రాజధాని మార్పుపై అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు పోవాలి

ABN , First Publish Date - 2020-08-04T11:13:47+05:30 IST

మాట తప్పడం మడమ తిప్పడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, వైసీపీ నాయకులకు దినచర్యగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

రాజధాని మార్పుపై అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు పోవాలి

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి


వేంపల్లె, ఆగస్టు 3: మాట తప్పడం మడమ తిప్పడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, వైసీపీ నాయకులకు దినచర్యగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చడంపై తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు పోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వేంపల్లెలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాజధాని అమరావతిలోనే ఉండాలని, కనీసం 30వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట, మడమ తిప్పి ఓట్లేసిన ప్రజలను మోసగించారన్నారు.


మాట ఇవ్వడం దాన్ని అమలు చేయడం ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని గతంలో ఉచిత విద్యుత్‌ అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో రైతు భరోసా పథకంపై ప్రతి రైతుకు రూ.12500 ఇస్తామని చెప్పి 5వేలు కోతపెట్టారని, ఎక్కువమంఇ ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్‌ మాట మార్చి హోదా గురించి పట్టించుకోలేదన్నారు.


మద్యపాన నిషేధంపై మాట మార్చారని, అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పదిశాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు.  వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పడం జగన్‌కే చెల్లిందన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతు ఇచ్చి బయటకు వచ్చాక మాట మార్చారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-04T11:13:47+05:30 IST