ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవెన్యూ అధికారులదే

ABN , First Publish Date - 2020-02-20T10:21:39+05:30 IST

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదేనని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి స్పష్టం చేశారు. డీఆర్‌డీఏ

ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవెన్యూ అధికారులదే

తహసీల్దార్లతో సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి


కొత్తగూడెం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదేనని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రెడ్డి స్పష్టం చేశారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ భూముల పరిరక్షణ, మీ-సేవా కేంద్రాలు, శ్మశాన, డంపింగ్‌ యార్డులకు స్థలసేకరణ, సర్వే, రేషన్‌షాపుల నిర్వాహణ, ఇసుక, మట్టి తవ్వకాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీఆర్‌ఏ, వీఆర్వోలు ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ భూములు తనిఖీచేసి ఒక రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీఆర్వో, వీఆర్‌ఏలకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు.


అదనపు కలెక్టర్‌, డీఆర్వో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా క్షేత్రస్థాయి నుంచి పరిశీలన చేయాలన్నారు. ఆర్‌ఐలు నాయబ్‌ తహసీల్దార్లు, తహసీల్దార్లు కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూముల పరిశీలన చేయాలన్నారు. తనిఖీచేసిన భూముల వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు ప్రతిఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. రెవెన్యూ అధికారులతో ప్రతి 15రోజులకొకసారి సమీక్షా సమావేశం, ప్రతి గురువారం సాయంత్రం 3గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానన్నారు. సమగ్ర వివరాలను తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. అసమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరైతే సహించేదిలేదని హెచ్చరించారు.


మట్టి, ఇసుకఅక్రమ రవాణను అరికట్టాలని, మీ-సేవా కేంద్రాల తనిఖీచేసి రికార్డులు నిర్వాహణను పర్యవేక్షణ చేయాల న్నారు. రేషన్‌ దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. నిత్యావసర సరుకులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్లదే అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో అలసత్వం వహిస్తే అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు, డీఆర్వో లక్ష్మణస్వామి, ట్రైనీ ఐఏఎస్‌ అనుదీప్‌, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, ఎస్‌టీసీ శ్రీరాములు, ఏడీ సర్వే ల్యాండ్స్‌ రికార్డ్సు కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T10:21:39+05:30 IST