నైరాశ్యంలో నిరుద్యోగులు

ABN , First Publish Date - 2020-07-05T09:52:37+05:30 IST

‘మూడేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. దురదృష్టవశాత్తూ కొద్దిలో రెండు, మూడు ఉద్యోగాలు కోల్పోయాను. ఈ ఏడాది ఎట్టి

నైరాశ్యంలో నిరుద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విడుదల కాని నోటిఫికేషన్లు

ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న ఉద్యోగాల్లోనే కోత

కొత్త ఉద్యోగాలు ఇప్పట్లో కష్టం

కరోనా ప్రభావంతో భవిష్యత్తులో

భారీగా తగ్గనున్న అవకాశాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘మూడేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. దురదృష్టవశాత్తూ కొద్దిలో రెండు, మూడు ఉద్యోగాలు కోల్పోయాను. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోను ఏదో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేవు. అలాగని ప్రైవేటు ఉద్యోగాలకు ప్రయత్నిద్దామంటే...అక్కడ వున్న వాళ్లనే తొలగించేస్తున్నారు. కొత్త వాళ్లను తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు’


...ఇదీ పీజీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎంవీపీ కాలనీ ప్రాంతానికి చెందిన చెందిన ఓ యువకుడి ఆవేదన. 


అతనొక్కడే కాదు...ప్రస్తుతం ఎంతోమంది యువతీయువకులు ఇదేవిధమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వేలకు వేలు సంపాదించిన వారంతా ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. ఇప్పటికే అనేక సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి. భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించుకునే ఆలోచన చేస్తున్నాయి.


నిరుద్యోగ యువతపై ప్రభావం

ఏటా జిల్లాకు చెందిన వందలాది మంది నిరుద్యోగులు అనేక రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తుంటారు. సాధారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో   జరిగే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో పలువురు ఎంపికవుతుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం వల్ల ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.  


నోటిఫికేషన్లు లేవు.. 

ప్రైవేటు ఉద్యోగాల్లో చేరే వారికంటే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలన్న లక్ష్యంగా పోటీ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య రెట్టింపు ఉంటుంది. జిల్లాలో కొన్ని వేల మంది అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి విడుదలయ్యే నోటిఫికేషన్లు కోసం ఎదురుచూస్తుంటారు. కరోనా వచ్చిన తరువాత ఇవి దాదాపు నిలిచిపోయాయి. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్‌, జూన్‌, జూలై నెలల్లో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఇప్పటికిప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 


ఏం చేయాలో అర్థం కావడం లేదు:  ఎం.చందు, పోటీ పరీక్షార్థుడు 

బీటెక్‌ పూర్తయింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఏదో ఒక ప్రైవేటు సంస్థలోనైనా చేరాలని నిర్ణయించుకున్నారు.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండూ సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ రంగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావడం లేదు. అలా అని ప్రైవేటు సంస్థల్లోను తీసుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. భవిష్యత్తు మొత్తం గందరగోళంగా కనిపిస్తోంది. 

Updated Date - 2020-07-05T09:52:37+05:30 IST