకోబడ్డారు. ‘రాజ్యాంగ నిర్మాణ కమిటీ’ 1947 ఆగష్టు 29న, అంటే స్వాతంత్ర్యం వచ్చిన 15 రోజులకు, ఏర్పడింది. ఈ కమిటీలో ఏడుగుర సభ్యులున్నారు. ఈ ఏడుగురిలో విద్యార్హత, విదేశీ పర్యటనానుభవం, గ్రంథ రచనానుభవం, ప్రపంచ దేశాల చరిత్ర పఠనం... వంటి అర్హతలు అంబేడ్కర్‌కే ఉండటం వల్ల ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.


అంబేడ్కర్‌ తన రాజకీయ ప్రస్థానం ఆసాంతం సర్వజనులకూ ఓటు హక్కు ఉండాలని వాదించారు. ఇందుకు భిన్నంగా బ్రిటిష్‌ ఇండియాలో పరిమితమైన ఓటు హక్కు ఉండేది. తన కాలం కంటే ముందుగా ఆలోచించిన దార్శనికుడు అంబేడ్కర్‌. పరిమితమైన ఓటు హక్కుతో, ముఖ్యంగా మహిళలకూ, నల్లవారికి ఓటు హక్కు లేకుండా, యూరప్‌, అమెరికా వంటి చోట్ల సైతం ప్రజాస్వామ్య వ్యవస్థలు కునారిల్లుతున్న దశలో ఇండియాలో అందరికీ ఓటు హక్కు ఉండాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. 1928లో ఓటు హక్కుకోసం ఉద్యమం జరిగిన తర్వాత బ్రిటన్‌లో వయోజనులందరకీ ఓటు హక్కు లభించింది. అంబేడ్కర్‌ మాత్రం 1919నుంచే వయోజనులందరికీ ఓటు ఉండాలని వాదిస్తూ వచ్చారు. భారత్‌ను ఒక జాతిగా రూపొందించే కర్తవ్యాన్నీ, పూర్తిస్థాయి ప్రజాస్వామ్యాన్ని సాధించే బాధ్యతను ప్రజలంతా స్వీకరించినప్పుడు మాత్రమే రాజ్యాంగ ఆదర్శం నెరవేరగలదు. ఈ నవంబర్‌ 26న రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేడ్కర్ ఆదర్శాల్ని మరోసారి స్మరించుకుందాం.


 బత్తుల వీరాస్వామి

అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Advertisement
Advertisement