దేశం కోసమే అన్నదాతల ఆందోళన

ABN , First Publish Date - 2021-03-26T06:30:28+05:30 IST

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2020 నవంబరు 26న వేలాది ట్రాక్టర్లతో రైతు ఉద్యమం ప్రారంభమై, 4 నెలలుగా సంయుక్త కిసాన్‌ మోర్చా...

దేశం కోసమే అన్నదాతల ఆందోళన

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2020 నవంబరు 26న వేలాది ట్రాక్టర్లతో రైతు ఉద్యమం ప్రారంభమై, 4 నెలలుగా సంయుక్త కిసాన్‌ మోర్చా సమన్వయంతో కొనసాగుతోంది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా 500కు పైగా రైతు సంఘాలు ఐక్యంగా దేశ వ్యాపితంగా సాగిస్తున్న చారిత్రాత్మక ఉద్యమమిది. గడ్డ కట్టే చలిలో ప్రారంభమై, భగ్గుమంటున్న ఎండల్లో మ్రగ్గుతూ, మోదీ ప్రభుత్వ అణచివేత, నిర్బంధం - భారీ బారీకేడ్లు, ముళ్లకంచెలు, రోడ్డుకు అడ్డంగా కాంక్రీట్‌ గోడలు, భారీ రాతి బండలు, కందకాలు, నీటి ఫిరంగులు, బాష్పవాయు తూటాలు, లారీఛార్జీలు, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు, రైతు ఉద్యమానికి మద్దతు తెలియచేసిన, వార్తలు రాసిన వారిపై కూడా దేశద్రోహం కేసులు బనాయింపు, మంచినీరు, విద్యుత్‌, నెట్‌వర్క్‌ ఆపివేయుట జరిగింది. అత్యంత దుర్మార్గంగా పచ్చి అబద్ధాలతో - అరాచక సంఘ వ్యతిరేకులు, దేశ విద్రోహులు, టెర్రరిస్టులు, ఖలిస్తాన్‌వాదులు, నక్సలైట్లు, పాకిస్థాన్‌, చైనా ఏజెంట్లు, ఆందోళనజీవులు, పరాన్నభుక్కులు అనీ నీచమైన దుష్ప్రచారం సాగిస్తోంది. 


మోదీ సర్కార్ తెచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు ఎందుకు రద్దు చేయాలి? వ్యాపారుల గుత్తాధిపత్యం, మధ్య దళారీ వ్యవస్థ రద్దు చేసి, పంటలకు ఎక్కువ ధర వచ్చేటట్లు చేయటానికి 3 వ్యవసాయ సంస్కరణల చట్టాలు తెచ్చామని మోద ప్రభుత్వం ప్రచారం సాగిస్తోంది. వ్యవసాయ మార్కెట్ల వెలుపల స్వేచ్ఛా మార్కెట్లలో పెద్ద పెద్ద కంపెనీలు, బహుళజాతి సంస్థలు రావటం వల్ల రైతుకు ఎక్కువ ధర లభిస్తుందనేది ఎండమావి లాంటిది. స్వేచ్ఛా మార్కెట్లలో పెద్ద కంపెనీల గుత్తాధిపత్యం ఏర్పడి, ధరలను వారే నిర్ణయిస్తారు. మధ్య దళారుల స్థానంలో ఏజెంట్లు వస్తారు. కాంట్రాక్టు వ్యవసాయంలోనూ పెద్ద కంపెనీలే ఆధిపత్యం వహించి, ఉత్పత్తి, మార్కెట్లను నిర్దేశిస్తారు. పంటలు వచ్చినప్పుడు మార్కెట్లో ధరలు తగ్గించి పెద్ద ఎత్తున నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచి, రైతులు, వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తారు. ఈ చట్టాలు రైతుల కొరకు కాక, గౌతం ఆదానీ, అంబానీల లాంటి ఆశ్రిత పెట్టుబడిదారీ కార్పొరేట్‌ సంస్థలకు వ్యవసాయంపై ఆధిపత్యం ఏర్పరచటానికే మోదీ తెచ్చాడు. వీటి వల్ల, మద్దతు ధరల విధానం, ప్రభుత్వ సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ మార్కెట్లు క్రమంగా రద్దు అవుతాయి. రైతాంగం ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతాంగం సబ్సిడీలు, మద్దతు ధరలు లేక, అప్పులపాలై, భూములు కోల్పోయి, తమ భూముల్లోనే కూలీలుగా పనిచేయాల్సి వస్తుంది.


మోదీ తీసుకు వచ్చిన వ్యవసాయ స్వేచ్ఛా మార్కెట్ల చట్టాల లాంటివి అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ప్రాన్సు, తదితర దేశాలన్నింటిలో అమలు జరిగాయి. ఆ దేశాలలో చిన్న, సన్నకారు రైతులంతా నాశనమై పెద్ద కంపెనీలు, పెద్ద పెట్టుబడిదారీ భూస్వాములే మిగిలారు. వ్యవసాయ స్వేచ్ఛా మార్కెట్లు అక్కడ రైతుల ఆదాయం పెంచటానికి తోడ్పడలేదు. అందువల్లనే, సామ్రాజ్యవాద దేశాలు అక్కడ వ్యవసాయానికి భారీగా సబ్సిడీలు - వ్యవసాయోత్పత్తి ఖర్చులో 17.8 శాతం 2019లో యిచ్చాయి. ఇందులో మార్కెటు మద్దతు ధర (ఎం.ఎస్‌.పి.) పేరిట 42.9 శాతం, రైతులకు వస్తున్న ఆదాయంలో సగటున 57 శాతం నేరుగా నగదు చెల్లిస్తున్నాయి. రైతులకు నేరుగానూ, పర్యావరణం పేరిట చెల్లించే సబ్సిడీలే ఎక్కువగా వుంటున్నాయి.


బిహారులో 2006లో వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థను రద్దు చేసి, స్వేచ్ఛా మార్కెట్లకు గేట్లు తెరిచారు. గత 14 ఏళ్ళలో రైతుకు ఏ పంటకు కూడా కనీస మద్దతు ధర లభించక, తక్కువ ధరకు అమ్మి, ఎక్కువగా నష్టపోయింది. వ్యాపారులు తక్కువ ధరకు కొని పంజాబు, హర్యానాల మండీలలో మద్దతు ధరకు అమ్మి, వేల కోట్ల లాభాలు పొందారు.


ప్రభుత్వ మద్దతు, తోడ్పాటు లేకుండా వ్యవసాయం మనగలుగుతుందా? వ్యవసాయం, ఇతర రంగాలైన పరిశ్రమలు, సర్వీసు రంగాలకు భిన్నమైనది. ఇది ప్రకృతి వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మిలపై ఆధారపడి వుంది. ప్రకృతి వైపరీత్యాలు - వర్షాభావం వల్ల కరువు; తుఫాన్లు, చీడ పీడలు వల్ల తరచుగా పంటలు దెబ్బతినడం చూస్తూనే వున్నాం. రైతు లేక పోతే, ఆహారం లేదు. అందువల్లనే వ్యవసాయాన్నీ, రైతునూ కాపాడుకొనుటకు అన్ని దేశాలూ, ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాలు పెద్ద ఎత్తున సబ్సిడీ లిస్తున్నాయి. కానీ, మన దేశంలో ప్రభుత్వాలు యిచ్చే నికర సబ్సిడీ లేక పోగా, రైతులే ప్రభుత్వాలకు 2000 - 2019 వరకు ఏడాదికి - 5 శాతం వ్యతిరేక సబ్సిడీ యిచ్చారనీ, మార్కెటు ధరలు, అంతర్జాతీయ మార్కెటు ధరల కంటే 14.8 తక్కువగా వున్నాయనీ ‘ఆర్థిక సహాకారం, అభివృద్ధి సంస్థ తన వ్యవసాయం పై నివేదిక -2020లో పేర్కొన్నది. దీనివల్ల, భారత రైతాంగం ఏడాదికి సగటున రూ. 2.65 లక్షల కోట్లు కోల్పోతున్నది.


కేంద్రం 2021–22కు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కేటాయింపులు వ్యవసాయానికి పెంచక పోగా తగ్గించింది. ఎరువులు, స్వల్పకాల వడ్డీ రాయితీల సబ్సిడీలు తగ్గించింది. ఇప్పటికే రసాయనిక ఎరువులు బస్తాకు రూ.100-250 వరకు పెరిగింది. ఉపాధి హామీ, పి.యం. కిసాన్‌లకు కేటాయింపులు తగ్గించింది. 


‘ఆత్మనిర్బర్‌ అభియాన్‌’ పేరిట దేశ వనరులు, ముఖ్యంగా లాభాలు వస్తున్న బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, రక్షణ రంగంతో సహా దాదాపు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించి, కార్పొరేట్లకు దారాదత్తం చేయటానికి కంకణం కట్టుకుంది. పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతూ, పన్నుల ఆదాయం పెంచుకుంటున్నది. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దశాబ్దాలుగా కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరిట కాలరాస్తున్నది. దేశంలో ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అన్ని తరగతుల ప్రజల హక్కులపై ఫాసిస్టు దాడులు సాగిస్తూ వుంది.రైతులు సాగిస్తున్న పోరాటం ప్రజల కోసం, దేశం కోసం జరుగుతున్న దేశభక్తియుత, ప్రజాస్వామిక పోరాటం. రైతాంగ డిమాండ్ల సాధనకై జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మార్చి 26న జరుగుతున్న ‘భారత్‌ బంద్‌’ను రాష్ట్రంలో విజయవంతం చేయుటకు మద్దతు తెలియచేసి, సహకరించడం అన్ని తరగతుల ప్రజల బాధ్యత.

వేములపల్లి వెంకట్రామయ్య

జాతీయ అధ్యక్షులు, అఖిల భారత రైతు-కూలీ సంఘం 

(నేడు ‘భారత్‌ బంద్‌’)

Updated Date - 2021-03-26T06:30:28+05:30 IST