Service Charge At Restaurants: రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా.. అక్కర్లేదా.. తాజా అప్డేట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-24T22:53:22+05:30 IST

సరదాగా అలా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి చక్కగా డిన్నర్ చేసి బిల్లు కట్టేందుకు సిద్ధపడితే.. ఆ బిల్లుపై ‘Service Charge’ అనే..

Service Charge At Restaurants: రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా.. అక్కర్లేదా.. తాజా అప్డేట్ ఏంటంటే..

న్యూఢిల్లీ: సరదాగా అలా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి చక్కగా డిన్నర్ చేసి బిల్లు కట్టేందుకు సిద్ధపడితే.. ఆ బిల్లుపై ‘Service Charge’ అనే వడ్డింపు కూడా కనిపిస్తుంది. ఈ సర్వీస్ ఛార్జ్ ఎందుకు కట్టాలని ఎవరైనా ప్రశ్నిస్తే రెస్టారెంట్లు అడ్డగోలుగా చెప్పే సమాధానం ‘తగ్గేదేలే.. కట్టాల్సిందే’ అని. రెస్టారెంట్స్ విధించే ఈ సర్వీస్ ఛార్జ్ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. రెస్టారెంట్లకు హెచ్చరిక పంపింది. జూన్ 2న ఈ Service Chargeపై తాడోపేడో తేల్చేస్తామని.. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సమావేశానికి రావాలని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI)కు కేంద్రం లేఖ రాసింది. NRAIకు రాసిన ఈ లేఖలో వినియోగదారుల వ్యవహారాల శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ ఏం చెప్పారంటే.. ఈ సర్వీస్ ఛార్జ్ వ్యవహారం వినియోగదారుల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ సమస్యపై పూర్తి స్థాయిలో లోతుగా సమీక్ష జరిపాల్సిన అవసరం ఉందని వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలిపారు. 2017 ఏప్రిల్ లోనే కేంద్రం రెస్టారెంట్లు విధిస్తున్న ఈ సర్వీస్ ఛార్జ్ పై మార్గదర్శకాలు జారీ చేసింది.



భోజనం వడ్డించిన సిబ్బందికి సర్వీస్ ఛార్జ్ లేదా టిప్ ఎంత ఇవ్వాలన్నది వినియోగదారుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని, రెస్టారెంట్ కు వెళుతున్నాడంటే దాని అర్ధం సర్వీస్ ఛార్జ్ కూడా చెల్లించేందుకు సిద్ధపడి వెళుతున్నాడని కాదని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. సర్వీస్ ఛార్జ్ కట్టకపోతే ప్రవేశం లేదని ఏ రెస్టారెంట్ యాజమాన్యమైన చెబితే అది కచ్చితంగా వినియోగదారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని తెలిపింది. చాలా రెస్టారెంట్లలో 5 నుంచి 10 శాతం సర్వీస్ ఛార్జుల పేరుతో బిల్లులో బాదుతుంటారు. కేంద్రం గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను రెస్టారెంట్లు ఉల్లంఘించడానికి కారణం లేకపోలేదు. అవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే కావడంతో అతిక్రమించిన రెస్టారెంట్ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో.. ఇష్టారాజ్యంగా రెస్టారెంట్లు ఈ సర్వీస్ ఛార్జీలను బిల్లులో కలిపి వినియోగదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.

Updated Date - 2022-05-24T22:53:22+05:30 IST