ధాన్యంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి

ABN , First Publish Date - 2021-12-03T06:42:46+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

ధాన్యంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం, పక్కన చెరుపల్లి సీతారాములు

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

సూర్యాపేటరూరల్‌, డిసెంబరు 2: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని రాయినిగూడెంలో గురువారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి వరి సాగు విషయంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై పార్లమెంట్‌ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఖర్చులు పెరిగాయనే సాకుతో చార్జీలు భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రజలపై విద్యుత్‌ భారం పడకుండా సర్దుబాటు చేయాలన్నారు. లేదంటే ప్రజలపక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యమం ప్రభుత్వాలను తలకిందులు చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలు పరాకాష్టకు చేరాయన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ ఉత్త చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మోదీ అపాయిమెంట్‌ ఇచ్చారా, అనే విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం లేదన్నారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, నాయకులు జూలకంటి రంగారెడ్డి, మల్లు నాగార్జున్‌రెడ్డి, ముల్కలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, ధీరావత్‌ రవినాయక్‌, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:42:46+05:30 IST