అవినీతి నేతల రాతలు తేల్చేందుకు కేంద్రం రెడీ!

ABN , First Publish Date - 2020-09-17T07:35:43+05:30 IST

అవినీతి నేతల సంగతి తేల్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది...

అవినీతి నేతల రాతలు తేల్చేందుకు కేంద్రం రెడీ!

  • నిర్దిష్ట కాలవ్యవధిలోపు తేల్చాల్సిందే
  • సుప్రీం ఎలాంటి ఉత్తర్వులిచ్చినా స్వాగతిస్తాం

  • అన్నిరకాల సహాయ సహకారాలూ అందిస్తాం
  • అదనపు కోర్టులు, నియామకాలకు నిధులు
  • సుప్రీం ధర్మాసనానికి కేంద్రం విస్పష్ట హామీ
  • హైకోర్టుల్లో స్టే ఉంటే ఎత్తివేయించాలని విజ్ఞప్తి
  • అమికస్‌ క్యూరీ సిఫారసులకు సంపూర్ణ మద్దతు
  • నేతలపై క్రిమినల్‌, అవినీతి కేసుల పరిష్కారానికి
  • జిల్లాకో ప్రత్యేక న్యాయస్థానం
  • గరిష్ఠంగా ఏడాదిలోపు కేసులు తేల్చాలి
  • ఆర్థిక అవినీతి కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం
  • సుప్రీం కోర్టుకు అమికస్‌ క్యూరీ నివేదిక
  • తుది ఉత్తర్వులు రిజర్వు చేసిన ధర్మాసనం
  • జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో విచారణ
  • నేటి ఉదయంలోపు తుది ఉత్తర్వులు


నేతలపై పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందా?

కేసుల సంఖ్యను బట్టి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించాలని భావిస్తున్నాం. యావజ్జీవ శిక్ష పడే కేసులతో పాటు అవినీతి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

- జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అవినీతి నేతల సంగతి తేల్చేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న అవినీతి, ఆర్థిక నేరాలతోపాటు క్రిమినల్‌ కేసులను నిర్దిష్ట కాల వ్యవధిలో తేల్చాలన్న సుప్రీం కోర్టు సూచనను స్వాగతించింది. ‘ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. ఆ కేసులను గరిష్ఠంగా ఏడాదిలోపే పరిష్కరించాలి. యావజ్జీవం/మరణ శిక్ష పడే కేసులను తొలి ప్రాధాన్యంలో ఉంచాలి. ఆ తర్వాత... అవినీతి నిరోధక చట్టం, నగదు అక్రమ చలామణి (పీఎల్‌ఎంఏ) కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అంటూ ఈ విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా చేసిన సిఫారసులకు మద్దతు పలికింది. ‘‘అలాగే తేల్చేద్దాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. అవసరమైన నిధులూ ఇస్తుంది. నేతలపై కేసులు నిర్దిష్ట కాలావధిలో తేలాల్సిందే. దీనికోసం వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలు, అదనపు కోర్టు హాళ్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రిసైడింగ్‌ అధికారుల నియామకం... ఇలా అవసరమైన అన్ని ఏర్పాట్లకు తగిన ఆర్థిక సహాయం కూడా చేస్తాం’’ అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు విస్పష్టమైన హామీ ఇచ్చారు.


ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను త్వరగా తేల్చడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వని కుమార్‌  ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై బుధవారం జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌  జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ‘నేతలపై పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందా?’ అని జస్టిస్‌ రమణ ప్రశ్నించగా... ‘నూటికి నూరు శాతం’ అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇచ్చారు. ‘‘ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ కేసులను నిర్దిష్ట వ్యవధిలో తేల్చాల్సిందే. ఆయా కేసుల విచారణపై ఒకవేళ హైకోర్టు స్టే విధించి ఉంటే... సత్వరం తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించాలి. ఎలాంటి స్టే లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ వంటివి) ఆయా కేసుల్లో ముందుకు వెళ్లకపోతే... ఈ విషయాన్ని వెంటనే తదుపరి దశకు తీసుకెళతాం’’ అని తెలిపారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. కానీ, చాలా రాష్ట్రాలు నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు (యూసీ) అందించలేదని తెలిపారు. ‘‘కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు ఉంటే నెలరోజుల్లో సరిదిద్దుకోవాలని రాష్ట్రాలను ఆదేశించండి’’ అని తుషార్‌ మెహతా సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను న్యాయశాఖ నుంచి పొందాలని, అది చూసి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచన చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది.


కార్యాచరణ ప్రణాళిక..

సిట్టింగ్‌, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌, అవినీతి, మనీలాండరింగ్‌ తదితర కేసుల సత్వర పరిష్కారానికి అమికస్‌ క్యూరీ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకొని వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, పెండింగ్‌లో ఉన్న విచారణ ఎలా పూర్తి చేస్తారో బ్లూప్రింట్‌ ఇవ్వాలని హైకోర్టులను కోరుతామని జస్టిస్‌ రమణ తెలిపారు. ‘‘కేసుల సంఖ్యను బట్టి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించాలని భావిస్తున్నాం. యావజ్జీవ శిక్ష పడే కేసులతో పాటు అవినీతి కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక కోర్టుకు ఒకే అంశానికి చెందిన కేసులను అప్పగిస్తే... మిగతా కేసులు అసలు విచారణకే రావు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా ఒక సమస్యగా ఉంది. చార్జిషీట్లు దాఖలు చేయడం, సమన్లు జారీ చేయడం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం వంటివి ముఖ్యమైనవి. వీటిని 15 రోజుల్లో పరిశీలించాలని హైకోర్టులకు సూచిస్తాం’’ అని జస్టిస్‌ రమణ తెలిపారు. దీనిపై గురువారం ఉదయం కల్లా ఉత్తర్వులిస్తామని ప్రకటించారు. 


ఎఫ్‌ఐఆర్‌లతో సరి...

కొన్నిచోట్ల సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో సరిపెడుతున్నాయని జస్టిస్‌ రమణ అన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించకపోవడం, మౌలిక సదుపాయాలు లేమి, చార్జిషీట్లు దాఖలు చేయకపోవడం వంటి కారణాలతో ప్రాసిక్యూషన్‌ జరగడం లేదని తెలిపారు. క్రిమినల్‌ కేసులతో పాటు ఈడీ, సీబీఐ తదితర కేసులు కలిపి మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. 4600పైగా కేసులు ఉంటాయని అమికస్‌ క్యూరీ తెలిపారు. అందులో సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసులు 175 ఉన్నాయని వివరించారు.


కేసుల విభజన..

ప్రజా ప్రతినిధులకు సంబంధించి క్రిమినల్‌, మనీలాండరింగ్‌, అవినీతి... మొదలైన కేసులు కొన్ని ప్రత్యేక కోర్టులు చూస్తుంటే మరికొన్ని దిగువస్థాయి కోర్టుల పరిశీలనలో ఉన్నాయని అమికస్‌ క్యూరీ వెల్లడించారు. ఉదాహరణకు... తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులకు ప్రత్యేక కోర్టు ఉండగా 13 కేసులు సీబీఐ కోర్టు వద్ద విచారణలో ఉన్నాయని వివరించారు. ఒక న్యాయమూర్తికి నిర్దిష్ట సంఖ్యలో కేసులు అప్పగించాలని తుషార్‌ మెహతా ప్రతిపాదించారు.   


జీవితకాల నిషేధంపై సోమవారం విచారణ

శిక్ష పడిన ప్రజాప్రతినిధులు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ అశ్విని కుమార్‌ దాఖలు చేసిన... సవరించిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై 200లకుపైగా సెక్షన్లతో 38 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గత ఏడాది ఏడీఆర్‌ సంస్థ రూపొందించిన నివేదికను కోర్టుకు సమర్పించానని అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ మీడియాకు చెప్పారు.


తెలంగాణలో కేసులు..

‘‘తెలంగాణలో అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన 13 కేసుల్లో ఎక్కువగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. అయితే, ఆ ఎమ్మెల్యేల పేర్లు మేం బయటికి చెప్పదల్చుకోలేదు.’’ అని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా కోర్టుకు చెప్పారు. ఈ కేసుల్లో త్వరగా విచారణ ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని  విజ్ఞప్తి చేశారు. అభియోగ పత్రాలు దాఖలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడం, న్యాయాధికారులు లేకపోవడం వల్ల గత నాలుగేళ్లుగా సంబంధిత కోర్టులు కేసులకు పాసింగ్‌ ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల్లో అత్యధికంగా అభియోగ పత్రాలు సమర్పించే దశలోనే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 


దేశమంతా ఎన్నో కేసులు..

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల గణాంకాలు కలచివేసేలా ఉన్నాయని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4442 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అందులో 2556 కేసులు సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులపై ఉన్నాయని వివరించారు. ఇవి కాకుండా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టంతో సహా ఇతర ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో ఒకటి చొప్పున ప్రత్యేక కోర్టులు ఉన్నాయని ప్రస్తావించారు. పలు అవినీతి కేసులు సీబీఐ కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.  ఈడీ, సీబీఐ వంటి తదితర కేంద్ర సంస్థలు నమోదు చేసిన కేసుల స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. వాటి విచారణ, దర్యాప్తుపై ఏమైనా సమాచారం ఉందా అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ... 2012, 2013, 2014లో ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఎక్కువగా విచారణ ప్రారంభం కాలేదన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థల వైపు నుంచే దర్యాప్తు సాగడం లేదని వాదిస్తున్నారా? అని బెంచ్‌ ప్రశ్నించింది. దీనికి అమికస్‌ క్యూరీ సమాధానమిస్తూ ‘‘కొన్ని కేసుల దర్యాప్తుపై స్టేలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో అభియోగాలు దాఖలు చేయలేదు. ఈ కారణాల వల్ల కేసులు ముందుకు సాగడం లేదు’’ అని చెప్పారు. సాక్షులు కోర్టుకు రావడానికి అవసరమయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ప్రతిపాదించారు. 

Updated Date - 2020-09-17T07:35:43+05:30 IST