గొలుసు తెగింది.. చెరువు చెదిరింది

ABN , First Publish Date - 2022-07-30T05:36:35+05:30 IST

మందస మండలంలో రాజుల కాలంలో వేలాది ఎకరాలకు సాగునీరందించే ఆరు చెరువుల గొలుసు కట్ట.. నేడు దయనీయంగా మారింది. చిన్ననీటి వనరుల కోసం రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నా రైతులకు ప్రయోజనం కలుగడం లేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అవసరంలేని చోట్ల పనులు చేపట్టి నిధులు వృథా చేస్తున్నారు. మందస మండలంలో సుమారు ఐదువేల ఎకరాల ఆయకట్టు ఉన్న గొలుసుకట్టు చెరువులు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక భూములన్నీ బీడువారాయి.

గొలుసు తెగింది.. చెరువు చెదిరింది
గొలుసుకట్టులో ప్రధానమైన దామోదరసాగర్‌

- బీడువారుతున్న ఆయకట్టు భూములు
- కాలువల కోసం రైతుల ఎదురుచూపు
- పునరుద్ధరిస్తే ఐదువేల ఎకరాలకు సాగునీరు


(హరిపురం)

 మందస మండలం మధ్యూరు గ్రామంలో సుమారు 270 ఎకరాలకు సాగునీరందించే బంజిరి చెరువు గతంలో నిత్యం నీటితో కళకళలాడేది. రెండు పంటలకు పుష్కలంగా సాగునీరందించేది. నేడు గొలుసు తెగి కాలువలు లేక నీటి ఎద్దడితో ఒక్క పంట కూడా గగనమైంది.  

మందస మండలం వాసుదేవుపురంలో యాసర్ల చెరువు ఆయకట్టు బీటలు వారుతోంది. ఐదేళ్లుగా పంటలకు నోచుకోక.. పొలాలన్నీ బీళ్లుగా మారాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.   


.. ఇలా మందస మండలంలో రాజుల కాలంలో వేలాది ఎకరాలకు సాగునీరందించే ఆరు చెరువుల గొలుసు కట్ట.. నేడు దయనీయంగా మారింది. చిన్ననీటి వనరుల కోసం రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నా రైతులకు ప్రయోజనం కలుగడం లేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అవసరంలేని చోట్ల పనులు చేపట్టి నిధులు వృథా చేస్తున్నారు. మందస మండలంలో సుమారు ఐదువేల ఎకరాల ఆయకట్టు ఉన్న గొలుసుకట్టు చెరువులు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక భూములన్నీ బీడువారాయి. చెరువు కింద పొలాల్లో నీరున్నప్పుడు దమ్ము పెట్టినా పొట్టదశకు వచ్చేసరికి చెరువుల్లో నీరు లేక.. కాలువల్లో నీరు రాక పంటలు ఎండిపోయి అన్నదాతలకు కన్నీటిని మిగులుస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది కనపల చెరువు. పదేళ్ల కిందట మందస సంస్థానాధీశుడి పేరుతో దీనిని దామోదర సాగర్‌గా నామకరణం చేసి అప్పట్లో రూ.2.96కోట్లతో రిజర్వాయర్‌గా నిర్మించారు. ఇది పూర్తయి పదిహేనేళ్లు గడిచినా కాలువలు నిర్మాణానికి నోచుకోక గొలుసుకట్టు చెరువులకు నేటికీ మోక్షం లభించ లేదు. కాలువ నిర్మించాలనే రైతుల కోరిక మేరకు అధికారులు సర్వే చేశారు. అది మరుగున పడింది. మళ్లీ వాటినే సర్వే చేశారు. తొమ్మిదేళ్ల కిందట రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మరో ప్రాంతం గుండా సర్వే నిర్వహించారు. అదీ నేటికీ రూపుదాల్చుకోలేదని ఆయకట్ట దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గొలుసుకట్ట చెరువులకు మరమ్మతులు చేపట్టి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.  

సాగునీటి విస్తీర్ణం ఇలా..
గ్రామం             చెరువు               విస్తీర్ణం          ఆయకట్టు
దేవుపురం          దామోదర సాగర్‌      280 ఎకరాలు     782 ఎకరాలు
మధ్యూరు          బంజీర చెరువు        38 ఎకరాలు      270 ఎకరాలు
వాసుదేవుపురం     యాసర్ల చెరువు       68 ఎకరాలు      360 ఎకరాలు
వాసుదేవుపురం     మర్రిబంద            29 ఎకరాలు      215 ఎకరాలు
అచ్యుతాపురం      చింతలచెరువు         38 ఎకరాలు      296 ఎకరాలు
కుంటికోట         సంకుజోడి కాలువ     12(కిలోమీటర్లు)   1,576 ఎకరాలు
బాలిగాం          సునాముది కాలువ    13(కిలోమీటర్లు)    1,955 ఎకరాలు

బీడువారుతున్నాయి..
పదేళ్లుగా పంట చేతికొచ్చే దశలో ఈ ప్రాంత భూములన్నీ బీడువారుతున్నాయి. పైనే చెరువున్నా నెలరోజులు కూడా నీరు ఉండని దుస్థితి. ఆక్రమణలు, పూడికలతో కాలువలు కుచించుకుపోయాయి. దీంతో ఆయకట్టు భూములకు నీరందక బీళ్లుగా మారాయి.
- ఎం దేవదాసు, ఆయకట్టు రైతు, పిడిమందస.

వలసలే శరణ్యం..
గ్రామాల్లో భూములన్నా పంటలు పండక సగానికి పైగా కుటుంబాలు వలసలు పోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్య చెప్పినా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. పరిసర గ్రామాల ప్రజలకు వలసలే శరణ్యమవుతున్నాయి.  
- సవర చంద్రశేఖర్‌, మాజీఎంపీటీసీ, సవరమధ్య. 

సర్వేలతో సరి
గతంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు కాలువల కోసం సర్వే చేపట్టారు. రాళ్లు వేశారు. మళ్లీ ఏడాదికి డిజైన్‌ మార్చామని చెప్పి రీ సర్వే చేపట్టారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. డిజైన్‌ మార్చి తవ్వకాలు ప్రారంభించిన కాలువలు సైతం సగంలోనే నిలిపివేశారు. ఇది అన్నదాతలను మరింత కుంగదీస్తోంది.
- పినకాన రాజు, నీటి సంఘ అధ్యక్షుడు, దామోదరసాగర్‌ 

పరిశీలిస్తాం
గొలుసుకట్టు చెరువుల విషయాన్ని స్థానిక రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి పై అధికారులకు నివేదిక అందజేస్తా. ప్రజాప్రతినిధుల సహకరిస్తే రైలుకు మేలు జరిగేలా చర్యలు చేపడతాం.
-శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస.  

Updated Date - 2022-07-30T05:36:35+05:30 IST