జాతీయ గీతానికి శత వార్షికోత్సవాలు జరపాలి

ABN , First Publish Date - 2022-01-17T05:56:12+05:30 IST

జాతీయ గీతాన్ని అందించి వందేళ్లు పూర్తయినా శత వార్షికోత్సవాలు నిర్వహించక పోవడంపై ఓ వ్యక్తి పాదయాత్ర చుపట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా సాగిన పాదయాత్ర ఆదివారం ఉదయం ములకలచెరువుకు చేరుకుంది.

జాతీయ గీతానికి శత వార్షికోత్సవాలు జరపాలి
ములకలచెరువుకు చేరుకున్న పాదయాత్ర

శ్రీకాకుళం నుంచి మదనపల్లె వరకు పాదయాత్ర


ములకలచెరువులో ఘనస్వాగతం


ములకలచెరువు, జనవరి 16: జాతీయ గీతాన్ని అందించి వందేళ్లు పూర్తయినా శత వార్షికోత్సవాలు నిర్వహించక పోవడంపై ఓ వ్యక్తి పాదయాత్ర చేపట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా సాగిన పాదయాత్ర ఆదివారం ఉదయం ములకలచెరువుకు చేరుకుంది. శ్రీకాకుళం నుంచి మదనపల్లె వరకు పాదయాత్ర చేపట్టాడు. ములకలచెరువు మండలం నాయనిచెరువుపల్లెకు చెందిన ప్రజాపతి గత ఏడాది డిసెంబరు 6న జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి నుంచి తొలి సారి జనగణమణ గీతాలాపాన జరిగిన మదనపల్లె వరకు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల మీదుగా 52 రోజులు సాగిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది.  ఈ సందర్భంగా ప్రజాపతి మాట్లాడుతూ... జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని దేశానికి అందించిన ఘనత తెలుగు నేలదన్నారు. జాతీయ గీతాన్ని అందించి వందేళ్లు పూర్తయినా శత వార్షికోత్సవాలు నిర్వహించకపోవడం కేంద్రానికి తగదన్నారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని తీర్చదిద్ది ఇస్తే... మదనపల్లె బీటీ కళాశాలలో 1919లో జనగణమణ కవితను గీతంగా రవీంద్రనాఽథ్‌ ఠాగూర్‌ మలిచారన్నారు. 1950లో జాతీయ గీతంగా రాజ్యసభ స్వీకరించిందన్నారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వందేళ్ల ఉత్సవాలు జరపకుండా దేశ ద్రోహానికి పాల్పడుతోందన్నారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీటీ కళాశాలలో వంద జాతీయ పతాకాలను ఎగురవేసి పాదయాత్రను ముగిస్తానన్నారు. శత వార్షికోత్సవాలు జరపకుంటే త్వరలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రెండో విడత పాదయాత్ర చేపడుతానన్నారు. 

Updated Date - 2022-01-17T05:56:12+05:30 IST