పాత్రధారులు సరే.. సూత్రధారుల మాటేమిటి?

ABN , First Publish Date - 2022-05-27T05:18:59+05:30 IST

భూ కబ్జాలు వెలికి తీసి నకిలీల గుట్టురట్టు చేసి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, జిల్లాలోనే బద్వేలు రెవెన్యూ అధికారులు సంచలనంగా మారా రు.

పాత్రధారులు సరే.. సూత్రధారుల మాటేమిటి?
ఆక్రమిత ప్రభుత్వ స్థలాలలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు

అధికార పార్టీ నేతల పాత్రపై సర్వత్రా చర్చలు 

ఆక్రమణలు, నకిలీలకు చెక్‌ పడేనా..


బద్వేలు, మే 26: భూ కబ్జాలు వెలికి తీసి నకిలీల గుట్టురట్టు చేసి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, జిల్లాలోనే బద్వేలు రెవెన్యూ అధికారులు సంచలనంగా మారా రు. దశాబ్దాల తరబడి అడ్డూ, అదుపులేకుండా సాగుతున్న బద్వేలు భూ దందాపై చేపట్టిన చర్యలపై ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే  నకిలీ దందా నడిపే పాత్రధారులపైన మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ దందా తెర వెనక ఉన్న సూత్రధారులు ఎవరనేది ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భూదందాపై పోలీసులు కేసు నమోదు చేసినా... ఏడుగురిని మాత్రమే అరెస్టు చేసి, మిగిలిన వారిని అరెస్టు చేయడంలో  జాప్యం చేయడంపై ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదే అదనుగా వారు ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడం జరిగింది.


అధికార పార్టీ ముఖ్యనేతలే పాత్రధారులు

బద్వేలులో పదికాదు, ఇరవై ఎకరాలు కాదు ఒక అంచనా ప్రకారం నూరు ఎకరాలకుపైగా అనేక చోట్ల భూ ఆక్రమణలు జరిగాయి. వీటిలో  చాలా వరకు నకిలీ పట్టాలు ఉన్నాయి. ఈ భూ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వారి అనుచరులు పలువురు ఉన్నారని బద్వేలులో కోడై కూస్తోంది. నియోజకవర్గస్థాయి నేతకు ముఖ్య అనుచరుడిగా   మారిన ఒక నేతతో పాటు మరో నాయకుడికి కూడా ఈ భూ ఆక్రమణతో సంబంధం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ స్థాయి నేత ఒకరు, మండలస్థాయి నేత ఒకరు కూడా ఈ భూ వివాదంలో ఉన్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి. బద్వేలులో సాగుతున్న భూ దందాలో నాయకులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ఒకరు ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు  రెవెన్యూ అధికారులు బద్వేలు భూ దందా బాగోతం బయట పెట్టడం ఒక ఎత్తు అయితే, తెరవెనుక ఇంతకాలం భూ ఆక్రమణకు పాల్పడుతూ వచ్చిన వారిని బయటపెట్టడం మరో ఎత్తుగా మారింది. భూ దందాలు, నకిలీపట్టాలు సృష్టించే వారి వెనుక ఉండి కథ నడిపించే సూత్రధారుల గుట్టురట్టు  చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.  


అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు 

 భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో వ్యవహరిస్తున్న  రెవె న్యూ, పోలీసు అధికారుల దూకుడుకు రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే  నకిలీ పట్టాల సృష్టికర్తలు అయిన 17 మందిపై కేసు నమోదు చేసి, కొంతమందిని జైలుకు పంపడం జరిగింది. మిగతా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ 17 మంది కాకుండా మరికొంత మందికి భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు నాలుగు రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో  ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వారిపై ఎలాంటి కేసు నమోదు కాకుండా పోలీసులు, రెవెన్యూ వారిపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతల పేర్లు ఉండడంతో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతుండడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు ఈ నకిలీ భూదందా వ్యవహారంపై స్పీడు తగ్గించారన్న ఆరోపణలు ప్రజలనుంచి వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-05-27T05:18:59+05:30 IST