భాగ్యనగరంలో శిక్షణ.. Civilsలో ర్యాంకుల సాధన..

ABN , First Publish Date - 2022-05-31T13:13:05+05:30 IST

పేదరికం వెక్కిరించినా, ఆరోగ్యం బాగాలేకపోయినా వారు వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు కదిలారు.

భాగ్యనగరంలో శిక్షణ.. Civilsలో ర్యాంకుల సాధన..

  • సివిల్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులు


హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : పేదరికం వెక్కిరించినా, ఆరోగ్యం బాగాలేకపోయినా వారు వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు కదిలారు. అహోరాత్రులు శ్రమించారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ఫలితాల్లో నగరంలోని వివిధ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందిన పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. మెరుగైన ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు. కష్టపడి చదివితే విజయం సొంతమవుతుందని ర్యాంకులు పొందిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. పలువురు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.


బ్రెయిన్‌ హెమరేజ్‌ వచ్చినా.. 

2017లో చెన్నైలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్న సమయంలో బ్రెయిన్‌ హెమరేజ్‌ అయింది. అప్పుడు కొంత ఇబ్బంది పడినా కోలుకున్నాను. సివిల్స్‌ టార్గెట్‌ పెట్టుకున్నాను. నా ఆశయానికి CSB అకాడమీ దోహదపడింది. - స్మరణ్‌రాజ్‌, 676 ర్యాంకర్‌ 


కష్టపడి చదివాను

బీటెక్‌ పూర్తి చేసిన నేను ఐటీ ఉద్యోగం చేశాను. సివిల్స్‌ సాధించాలనే తపనతో కష్టపడి చదివాను. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్‌ సాధించాను. - ఉప్పులూరి చైతన్య, 470 ర్యాంకర్‌ 


మొదటి ప్రయత్నంలోనే..

మాది కాకినాడ. ఫిషర్‌మన్‌ కుటుంబానికి చెందిన నాకు చిన్నప్పటి నుంచే సివిల్స్‌ సాధించాలనే పట్టుదల ఉంది. నా ఆశయానికి కుటుంబసభ్యులు సహకరించారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించడం ఆనందంగా ఉంది. - దిబ్బడ అశోక్‌, 350వ ర్యాంకర్‌


తండ్రి కష్టాన్ని చూసి.. 

మాది జగిత్యాల జిల్లా చర్లపల్లి. వ్యవసాయ కు టుంబం. నాన్న కష్టపడి చదివించారు. ఆయన కష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను. జీవితంలో ఉన్నతస్థానానికి చేరాలని పట్టుదలతో ఐఏఎస్‌ సాధించాను.

- గుగులోత్‌ శరత్‌నాయక్‌, 374 ర్యాంకర్‌ 


మూడో సారి విజయం

మాది వరంగల్‌ నగరం. సరైన గైడెన్స్‌ లేక రెండు సార్లు ర్యాంకు సాధించలేకపోయాను. మూడో ప్రయత్నంలో ప్రణాళిక ప్రకారం చదివి సివిల్స్‌ సాధించాను. - రంజిత్‌కుమార్‌, 574 ర్యాంకర్‌


ఐఎఫ్‌ఎస్‌ అధికారి కావడమే లక్ష్యం 

రాంనగర్‌: జేఎన్‌టీయూలో బీఆర్‌ చేశాను. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్ఎస్‌) అధికారి కావడమే లక్ష్యంగా మూడు సార్లు పరీక్ష రాశాను. నాలుగోసారి 544 ర్యాంకు వచ్చింది. నా తల్లిదండ్రులు మాడిశెట్టి అజయ్‌కుమార్‌. రేవతిదేవి న్యాయవాదులు. వారి ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధ్యమైంది. - అనన్యప్రియ, 544 ర్యాంకు

Updated Date - 2022-05-31T13:13:05+05:30 IST