గవర్నర్‌ చెంతకు చైర్మన్‌!

ABN , First Publish Date - 2020-02-19T09:44:06+05:30 IST

కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంతో శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ రాజ్‌భవన్‌ తలుపులు తట్టారు. రాజధాని బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు

గవర్నర్‌ చెంతకు చైర్మన్‌!

నా రాజ్యాంగ అధికారాలను కార్యదర్శి ప్రశ్నిస్తున్నారు

ఆయనను తప్పించండి

కొత్త కార్యదర్శిని నియమించండి

విజయరాజును పెట్టండి

విశ్వభూషణ్‌కు షరీఫ్‌ అభ్యర్థన

4 పేజీల వినతిపత్రం సమర్పణ

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కార్యదర్శి తన ఆదేశాలను ధిక్కరించడంతో శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ రాజ్‌భవన్‌ తలుపులు తట్టారు. రాజధాని బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఆయన మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి... మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులయ్యారని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు.


ఆ స్థానంలో విజయరాజును నియమించాలని విజ్ఞప్తి చేశారు. చట్ట సభ చైర్మన్‌ సభ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో గవర్నర్‌ను కలవడం ఇదే ప్రఽథమం. తన ఆదేశాలను పాటించడానికి రెండుసార్లు మండలి కార్యదర్శి నిరాకరించడంతో తప్పని పరిస్థితుల్లోనే గవర్నర్‌ను చైర్మన్‌ కలిసినట్లు సమాచారం. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్‌ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు. అసెంబ్లీకి ప్రస్తుతం ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు శాసనమండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సభలకు వేర్వేరుగా కార్యదర్శులు ఉండేవారు. మండలి కార్యదర్శి రిటైరైన తర్వాత అసెంబ్లీ కార్యదర్శికే ఆ విధులు కూడా అప్పగించారు.


విజయరాజు గతంలో టీడీపీ హయాంలో అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక ఆయన్ను మార్చి బాలకృష్ణమాచార్యులిని ఆ స్థానంలో పెట్టా రు. మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్‌ నాలుగు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ను కూడా ఇచ్చారు.


సభానాయకుడి లేఖ  ధిక్కారమే!

చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్‌ అండ్‌ షక్దర్‌ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి (ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్‌) పంపిన లేఖ.. చైర్మన్‌ అధికారాలను ధిక్కరించడమేనని పేర్కొంటూ దానిపై కౌల్‌ అండ్‌ షక్దర్‌ ప్రస్తావనను ఆయన ఉటంకించారు. ‘సభాపతి రూలింగ్‌ ఎవరూ ప్రశ్నించరానిది. దానిని ఏ రూపంలో ప్రశ్నించినా ధిక్కారమే అవుతుంది. సభలో ప్రకటించినా లేదా ఫైలుపై రాసినా సభాపతి ఆదేశం పాటించాల్సిందే.


తన నిర్ణయానికి కారణాలను కూడా సభాపతి వివరించాల్సిన అవసరం లేదు’ అని కౌల్‌ అండ్‌ షక్దర్‌ పేర్కొన్నట్లు తెలిపారు. సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్‌ పేర్కొన్నారు. ‘కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సభానాయకుడిగా ఉన్న మంత్రి నాకు లేఖ రాశారు. కార్యదర్శికి రాయలేదు. అయినా ఆ లేఖను ఉటంకిస్తూ మండలి కార్యదర్శి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలును నాకు పంపడంలో తన విధిని విస్మరించారు.


పోయిన నెల 27న, ఈ నెల 6న నేను రెండుసార్లు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాను. అయినా పాటించలేదు. ఫైలును నాకు తిప్పి పంపా రు. ఇక దీనిపై ఎటువంటి చర్చ అవసరం లేదని, 48 గంటల్లో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటిన్‌ విడుదల చేయాలని చివరగా నేను ఈ నెల 12న ఆదేశించాను. అప్పుడు కూడా ఆ ఆదేశాలను పాటించకుండా దానిని ఈ నెల 14న తిప్పి పంపారు’ అని వివరించారు. ఇటువంటి అధికారిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటేనే మిగిలిన అధికారులకు కూడా పాఠంగా ఉంటుందని తెలిపారు. బాలకృష్ణమాచార్యుల స్థానంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ విజయరాజును నియమించాలని కోరారు. మండలి ఉపకార్యదర్శి రాజకుమార్‌ వ్యవహార శైలిపైనా ఫిర్యాదు చేశారు. 


గవర్నర్‌కు అన్నీ వివరించాను

గవర్నర్‌ను కలిసిన తర్వా త చైర్మన్‌ షరీఫ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘మండలి పరిణామాలను, సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో కార్యదర్శి తీరును గవర్నర్‌కు వివరించాను. చైర్మన్‌ ఆదేశాలను కాదన్న సందర్భం గతంలో లేదు. నిబంధనలకనుగుణంగానే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. నా రూలింగ్‌ను కార్యదర్శి అమలు చేయడం లేదన్న విషయం ఆయనకు చెప్పి తగు చర్యలు తీసుకోవాలని కోరాను’ అని చెప్పారు.

Updated Date - 2020-02-19T09:44:06+05:30 IST