కోర్టుల్లో వసతులు కావాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు

ABN , First Publish Date - 2021-12-20T08:42:15+05:30 IST

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

కోర్టుల్లో వసతులు కావాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు

  • కేంద్రానికి సమగ్ర ప్రణాళిక పంపించాం
  • కొవిడ్‌ ప్రభావం న్యాయ వ్యవస్థపైనా తీవ్రంగా ఉంది
  • గ్రామీణ న్యాయవాదులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు
  • వరంగల్‌తో ఆత్మీయ అనుబంధం: సీజేఐ జస్టిస్‌ రమణ
  • వరంగల్‌లో 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభం
  • నల్సార్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవ ప్రధాన ప్రసంగం


ఓరుగల్లు/హైదరాబాద్‌/శామీర్‌పేట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ వసతుల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని తెలిపారు. కోర్టుల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడానికి కారణం న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడం మాత్రమే కాదన్నారు. ఆదివారం వరంగల్‌లో 10 కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అనంతరం న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ఏయే రాష్ట్రాలు, ఏయే జిల్లాల్లో కోర్టు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయో, ఆఽధునికీకరించాల్సిన కోర్టు భవనాలేవో తెలుపుతూ సమగ్ర నివేదికను రూపొందించామని తెలిపారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా ఇండియన్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ న్యాయశాఖ మంత్రికి జూలైలోనే నివేదికను పంపించామని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదని అన్నారు. ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా చట్ట రూపంలో తీసుకువస్తారని ఆశతో ఎదురుచూస్తున్నానన్నారు. 


‘‘కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన విధానాన్నే మార్చి వేసింది. ఎందరో జీవితాలను, ఉద్యోగాలను కోల్పోయారు. న్యాయవ్యవస్థపై కూడా కొవిడ్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. ఇంటర్‌నెట్‌ సౌకర్యాలు ఉన్న పట్టణాలు, నగరాల్లో మాత్రం బాగానే ఉన్నప్పటికీ , గ్రామీణ ప్రాంతాల్లోని న్యాయవాదులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్నాను. ఇదే కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులు, పేద న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఒక తరం న్యాయవాదుల వృత్తి అంతరించి పోయే ప్రమాదం ఉందని అర్థమైంది. అందుకే గ్రామీణ, జిల్లా కేంద్రాల్లో మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టంను ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశాను. అవసరమైతే బహుళజాతి సంస్థల కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ స్కీంను ఉపయోగించుకోవాలని సూచించాను. కొవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన  న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాను. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కూడా సరియైున విధంగా స్పందించలేదు. కోర్టుల్లో ఆధునిక వసతుల కల్పన ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సుప్రీంకోర్టులో కేసు వేసి వాదించే అవకాశాలు పెరుగుతాయి. సుప్రీంకోర్టుకు చేరుకుని వేలు, లక్షలు ఫీజులు చెల్లించే అవసరం లేకుండా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలా అని కేవలం ఆన్‌లైన్‌లో కోర్టులు నడవాలని అనుకోవడం లేదు. భౌతికంగా కోర్టులకు వెళ్లే విధానం కూడా ఉండాలి’’ అని జస్టిస్‌ రమణ అన్నారు.


రాజకీయాల్లో తగ్గిపోతున్న న్యాయవాదులు..

న్యాయవాదులు రాజకీయరంగంలో తక్కువ సంఖ్యలో ఉన్నారని సీజేఐ జస్టిస్‌ రమణ అన్నారు. కేవలం వృత్తి ధర్మం, కుటుంబ ప్రయోజనాలే కాకుండా సామాజిక బాధ్యతను కూడా న్యాయవాదులు నెరవేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందరో న్యాయవాదులు ప్రజల హక్కుల కోసం, తమ ఆస్తులను, ప్రాణాలను అర్పించి పరపీడన నుంచి విముక్తి ప్రసాదించారని తెలిపారు. గతంలో న్యాయవాదులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారని, పార్లమెంట్‌, అసెంబ్లీల్లో న్యాయవాదుల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గి పోయిందని పేర్కొన్నారు. న్యాయవాదులంటే సమాజంలో అత్యుత్తమ గౌరవం ఉందని, అవగాహన, మేథోసంపత్తి ఉన్నవారని సమాజానికి మార్గదర్శకులని ప్రజలు భావిస్తారని తెలిపారు. న్యాయవాదులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఆశలను నెరవేర్చాలన్నారు. వరంగల్‌ నగరం.. ఉద్యమాలు, రాజకీయాలు, కళలకు వరంగల్‌ పుట్టినిల్లు అని, వరంగలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. ‘కాకతీయుల కీర్తి కమనీయ కాంతిపుంజమై వెలుగుదారులు చూపించి నడిపించు ఆంధ్రులకు.. అంటూ దాశరథి కవితను ఉద్వేగభరితంగా చదివారు. 


వేయిస్తంభాల శిల్ప కళావైభవం అద్భుతం ..

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా 12 మంది రాష్ట్ర హైకోర్టు జడ్జిలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓరుగల్లు శిల్పా కళా వైభవాన్ని చూస్తున్నామని సీజేఐ జస్టిస్‌ రమణ అన్నారు. శనివారం రామప్ప దివ్యక్షేత్రాన్ని చూశామని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దేవాలయాన్ని చూసి మురిసిపోయామని, ఇంతటి ఘనమైన చారిత్రక సంపదను యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థ గుర్తించడం మనందరం గర్వించాల్సిన విషయమని తెలిపారు. ఆదివారం వేయిస్తంభాల దేవాలయ అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని చూడడానికి నిజంగా రెండు కళ్లు చాలలేదన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామన్నారు. కాకతీయ వారసత్వ కట్టడాలకు దీటుగా వరంగల్‌ 10 కోర్టుల భవన సముదాయాన్ని నిర్మించారని అన్నారు. ఈ కోర్టుకు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్రమైన పుస్తకం, వీడియో రూపొందించి పంపిస్తే.. దేశంలోని అన్ని కోర్టులకు పంపించి ఒక మోడల్‌ కోర్టు నిర్మాణంగా ఆచరించాలని చెబుతానన్నారు. 50 ఏళ్లపాటు సేవలందించిన పలువురు సీనియర్‌ న్యాయవాదులనుసీజేఐ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో పాటు, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌, జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. 


ప్రశ్నించే తత్వం మరవద్దు 

చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు భావిభారత నాయకులుగా ఎదగాలని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఎల్లవేళలా ప్రశ్నించే తత్వాన్ని వదులుకోవద్దని, ప్రశ్నించడం ఆపొద్దని సూచించారు. అన్యాయాన్ని ఎదిరించడంలో ముందుండాలన్నారు. ఈ తరం యువకులు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నట్లు ఎక్కువగా వార్తలు వస్తున్నాయని, అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఆదివారం నల్సార్‌ న్యాయ విశ్వ విద్యాలయ 18వ వార్షిక స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, స్నాతకోత్సవ ప్రధాన ప్రసంగం చేశారు. బెంగళూరులోని నేషనల్‌ లా యూనివర్సిటీ తరహాలో హైదరాబాద్‌లో కూడా ఒక ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నల్సార్‌ యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందన్నారు. నల్సార్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన విద్యార్థులు కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులోనే కాకుండా ట్రయల్‌ కోర్టులో సైతం ప్రాక్టీస్‌ చేయాలని సూచించారు. నిజాన్ని బయటికి తీసుకు రావడంలోనే ఒక జడ్జి, ఒక న్యాయవాది గొప్పతనం ఉంటుందన్నారు. అవసరమైన వారికి న్యాయం అందించడంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,  నల్సార్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఫైజాన్‌ ముస్తఫా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. 

Updated Date - 2021-12-20T08:42:15+05:30 IST