దైవ భావన, డార్విన్

ABN , First Publish Date - 2021-02-16T06:57:17+05:30 IST

పసిఫిక్ మహాసముద్రంలోని గాలాపాగోస్ దీవులలో సముద్రపు తాబేళ్ళ పరిణామాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రస్తుత మానవుడు వానరాల నుంచి...

దైవ భావన, డార్విన్

‘భూమి మీద జీవించిన ప్రతి కర్బన రసాయన జీవి, మొట్టమొదటిసారి ఊపిరిపోసుకున్న ఒక ఆదిమ రూపం నుంచి ఆవిర్భవించి ఉంటాయి. ఇలాంటి జీవన దృక్పథంలో ఓ గొప్పదనం ఉంది. స్థిరమైన గురుత్వ ధర్మాన్ని అనుసరించి ఈ గ్రహం అనాదిగా సంచరిస్తూ ఉన్న సమయంలో, అలాంటి సామాన్యమైన ఆరంభం నుంచి అతి సుందరమైన, అత్యద్భుతమైన జీవనాకృతులు అనవధికంగా పరిణామం చెందాయి. 

చార్లెస్ డార్విన్ 

‘జీవ జాతుల ఆవిర్భావం’ (1859)


పసిఫిక్ మహాసముద్రంలోని గాలాపాగోస్ దీవులలో సముద్రపు తాబేళ్ళ పరిణామాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రస్తుత మానవుడు వానరాల నుంచి ప్రభవించాడనే నిర్ణయానికి ఛార్లెస్ డార్విన్ వచ్చాడు. ఈ చరాచర సృష్టికి దేవుడే మూల కారకుడని ఆ కాలంలో పాశ్చాత్య ప్రపంచం విశ్వసించేది. ఒక శిల్పి సుత్తి, ఉలితో ఒక విగ్రహాన్ని సృజించిన విధంగా భగవంతుడు తన సొంత ప్రతిబింబంగా మానవాళిని సృష్టించాడని బైబిల్ పేర్కొంది. 


జీవజాతుల ఆవిర్భావంలో ‘దేవుడు’ లాంటి బాహ్య అస్తిత్వం లేదా వ్యక్తి ప్రమేయం ఏమీ లేదని డార్విన్ సూచించాడు. ప్రాకృతిక వరణం (నేచురల్ సెలక్షన్) ప్రక్రియ ద్వారా మానవాళి ప్రభవించిందని ఆయన రుజువు చేశారు. ప్రతి సజీవ జీవ జాతిలోను వైవిధ్యం ఉంది. కొన్ని కోతులు మృదువుగా ఉంటాయి. మరికొన్ని దృఢంగా ఉంటాయి. కొన్ని జీవులు తాము నడయాడుతున్న పరిసరాలకు అనుగుణంగా తమ ప్రవర్తనారీతులను సర్దుబాటు చేసుకోవడం ద్వారా మనుగడ నిలబెట్టుకోగలుగుతాయి. పెద్దసంఖ్యలో సంతానాన్ని కనడం ద్వారా తమ జాతిమనుగడను కాపాడుకోగలుగుతాయి. పరిసరాలకు అనుగుణంగా వ్యవహరించలేకపోయిన జీవజాతులు అంతరించిపోయాయి. భగవంతుడు మానవాళిని ‘సృష్టించాడు’ అనే బైబిల్ సిద్ధాంతాన్ని డార్విన్ సవాల్ చేశాడు. 


జీవజాతుల ఆవిర్భావం ఎలా జరిగిందనే విచికిత్సకు హిందూమతంలోనూ చాలా ప్రాధాన్యం ఉంది. మానవాళిని దేవుడు సృష్టించాడని బైబిల్ చెప్పినట్లే బ్రహ్మ వేలాది స్త్రీ పురుషుల జంటలను సృష్టించాడని వాయుపురాణం చెప్పింది. ‘ధూళి, బూడిద, చెత్తాచెదారంతో మనిషి ప్రతిమను రూపొందించి, ఆ బొమ్మ నాసాపుటంలోకి ఊపిరులూదాడని, అప్పుడు ఆ మానవప్రతిమ సజీవమానవుడుగా పరిణమించిందని’ బైబిల్ పేర్కొంది. అలాగే ‘అంధకారం’ నుంచి భూతాలు, వేల్పులు, మానవులు, పూర్వజులు, పక్షులు, జంతు వులను సృష్టించడానికి బ్రహ్మ చేసిన ప్రయత్నాలను వాయుపురాణం వివరించింది. 


ఆది పురుషుడు ఆదాం పక్క ఎముకల నుంచి ఈవ్ (ఆదిమ స్త్రీ)ని భగవంతుడు సృష్టించాడని బైబిల్ చెప్పింది. బ్రహ్మ శరీరాన్ని చీల్చడం ద్వారా స్వయంభు, అతని భార్య శతరూపను సృష్టించడం జరిగిందని వాయుపురాణం చెప్పింది. నిషిద్ధ ఫలాన్ని తిన్న కారణంగా ఈడెన్ వనం నుంచి బహిష్కృతుడైన ఆదాం భూమి దున్నడం ప్రారంభించాడని బైబిల్ పేర్కొంది. ఒక దశలో వృక్షాలు అన్నీ చనిపోవడం ప్రారంభమయిందని వాయుపురాణం పేర్కొంది. ఎందుకీ ఉత్పాతం వాటిల్లిందని ప్రజలు ఆలోచనామగ్నులయ్యారు. అప్పుడు వారి గృహాలలో మొక్కలు పుట్టి, వృక్షాలుగా వృద్ధి చెందడం ప్రారంభమయిందని వాయుపురాణం వివరించింది. 


ఇంతకూ సృష్టి ఎలా జరిగింది? ‘దేవుడు’ లేదా ‘బ్రహ్మ’ గురించిన మన అవగాహనపై ఇది ఆధారపడి ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఒకానొక కాలంలో యావత్ విశ్వం ఒక ‘నల్లబిలం’ (బ్లాక్ హోల్)లో ఇమిడి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఉండగా హఠాత్తుగా ఒక మహావిస్ఫోటం సంభవించి ఉదజని, ఆమ్ల జని, భూమి, ఇతర గ్రహాలు, జంతువులు, మానవులు వరుసగా సృష్టి అయ్యారు. ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. యావత్ విశ్వం నల్లబిలంలో ఇమిడిపోయి ఉన్నప్పుడు దేవుడు లేదా బ్రహ్మ ఎక్కడ ఉన్నారు? 


మహావిస్ఫోటం సంభవించిన సమయంలో దేవుడు నల్లబిలంలోనే ఉన్నాడని భావిస్తే ‘దేవుడు’, ‘విశ్వం’ రెండు అస్తిత్వాలు కాకుండా ఒకే అస్తిత్వం అవుతుంది. దేవుడు- విశ్వం అనే అస్తిత్వం తనకు తానే పేలిపోవడమో లేదా విభజితమవడమో జరిగింది. భగవంతుని గురించిన ఈ వర్ణన ‘ఏక సత్తావాదం’ (మోనిజం- దృగ్గోచర, అగోచర జగత్తు అంతటినీ ఒకే సత్తాగా వివరించడం సాధ్యమేనని ఈ వాదం ప్రతిపాదిస్తుంది)గా సుప్రసిద్ధమయింది. ఈ ప్రపంచాన్నంతటినీ ఒకే ఒక్క మౌలికసత్యంతో వివరించవచ్చని ఈ తాత్త్విక సిద్ధాంతం భావిస్తుంది. అలా కాకుండా, మహావిస్ఫోటం సమయంలో దేవుడు నల్లబిలంలో కాకుండా వెలుపల ఉన్నాడని భావిస్తే ఆ విస్ఫోటాన్ని సృష్టించింది భగవంతుడే అవుతాడు. ఒక డైనమేట్‌ను పెట్టి పేలుళ్లు జరిపినట్టుగా దేవుడు మహావిస్ఫోటానికి మూల కారకుడు అవుతాడు. మరి ఈ విశ్వంలో నల్లబిలం మినహా మరేమీ లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుని గురించిన ఈ వర్ణన ‘ఏకేశ్వరవాదం’ (మోనోథీయిజం- ఈశ్వరుడు ఒక్కడే అని, సృష్టికర్తకు బహుళ అస్తిత్వాలు ఉండవని వివరించే తాత్త్విక సిద్ధాంతం)గా ప్రసిద్ధికెక్కింది.


ఏకసత్తావాదాన్ని అంగీకరిస్తే మానవ సృష్టి గురించిన డార్విన్, బైబిల్, హిందూ మత భావాలు పరస్పరం పొసిగే భావాలు అవుతాయి. అప్పుడు వానరం అంతర్గత చైతన్యమే మానవుడిగా పరిణమించేందుకు దానిని పురిగొల్పిందని మనం అర్థం చేసుకోవచ్చు. 


డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం భగవంతుని గురించిన మానవ అవగాహనలో ఒక మౌలిక పురోగతికి దారి తీసింది. మానవుడిని సృష్టించిన దేవుడు ఒక బాహ్య అస్తిత్వమా లేక తనకుతానే పరిణమించే సర్వాంతర్యామి అయిన అంతర్గత చైతన్యమా అన్న విషయమై నిశిత ఆలోచనలకు మనలను డార్విన్ పురిగొల్పాడు. డార్విన్ ఆలోచనా బాటలోనే మనం ముందుకు సాగవల్సిన అవసరం ఉంది. అబ్రహామిక్ మతాలు- క్రైస్తవం, జుడాయిజం మొదలైనవి- భగవంతుడిని ఒక బాహ్య అస్తిత్వంగా భావిస్తాయి. మన హిందూమతం అందుకు భిన్నంగా బ్రహ్మను పారమార్థిక సత్యంగా భావిస్తుంది. ఈ రెండు భిన్న చింతనాధోరణుల మధ్య సంవాదం, డార్విన్ స్ఫూర్తితో ఒక కొలిక్కి వచ్చే సమయమాసన్నమయింది. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-02-16T06:57:17+05:30 IST