Abn logo
Mar 24 2020 @ 04:53AM

కాలాన్ని శాసిస్తున్న నారద సంతానం

జగత్తునంతటినీ మోహపరిచే మహా మాయ తనను ఏమీ చేయలేదని ఒకసారి నారదుడు శ్రీమహావిష్ణువుతో చెప్పాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి మౌనంగా తలూపాడు. కొంతసేపటి తర్వాత వారిద్దరూ భూలోకానికి చేరుకుని కన్యాకుబ్జానికి దగ్గర లో ఒక సరస్సు దగ్గర దిగారు. అది సంధ్యా సమయం. అర్ఘ్యం ఇవ్వడానికి నారదుడు ఆ సరస్సులో ముమ్మారు మునిగాడు. పైకి లేచి చూసేసరికి ఒక స్త్రీగా మారిపోయాడు. ఈలోపు.. విష్ణు వు నారదుని వీణాదులను తీసుకుని అంతర్థానం అయిపోయా డు. స్త్రీగా మారి సరస్సు ఒడ్డున విహరిస్తున్న నారదుణ్ని.. అటు గా వచ్చిన కన్యాకుబ్జపు రాజు తాళధ్వజుడు చూశాడు. అతిలోక సుందరిలా ఉన్న ఆమెను వివరాలు అడగ్గా.. ఆమె తన పేరు గానీ, గతం కానీ గుర్తులేవని చెప్పింది. తాళధ్వజుడు ఆమెకు సౌభాగ్యసుందరి అని పేరు పెట్టి వివాహం చేసుకున్నాడు. వారి కి అరవై మంది సంతానం కలిగారు. వారు పెరిగి పెద్దవారయ్యాక పొరుగు రాజ్యంతో ఘోరమైన యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో అరవైమందీ నిహతులయ్యారు. వృద్ధులైన తాళధ్వజుడు, సౌ భాగ్య సుందరి పుత్రశోకంతో దుఃఖించడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక వృద్ధురాలు అక్కడకు వచ్చి.. వారి దుఃఖం పోవాలంటే పుంతీర్థమనే సరస్సులో ఒక చెయ్యి మాత్రం పైకి ఉంచి స్నానం చెయ్యాలని చెప్పింది. ఆమె చెప్పినట్టు ఒక చేయి పైకి ఉంచి స్నానం చేసిన సౌభాగ్య సుం దరి.. నీటిలోంచి పైకి లేచేసరికి నారదునిగా మారిపోయింది. నీ టి పైకి ఉంచిన చెయ్యి మాత్రం.. అప్పటిదాకా జరిగిందంతా నిజమని రుజువు చేసేట్టుగా స్త్రీ హస్తంలాగానే ఉండిపోయింది. ఆ జ్ఞాపకాలన్నీ నారదుడి తలపుల్లోనే ఉన్నాయి. తల పైకెత్తి చూసేసరికి సరస్సు ఒడ్డున శ్రీమహావిష్ణువు చిద్విలాసం చేస్తూ కనిపించాడు. తాళధ్వజుడు మాత్రం కనిపించలేదు. అదంతా మాయ అని అర్థమైనా.. స్త్రీ రూపంలో ఉన్నప్పుడు తనకు జన్మించి, ఆ తర్వాత గతించిన అరవై మంది పిల్లలపై నారదుని కి మమకారం మాత్రం పోలేదు. తన పిల్లలు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయే వరమివ్వాలని మహావిష్ణువును, జగన్మాతను నారదుడు వేడుకున్నాడు.


ఫలితంగా కాలవర్గీకరణలో సంవత్సరాలకు.. నారదుని పిల్లల పేర్లు అయిన ప్రభవ, విభవ మొదలైనవి స్థిరమైనాయి. ఈ క్రమంలోనే.. రేపటి నుంచిచాంద్రమానం ప్రకారం శార్వరి నా మ సంవత్సరం ప్రారంభం కానున్నది. మనం చేయవలసిన విధులు ఏంటంటే.. తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానంచేసి, నూతనవస్త్రాలను ధరించాలి. ఇష్ట దైవ పూజ, కాలాన్ని దైవంగా పంచాంగరూపంలో పూజించాలి. పంచాంగం అంటే.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. అలా కాల రూపమైన పంచాంగాన్ని, నవగ్రహాలను  పూజించి సంవత్సర ఫలాలను తెలుసుకోవాలి. ఆరు రుచుల ఉగాది పచ్చడిని తినాలి. నవగ్రహాల పూజవల్ల.. సూ ర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు సంపదలను, కుజుడు భూమిని, బుధుడు చక్కని మాటను, గురుడు సౌభాగ్యాన్ని, శుక్రుడు శౌర్యాన్ని, శని ధైర్యాన్ని, రాహువు కీర్తిని, కేతువు ఇష్టసిద్ధిని కలుగచేస్తారని ప్రతీతి.  

- ఆచార్య రాణి సదాశివ మూర్తి   (రేపు ఉగాది)

Advertisement