కులం చిదిమిన కల!

ABN , First Publish Date - 2022-08-16T06:27:54+05:30 IST

డెబ్భయి ఐదో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్న పాతికేళ్ల కాలానికి జాతికి ఐదు సంకల్పాలను నిర్దేశించారు...

కులం చిదిమిన కల!

డెబ్భయి ఐదో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్న పాతికేళ్ల కాలానికి జాతికి ఐదు సంకల్పాలను నిర్దేశించారు. శతమానం పూర్తయ్యే సమయానికి సంపన్న భారత నిర్మాణానికి కావలసిన చైతన్యాన్ని అందించి, ప్రస్థానపథాన్ని సూచించడం దేశాధినేతగా మోదీ విధి. అభివృద్ధి, నిశ్శేషంగా బానిసతత్వం నుంచి విముక్తి, వారసత్వానికి గర్వించడం, కలసికట్టుగా ఉండడం, పౌరులు తమ బాధ్యతలు నిర్వహించడం అన్నవి ప్రధాని సూచించిన ఐదు సంకల్పాలు. వీటికి ఆయన ‘పంచ ప్రాణాలు’ అని నామకరణం చేశారు. ఈ ఐదు అంశాలూ కాకుండా, స్త్రీ శక్తి గురించి ఆయన తన ప్రసంగంలో అధికంగా ప్రస్తావించారు. అవినీతి, బంధుప్రీతి వగైరా షరా మామూలే. ఏవేవో కొత్త పథకాలో, వరాలో ప్రకటించడం కాకుండా, కేవలం ఉద్బోధలకే ప్రధాని పరిమితమయ్యారు.


మోదీ చెప్పినవాటిలో కాదనేవి ఏవీ లేవు కానీ, భారతదేశం తన సమున్నత గమ్యాన్ని చేరుకోవడానికి చెప్పుకోవలసిన ముఖ్యసంకల్పం మరొకటి ఉన్నది. అది కేవలం ఒకానొక సంకల్పం కాదు. అతి ముఖ్యమైన, కీలకమైన సంకల్పం. అది భారత సమాజంలోని కులోన్మాదాన్ని నిర్మూలించడం. దేశప్రగతికి అది ముఖ్యమైన షరతు అని ప్రధాని ఎందుకు భావించలేదో తెలియదు కానీ, ఆయన ప్రధానంగా చెప్పిన పంచప్రాణాలను ఫలితాన్ని సాధించకుండా చేయగలిగేది సామాజిక అంతరాల వ్యవస్థే. మానవవనరుల సంపూర్ణ వికాసానికి ఆటంకమైన కులవ్యవస్థ, ఆర్థిక ప్రగతికి కూడా అవరోధమే. వలసభావాలకు బానిసత్వం గురించి మాట్లాడుతున్నారు కానీ, తరతరాలుగా దేశంలో ఉంటూ వస్తున్న బానిసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రస్తావించడం లేదు. సాంస్కృతిక వారసత్వం గురించి గర్వించాలనుకుంటే, వెంటనే పంటి కింది ముల్లులాగా గుచ్చుకునేది కులమే. కులాన్ని తొలగించిన తరువాత దేశ సాంస్కృతిక వారసత్వంలో గర్వించదగినదేమిటో తెలిసివస్తుంది. ఇక సమైక్యతకు కులభేదాలు ఎంతటి నిరోధకాలో తెలిసిందే. హక్కులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్న మనుషులే, సాధికార మానవులే బాధ్యతలు కూడా నిర్వర్తించగలరని వేరే చెప్పనక్కరలేదు కదా?


ఇంటింటికి మూడు రంగుల జెండా అన్న కార్యక్రమం ప్రారంభమైన రోజే, ఆగస్టు 13 శనివారం రోజున రాజస్థాన్ జలోర్ జిల్లాలోని సురానా గ్రామానికి చెందిన ఒక దళిత పిల్లవాడు మరణించాడు. అతని మరణానికి కారణం అనారోగ్యమో ప్రమాదమో కాదు. చదువు చెప్పే ఉపాధ్యాయుడే కులోన్మాదంతో హింసిస్తే, మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో, పైగా ఆ బడిపేరు సరస్వతి విద్యా మందిర్ అట, మూడో తరగతి చదువుతున్న ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే దళిత విద్యార్థి, జూలై 20వ తారీఖున తెలిసో తెలియకో తన ఉపాధ్యాయుడు ఛైల్‌సింగ్ వాడుకునే మంచినీటి కుండ నుంచి నీళ్లు తీసుకుని తాగాడు. అంటరానివాడివి, నా కుండ ముట్టుకుంటావా అని ఆ టీచర్ పిల్లవాడిని తీవ్రంగా కొట్టాడు. గూబ మీద, కళ్ల మీద కొట్టడం వల్ల, ఆయువు పట్ల మీద తగిలి ఇంద్ర స్పృహతప్పిపోయాడు. ఒక కాలు, చేయి చలనం లేకుండా పోయాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి, ఆ తరువాత జిల్లా ఆస్పత్రికి, అక్కడా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పొరుగు రాష్ట్రంలో అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు. దీర్ఘకాలం చికిత్స ఫలించక, చివరకు పిల్లవాడు కన్నుమూశాడు. ఇది, మన దేశ సామాజిక చిత్రపటం.


చివరకు, ఆ టీచర్ మీద ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు కానీ, అది అంత సులువుగా జరగలేదు. ఊళ్లోని రాజపుత్రులంతా హంతక ఉపాధ్యాయుడికి అండగా వచ్చారు. ‘‘మీ పిల్లలు, మా పిల్లలు కలసి చదువుకోవాలి కదా, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటే ఎట్లా?’’ అంటూ రాయబారాలు, బెదిరింపులు సాగించారు. పరిహారాల కోసం అనధికార వ్యవహారాలు నడపడానికి రెవిన్యూ, పోలీసు అధికారులు కూడా ప్రయత్నించారు. ‘‘బాధిత కుటుంబం మా మాట వినడానికి సిద్ధంగానే ఉంది, ఈ దళిత సంఘాల వాళ్లు వచ్చి వాళ్లను రెచ్చగొడుతున్నారు’’ అంటూ పోలీసులు లాఠీచార్జీలు చేశారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వైఖరి గురించి చెప్పనక్కరలేదు. పిల్లవాడి మరణానికి బాధ్యుడు రాజపుత్ర కులానికి చెందిన వాడు. ముఖ్యమంత్రిది కూడా అదే సామాజిక వర్గం. ప్రతిపక్ష నేతలదీ అదే కులం. మూడున్నర దశాబ్దాల కిందట రూప్ కన్వర్ సతి సందర్భంగా స్పందనలు ఎట్లా ఉన్నాయో దాదాపుగా ఇప్పుడూ అదే ధోరణి. పరిహారం ప్రకటించాను, దోషిని అరెస్టు చేశాము, ఇంకేమి చేయాలి, ఇంకేమి కావాలి.. అంటూ అసహనంగా ప్రశ్నిస్తాడు గెహ్లాట్. పాఠశాలలో రెండు కుండల పద్ధతి ఏమిటి? టీచర్లలో ఆ కులతత్వం, దౌర్జన్యం ఏమిటి, వీటన్నిటి మీదా చర్య తీసుకుంటానని చెప్పాలి కదా, ఏ స్కూల్‌లోనూ రెండు కుండల పద్ధతిని అనుమతించబోమని ప్రకటించాలి కదా? దీనిని ఒక విడి సంఘటనగా చూడడమే తప్ప, ఒక సామాజిక దౌష్ట్యం అన్న అవగాహనే లేదు. ప్రతిపక్ష బిజెపి కూడా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నది తప్ప, అక్కడి సమాజంలో పాతుకుపోయిన అస్పృశ్యతను, కులోన్మాదాన్ని తొలగించాలని డిమాండ్ చేయదు, తొలగించడానికి తాము స్వయంగా ఉద్యమిస్తామని కూడా చెప్పదు.


ఏడెనిమిదేండ్ల చిన్నవాడు, గొడ్డుచాకిరి తప్ప మరే భవిష్యత్తు లేని మునుపటి కాలానికి చెందినవాడు కాదు. ఖర్చు పెట్టుకుని మరీ ప్రైవేటు స్కూలులో చదివించి జీవితంలో పై మెట్టుకు ఎదిగించాలనుకునే తల్లిదండ్రులు ఉన్నవాడు. అతని పసికలలు, అతని కుటుంబం కలలు అన్నీ సామాజిక దుర్మార్గం కింద అణగారిపోయాయి. ఇది కేవలం ఒక మరణం కాదు, అనేక ఆశలను నిరుత్సాహపరిచే దాడి కూడా. మానవ ఆకాంక్షలను ఇంతగా చిదిమిపారేసే కులోన్మాదం, స్వాతంత్ర్యానంతరం ముప్పాతిక శతాబ్దానికి కూడా విర్రవీగే స్థాయిలో ఉండడం, దానిమీద పోరాడాలనే ఉద్దేశ్యమే లేకుండా భవిష్యత్తును నిర్మించాలనుకోవడం విషాదం. 

Updated Date - 2022-08-16T06:27:54+05:30 IST