కలిసి అడుగేయనిదే కేంద్రం కరుణించదు!

ABN , First Publish Date - 2022-04-22T09:55:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అస్తిత్వంలోకి వచ్చి దాదాపు ఏడున్నర సంవత్సరాలు దాటుతున్నది. విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సరిహద్దులు, ఆస్తులు, అప్పులను విభజన...

కలిసి అడుగేయనిదే కేంద్రం కరుణించదు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అస్తిత్వంలోకి వచ్చి దాదాపు ఏడున్నర సంవత్సరాలు దాటుతున్నది. విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సరిహద్దులు, ఆస్తులు, అప్పులను విభజన చట్టంలో పొందుపర్చడం జరిగింది. విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా, అవశేష ఆంధ్రప్రదేశ్‌ పుననిర్మాణ దశలో ఉన్నందున రెండు రాష్ట్రాల అభివృద్ధికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వం మారింది. ఇచ్చిన హామీలను పూర్తి చేయాల్సిన రాజ్యాంగ ధర్మాన్ని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.


అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం జరుగుతుందని ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ అంశం పునర్విభజన చట్టంలో పేర్కొనకపోయినప్పటికి అప్పటి బీజేపీ కూడా ప్రత్యేక హోదాకు మద్దతు పలికింది. అంతేగాక, హోదాను పదేళ్లకు కొనసాగించాలని అప్పటి రాజ్యసభ సభ్యులు వెంకయ్యనాయుడు సూచించారు. రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పోనీ ప్రత్యేక హోదా సాధ్యం కాకపోతే రెండు రాష్ట్రాలకు ఇచ్చిన మిగిలిన హామీలు ఏ ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేదో చెప్పవలసిన అవసరం బీజేపీకి ఉన్నది. విభజన చట్టం సెక్షన్‌ 94(3) ప్రకారం నూతన రాజధానికి ఆర్థిక సహాయం చేయాలి. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ స్వయంగా వచ్చారు. రాజధాని నిర్మాణంలో కేంద్ర సహాయం కొరకు భారీ ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశలను కాశీ నుంచి కలశం ద్వారా తెచ్చిన చెంబుడి నీళ్ళతో చల్లార్చారు.


15వ ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం 2021–22లో కేంద్ర పన్నుల విభజనలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 4.4శాతం నుంచి 4.31కు తగ్గిపోయింది. తెలంగాణకు  2.37శాతం నుంచి  2.1శాతానికి పడిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించవలసిన విభజన సమస్యలెన్నో ఉండగా కేంద్రం తగువులు పెట్టి తమాషా చూస్తున్నది. విభజన చట్టంలోని 9, 10షెడ్యూళ్ల ప్రకారం అనేక భవనాలు, భూములు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో వేలకోట్ల ఆస్తులు ఉన్నవి. మూలధన నిల్వల కింద, ఋణాలు అడ్వాన్సుల కింద, డిపాజిట్లు, ఇతర అడ్వాన్సుల కింద దాదాపు రెండు లక్షల కోట్ల విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత కూడా ఈ అంశాల్లో విభజన లేక పంపిణీలు పూర్తి కాలేదు. అలాగే ఢిల్లీలోని ఆంధ్రభవన్‌, సింగరేణి కాలరీస్‌ ఆస్తులు, సీలేరు జలవిద్యుత్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కార్పోరేషన్‌ విభజన తదితర అంశాలపై విభేదాల పరిష్కారం కొరకు కేంద్రం ఎటువంటి ఏ చొరవా చూపలేదు. 2019 నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య కనీసం ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు.


తెలంగాణ విషయంలో కేంద్రం ఎంతో అన్యాయంగా వ్యవహరించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం ఆపాయింటెండ్‌ డే నుంచి ఆరు నెలల్లోగా తెలంగాణలోని ఖాజిపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థాపించడానికి, రాష్ట్రంలో రైల్‌ కనెక్టివిటి మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత ఏడేళ్లలో రైలు కనెక్టివిటి పెరగలేదు. కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు. 2022–23 నుంచి నాలుగేళ్ల పాటు రాష్ట్ర నిర్దిష్ట గ్రాంటులకోసం రూ.20,362కోట్లు తెలంగాణకు కేటాయించాలన్న 15వ ఆర్థిక సంఘ సిఫారసులను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. నీతిఆయోగ్‌ సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.24,205 కోట్లు విడుదల చేయాలని అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ డిమాండ్‌ చేస్తూ ఉన్నది. అదేవిధంగా నీతిఆయోగ్‌ సిఫారసుల ప్రకారం మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5,205కోట్లు విడుదల చేయాలి. వాటినీ కేంద్రం విస్మరించింది. నీతిఆయోగ్‌ పేరుతో ఆర్థిక సహాయాలను అడ్డుకునే కేంద్రం నీతిఆయోగ్‌ సూచనలు పాటించాలి కదా? అలాగే తెలంగాణలోని బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారానికి హామీ ఇచ్చారు. బయ్యారం ప్రాంతంలో 54శాతం నుంచి 65శాతం (ఎఫ్‌ఈ) నాణ్యత కలిగిన లక్షలాది కోట్ల రూపాయల విలువచేసే ఇనుప ఖనిజం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ జియోలాజికల్‌ సర్వే నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను బుట్టదాఖలు చేసింది. 2011లో బయ్యారం ప్రాంతంలోని వేలాది ఎకరాలను రక్షణ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అల్లునికి లీజుకిచ్చిన దరిమిలా ఆ కుంభకోణాన్ని అసెంబ్లీలో ఈ వ్యాసకర్త బయటపెట్టడం జరిగింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, ఇతర ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఆందోళనలు చేశాయి. అలాగే కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండును కేంద్రం విస్మరించింది. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు నిధులు, హైదరాబాద్‌ ఫార్మాసిటి, టెక్స్‌టైల్స్‌ అండ్‌ హ్యాండ్‌లూమ్స్‌ కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదు. జిఎస్‌టితో ఒకవైపు రాష్ట్రాలు భారీగా నష్టపోతుంటే కేంద్రం మాత్రం విడతలవారీ పరిహారాన్ని ఇస్తున్నది. తెలంగాణకు రూ.4,073కోట్లు జిఎస్‌టి బకాయిలు ఉన్నవి. గత ఏడేళ్లలో దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడు ఐఐటిలను, ఏడు ఐఏఎంలను, 16 ఐఐఐటిలను, 157 మెడికల్‌ కళాశాలలను, 84 నవోదయ విద్యాలయాలను, 50 కేంద్రీయ విద్యాలయాలను మంజూరుచేసినా తెలంగాణలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ, మైనింగ్‌ యూనివర్సిటీ ఊసేలేదు. అసెంబ్లీ స్థానాలను 119 నుండి 153కి పెంచడానికి ఇచ్చిన హామీని విస్మరించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక హోదా, నూతన రాజధానికి సహాయాన్ని కుంటి సాకులతో వదిలివేశారు.


కేంద్రం ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇంతే అన్యాయంగా వ్యవహరించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2) ప్రకారం 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడిన రెవిన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలి. ఆడిట్‌ లెక్కల ప్రకారం ఆ ఏడాది రూ.16,079కోట్లు రెవిన్యూలోటుగా తేల్చారు. ఆ లోటును ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. దుగ్గరాజపట్నంలో నౌకాశ్రయ స్థాపన, కడపలో ఉక్కు కర్మాగారం, వైజాగ్‌లో కొత్త రైల్వే జోన్‌, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మెట్రో రైలు, వైజాగ్‌, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించడం, శాసనసభ స్థానాలను 175 నుండి 225కు పెంచడం లాంటి సమస్యలు అలాగే ఉన్నాయి. 13వ షెడ్యూలు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఏఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐఐటి, ఎయిమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, గిరిజన యూనివర్శిటి, కేంద్ర వ్యవసాయ యూనివర్సిటీలు పెండింగులో ఉన్నాయి.


రెండు రాష్ట్రాలు పాలనాపరంగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజల మధ్య అనుబంధాలు అలానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని రాజకీయ భేషజాలు విడనాడి అన్ని అంశాలపై పట్టువిడుపులతో చర్చించి పరిష్కరించుకోవాలి. కృష్ణా, గోదావరి నదీజలాల సమస్య పరిష్కారానికి కేంద్రానికి అప్పీల్‌ చేస్తే రెండు నదులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకునే విధంగా రెండు గెజిట్‌ నోటిఫికేషన్లు ఏకపక్షంగా విడుదల చేశారు. రాజ్యాంగంలోని ఎంట్రీ 17 ప్రకారం ఇరిగేషన్‌ రాష్ట్ర జాబితాలోనిది. దీని అర్థం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజనీతిజ్ఞత ప్రదర్శించకపోతే రెండు రాష్ట్రాల జవసత్వాలను పీల్చి పిప్పిచేయడానికి కేంద్రం సంసిద్ధంగా ఉన్నది.

కూనంనేని సాంబశివరావు

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ

Updated Date - 2022-04-22T09:55:29+05:30 IST