కంపెనీ చెప్పిందే తూకమట!

ABN , First Publish Date - 2022-01-25T08:35:36+05:30 IST

స్టీల్‌ కొనుగోలులో తూకం ప్రామాణికాన్ని తొలగించడాన్ని గృహనిర్మాణ కార్పొరేషన్‌ సమర్థించుకుంది.

కంపెనీ చెప్పిందే తూకమట!

టన్ను రాడ్లలో ఒక్క మీటరుపైనే టెస్టింగ్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి హౌసింగ్‌ కార్పొరేషన్‌వివరణ


అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ కొనుగోలులో తూకం ప్రామాణికాన్ని తొలగించడాన్ని గృహనిర్మాణ కార్పొరేషన్‌ సమర్థించుకుంది. దానివల్ల లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పే ప్రయత్నం చేసింది. వందల టన్నుల కొనుగోళ్లకు ఒక మీటరు రాడ్డు టెస్టింగ్‌ సరిపోతుందని తేల్చేసింది. ‘స్టీల్‌లో గోల్‌మాల్‌!’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై హౌసింగ్‌ కా ర్పొరేషన్‌ సోమవారం వివరణ ఇచ్చింది. కంపెనీలు అడిగినందునే తూకాన్ని తొలగించినట్లు అంగీకరించింది. కాగా వాస్తవాలకు కార్పొరేషన్‌ వివరణకు పొంతన కుదరటం లేదు. ప్రతి కంపెనీ స్టీల్‌ను బయటకు పంపే సమయంలో స్టీల్‌ను తూకం వేస్తుంది. అది ఎంత బరువు వచ్చింది, ఇన్‌వాయి్‌సలో ఎంత రాయాలన్నది కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. తీరా అది హౌసింగ్‌ గోడౌన్లకు చేరాక అందులో నుంచి ఒక మీటరు రాడ్డు కట్‌ చేసి దానిపై టెస్టింగ్‌ చేస్తారు. ఐఎస్‌ నిబంధనల ప్రకారం ఒక మీటరు రాడ్‌ తూకం సరిపోతే దాన్ని కచ్చితమైన తూకం కింద సర్టిఫై చేస్తారు. కానీ టన్నుల తూకంలో వచ్చే తేడా ఒక మీటరు ముక్కలో కనిపించదు. ఉదాహరణకు 8ఎంఎం రాడ్‌ ఒక మీటరు 0.395 కిలోలు ఉండాలి. మీటరుగా తూకం వేసినప్పుడు అతి స్వల్పంగా గుర్తించలేని స్థాయిలో తేడా కనిపిస్తుంది. చూడటానికి అది పెద్దగా తేడాగా ఉండదు. అందువల్ల దాన్ని ఎవరూ వ్యత్యాసం కింద పరిగణించరు. అదే పెద్దమొత్తంలో తూకం వేసినప్పుడు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కార్పొరేషన్‌ మాత్రం మీటరు రాడ్‌ తూకంతో వందల టన్నుల తూకాన్ని నిర్ధారించుకోవాలని చెబుతోంది. ఇక గోడౌన్లకు దగ్గర్లో వేబ్రిడ్జిలు లేవని, చాలావరకు వేబ్రిడ్జిలలో తూకం తేడా వస్తోందని కార్పొరేషన్‌ తెలిపింది.  

Updated Date - 2022-01-25T08:35:36+05:30 IST