వీరులారా... విజయం మీదే

ABN , First Publish Date - 2022-09-28T08:14:44+05:30 IST

‘అనారోగాన్ని లెక్కచేయకుండా, వాతావరణం అనుకూలించినా, లేకపోయినా, రోడ్లన్నీ కంకర తేలిఉన్నా, స్వేదంతో తడిసి ముద్దవుతూనే మొక్కవోని దీక్షతో అమరావతి సాధనకు మీరు పడుతున్న శ్రమ వృథా

వీరులారా... విజయం మీదే

మీ వెంటే మేమంటూ రైతులకు స్థానికుల భరోసా 

పాదయాత్ర విరామం వేళా అమరావతి స్ఫూర్తి 

అమరావతే రాజధాని: తొడగొట్టి స్పష్టంచేసిన నేతలు 

దమ్ముంటే మహాపాదయాత్రను ఆపాలని సవాల్‌ 

మావి త్యాగాలు కాకపోతే మరింకేంటి?: రైతుల ప్రశ్న 


ఏలూరు/పెదపాడు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘అనారోగాన్ని లెక్కచేయకుండా, వాతావరణం అనుకూలించినా, లేకపోయినా, రోడ్లన్నీ కంకర తేలిఉన్నా, స్వేదంతో తడిసి ముద్దవుతూనే మొక్కవోని దీక్షతో అమరావతి సాధనకు మీరు పడుతున్న శ్రమ వృథా కాదు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా అంతిమ విజయం మాత్రం మీవైపే’... అంటూ అమరావతి పాదయాత్రికులను ఉద్దేశించి పలువురు స్థానికులు దైర్యవచనాలు పలికారు. పాదాల్లో బొబ్బలు, కీళ్ల నొప్పులు, అలసి సొలసిన శరీరాలతో బాధను పంటి బిగువున భరిస్తున్న రైతులకు తమను ప్రోత్సహిస్తూ, ఉత్తేజపరుస్తూ స్థానికులు చెబుతున్న మాటలే ఔషధంగా మారాయి. పాదయాత్రకు మంగళవారం విరామం కావడంతో ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో అందరూ విశ్రాంతి తీసుకున్నారు.


ఈ సమయంలో వివిధ పార్టీల నేతలు రైతులతో కొద్దిసేపు మమేకమయ్యారు. అమరావతి నుంచి పాదయాత్ర ఆరంభించి ఏలూరు వరకూ చేరుకున్న వారిని పేరుపేరునా అభినందించారు. బుధవారం తిరిగి ఏలూరు సమీపాన వంగాయగూడెం నుంచి 17వ రోజు పాదయాత్ర ప్రారంభమై దెందులూరు మండలం కొవ్వలి వరకు 15కిలోమీటర్ల మేర సాగనుంది. 


వెల్లువెత్తిన సంఘీభావం 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులకు మద్దతుగా అనేకమంది తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. మీవెంటే మేమంటూ భరోసా ఇచ్చారు. ‘జై అమరావతి’ నినాదాలతో వారు బస చేసిన కల్యాణ మండపం మార్మోగింది. రైతులు జైలుకెళ్లడానికి సిద్ధం, అంతే తప్ప పాదయాత్ర ఆపేదే లేదని జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. దమ్ముంటే పాదయాత్రను ఆపండంటూ తొడగొట్టి సవాలు విసిరారు. మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, జనసేన ఏలూరు కన్వీనర్‌ రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. 


మేం చేసిన నేరమేంటి? 

‘‘నిలువెల్లా గాయాలతో కాలినడక చేయకలేకపోతున్నా. ఎవరి కోసం ఈ కష్టాలన్నీ? రాష్ట్రం కోసం కాదా, మంచి రాజధాని సాధించాలని కాదా? అయినా మాపై నిందలా? మేం చేసిన నేరమేంటి? నిండైన రాజధానిని కోరుకోవడమేనా? సొంత ఇళ్లు వదిలేసి రాష్ట్రమంతా కాలినడకన తిరగాల్సిన అవసరమేమిటి? అంటే రాజధాని కోసమే అంటూ ప్రజలే సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది’’ అని రాజధాని ప్రాంతం అనంతవరానికి చెందిన మాధవరావు ప్రశ్నలు సంధించారు. ‘‘మేం చేస్తున్నది త్యాగం కాదా? భూములు ఇవ్వడం కూడా త్యాగం కాదా... మీ దృష్టిలో ఇంకేమిటో?’’ అంటూ సర్కారు తీరును వ్యంగంగా తిప్పికొట్టారు. పాదయాత్రకు ఒక్కరోజు విరామం దొరికినా.. తమ ఆలోచన, లక్ష్యమంతా రాజధాని చుట్టూనే తిరుగుతోందని మహిళా రైతులు తేల్చిచెప్పారు. 


కాస్తంత విరామం 

పాదయాత్రలో అలుపు సొలుపు లేకుండా కిలోమీటర్ల తరబడి ప్రయాణించిన వారంతా మంగళవారం ఏలూరులో కాస్తంత సేదతీరారు. విరామ సమయంలో వీరిలో ఉత్సాహం నింపేందుకు మాజీ ఎంపీ మాగంటి బాబు నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమరావతిని కీర్తిస్తూ, పాదయాత్రికులు పడుతున్న కష్టాలను కళాకారులు నృత్యాలతో కళ్లకు కట్టినట్లుగా అభినయించారు. మరికొందరు గీతాలను ఆలపించగా. పాదయాత్రికులు సైతం స్వరం కలిపారు. అమరావతి గొప్పతతాన్ని వివరిస్తూ సాగిన పాటకు రైతులు, మహిళలు పచ్చకండువాలను గాల్లో తిప్పుతూ ‘‘జై అమరావతి.. జైజై అమరావతి’’ అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేసి అలరించారు.


మాగంటి బాబు సైతం కొంతసేపు స్టెప్‌లు వేశారు. ఈ సందర్భంగా పాదయాత్రికుల పాదాలకు ఆయన అభివాదం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలంటూ చిన్నారులు దుర్గమ్మను వేడుకుని పూజలు నిర్వహించారు. కాగా, కైకలూరుకు చెందిన అన్నే రాధాకృష్ణ రూ.2లక్షలు, సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ రూ.1.05లక్షలు, డాక్టర్‌ గోపాలకృష్ణ రూ.55వేలు, కిట్టి పార్టీ సభ్యులు రూ.58వేలు, కమ్మవారి ఐక్యవేదిక రూ.55వేలు చొప్పున పాదయాత్రకు విరాళంగా అందజేశారు. 


గాయాలకు వెన్నుచూపం

అమరావతి సాధనే ఏకైక లక్ష్యం

వారంతా అమరావతి రాజధాని ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న రైతులు, రైతుకూలీలు, మహిళలు.... కంకర రోడ్లు, గుంతలపై కిలోమీటర్ల మేర నడవటంతో కాళ్లు వాచి, బొబ్బలెక్కడంతో పంటి బిగువున బాధను భరిస్తూ నొప్పుల ఉపశమనం కోసం మందులు రాసుకుంటున్నారు. రైతులు విరామం తీసుకుంటున్న క్రాంతి కళ్యాణ మండపంలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. కుటుంబాలను వదిలి అమరావతి నుంచి పాదయాత్రగా నడుస్తున్న తమను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని తుళ్లూరు గ్రామానికి చెందిన కామినేని వనజాక్షి కన్నీంటి పర్యంతమయ్యారు. అయితే రాజధాని అమరావతి కోసం మానసికంగా, శారీరకంగా ఎన్ని గాయాలైనా వెన్నుచూపక ముందుకే సాగుతామన్నారు. అమరావతిని సాధించి తీరుతామని ఆ మహిళలంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు. 


ఒళ్లు బలిసి యాత్ర చేస్తున్నారు

మంత్రి అంబటి వ్యాఖ్యలు

అవనిగడ్డ టౌన్‌/కోడూరు, సెప్టెంబరు 27: అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర... రైతుల పాదయాత్ర కాదని, అది ఒళ్లు బలిసినవారు చేస్తున్న పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కృష్ణాజిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడోవిడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే వారిలో పేద రైతులు ఎవరు లేరన్నారు. యాత్ర చేసే వారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్న వారని అన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న కొందరు టీడీపీ పెద్దలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, ఇప్పుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందన్న భయంతో అమరావతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారన్నారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనో, మీసం మెలేస్తేనో రాదన్నారు. 

Updated Date - 2022-09-28T08:14:44+05:30 IST