నాలుగో బ్రిడ్జి నరకం

ABN , First Publish Date - 2020-05-27T11:16:36+05:30 IST

గోదావరి నాలుగో బ్రిడ్జి (గామన్‌ బ్రిడ్జి) ధ్వంసమైంది. పుష్కరాల సమయంలో ప్రారంభించిన ఈ బ్రిడ్జి అత్యం త అధ్వానంగా మారినా

నాలుగో బ్రిడ్జి నరకం

 పూర్తిగా ధ్వంసమైన గోదావరి బ్రిడ్జి

మరమ్మతుల పేరిట తతంగం

టోల్‌ తీయడమే కానీ వంతెన పట్టదు

ఒక్కసారి కూడా పూర్తిగా  తారువేయలేదు

14 కిలోమీటర్ల బ్రిడ్జిలో పది కి.మీ గోతులు


గోదావరి నాలుగో బ్రిడ్జి (గామన్‌ బ్రిడ్జి) ధ్వంసమైంది. పుష్కరాల సమయంలో ప్రారంభించిన ఈ బ్రిడ్జి అత్యం త అధ్వానంగా మారినా పట్టించుకునే నాథుడే లేడు. బీవోటీ పద్ధతిలో గామన్‌ కంపెనీ ఈ బ్రిడ్జిని నిర్మించిన సంగతి తెలిసిందే. దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ 14 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జి ఉంది. గోదావరి భాగంలో బ్రిడ్జి నాలుగు కిలోమీటర్లు ఉంది. కొవ్వూరు, దివాన్‌చెరువు వైపు మొత్తం 10 కిలోమీటర్ల అప్రోచ్‌ ఉంది. బ్రిడ్జి వల్ల పెద్దగా సమస్య లేదు. కానీ అప్రోచ్‌లు పెద్ద గోతులు పడి, క్వారీగోతుల్లా తయారయ్యాయి. ఎంత పెద్దవాహనమైనా అంతే. కరోనా వల్ల కొద్దిరోజులు భారీ వాహనాలు నిలిపివేసినా, ఇసుక లారీలతో దివాన్‌చెరువు వైపు బాగా ధ్వంసమైంది. మొదట నుంచి ఈ అప్రోచ్‌లు ధ్వంసమవుతూనే ఉన్నాయి.


గామన్‌ కంపెనీ వారు కొవ్వూరు వైపు టోల్‌గేట్‌ ఏర్పాటు చేసి తోలు తీస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మంవైపు, విజయవాడ వైపు వెళ్లడానికి ఇది దగ్గర దారి కావడం వల్ల భారీ వాహనాలన్నీ ఇటువైపే వెళుతున్నాయి. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు కూడా ఇటే వెళుతున్నాయి. పెద్ద లారీల డ్రైవర్లతోపాటు, కార్లు, మోటారు సైకిళ్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గోతులో పడి లేస్తూ, దుమ్ముకొట్టుకుపోయి, ఒళ్లంతా నొప్పులు పుట్టడంతో గిజగిజలాడుతున్నారు. భారీ వాహనాలు కూడా తుక్కుతుక్కయిపోతున్నాయి. కొత్త టైర్లు కూడా ఇక్కడి పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాయి. ఈ బ్రిడ్జి, అప్రోచ్‌ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా మారి, వాహనాలు రాకపోకలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది.


దాంతో టోల్‌ ఆదాయం తగ్గిపోతుందనే భయంతో అక్క డక్కడ చిన్న చిన్న మరమ్మతులతో సరిపెడుతున్నారు. బిడ్జి నిర్మించిన తర్వాత పూర్తి ఒక్కసారి కూడా ఒక లేయర్‌ తారు కూడా వేయలేదు. ఎక్కువ భాగం తారు రోడ్డు, కొంత మేర సీసీ రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం మరమ్మతుల పేరిట  దివాన్‌చెరువు వైపు ఒక రోడ్డును మూసేసి, ఒకవైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.  అంతేకాక మరమ్మతులకోసం మరిన్ని గోతులు తవ్వారు. అక్కడక్కడా కొద్దిగా కంకర వేశారు. లాక్‌డౌన్‌ సడలింపు వల్ల భారీగా వాహనాల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ఈ రోడ్డులో ప్రయాణం అందరికీ నరకంగా మారింది.  మరోవైపు కొవ్వూరు -గుండుగొలను హైవే వేగంగా నిర్మాణమవుతోంది. కానీ ఈ బ్రిడ్జిని, అప్రోచ్‌రోడ్లను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్వహణ చేపట్టాల్సి న గామన్‌ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు.

Updated Date - 2020-05-27T11:16:36+05:30 IST